Delhi Meerut Rapid Rail: మరో కొత్త ట్రైన్ వచ్చేస్తోంది,ఈ సారి ర్యాపిడ్ రైల్ - మొదట ఆ రూట్‌లోనే
Delhi Meerut Rapid Rail: త్వరలోనే ర్యాపిడ్ రైల్ అందుబాటులోకి రానుంది.
Delhi Meerut Rapid Rail:
ర్యాపిడ్ రైల్..
రైల్వే రంగంలో భారీ సంస్కరణలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. అందులో భాగంగానే హై స్పీడ్ ట్రైన్‌లను పట్టాలెక్కిస్తోంది. ఇప్పటికే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటు మరి కొన్ని కొత్త రైళ్లనూ తీసుకు రానుంది. మరో మూడు వారాల్లో తొలి ర్యాపిడ్ రైల్ పట్టాలెక్కనుంది. విమానం లాంటి సౌకర్యాలున్న ఈ Rapid Rail సర్వీస్‌లు సాహిబాబాద్ నుంచి మొదలు కానున్నాయి. సాహిబాబాద్ నుంచి ఘజియాబాద్ వరకూ 17 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. వచ్చే నెల ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు సంబంధించిన ట్రాక్ తయారీ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోనుంది ఈ ర్యాపిడ్ రైల్. దుహాయ్ డిపోట్ నుంచి సాహిబాబాద్ మధ్యలో ఈ రైల్ పరుగులు పెడుతుంది. మొత్తం ఈ రూట్‌లో 5 స్టేషన్లు ఉంటాయి. సాహిబాబాద్, ఘజియాబాద్, గుల్‌ధర్,దుహాయ్ డిపోట్ వరకూ ప్రయాణం కొనసాగుతుంది. ఈ రైళ్లలో ప్రయాణించాలనుకునే వాళ్లు మొబైల్‌లోనూ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఇందులో స్పెషాల్టీ ఏంటంటే...పేషెంట్స్ కోసం ప్రత్యేకంగా ఓ కోచ్‌ను ఏర్పాటు చేశారు. రోడ్డు మార్గం ద్వారా వెళ్లలేని వాళ్లు కోచ్‌లో మీరట్ నుంచి ఢిల్లీకి సులువుగా ప్రయాణం చేసేందుకు వీలుంటుంది. అది కూడా తక్కువ ఖర్చుతో. మహిళలకూ ప్రత్యేక కోచ్‌లు ఉన్నాయి. 55 నిముషాల్లో గమ్యస్థానానికి చేర్చుతుంది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులూ కల్పించారు. వైఫై ఫెసిలిటీ ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ ఏసీ సిస్టమ్ కూడా ఉంది. ఆటోమెటిక్ డోర్ కంట్రోల్, లగేజ్ స్టోరేజ్, డ్రైవర్ ఇంటరాక్షన్ సిస్టమ్...ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి.
వందేభారత్ స్లీపర్ ట్రైన్‌లు..
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. రైల్వే రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ఇటీవలే కేంద్రం రూ.2.40 లక్షల కోట్లు కేటాయించింది. మరి కొత్త రైళ్లను త్వరలోనే తీసుకొస్తామని ఇటీవలే రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర ప్రకటన చేశారు. వందేభారత్ ట్రైన్‌లకు స్లీపర్ వర్షన్ రైళ్లు త్వరలోనే అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేశారు. ఈ ఏడాది డిసెంబర్‌లోనే తొలి వందేభారత్ స్లీపర్ ట్రైన్ పట్టాలెక్కనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఉన్న వందేభారత్ ట్రైన్స్‌లో కేవలం చైర్‌కార్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దాదాపు 500-600 కిలోమీటర్లు కవర్ చేసేస్తాయి ఈ రైళ్లు. అయితే... అంతసేపు అలా కూర్చుని ప్రయాణించే బదులు హాయిగా ప్రయాణికులు విశ్రాంతి తీసుకునేలా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని భావించారు. ఇందులో భాగంగానే స్లీపర్ కోచ్‌లను జోడించాలని ప్లాన్ చేస్తోంది రైల్వే శాఖ. దూర ప్రయాణాలు చేసే వారికి ఈ వసతి ఎంతగానే ఉపయోగపడుతుందని భావిస్తోంది. 400 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరం ప్రయాణించే మార్గాల్లో ఈ స్లీపర్ వందేభారత్ ట్రైన్స్‌ను తీసుకురావాలని యోచిస్తోంది. తక్కువ సమయంలోనే సౌకర్యంగా గమ్య స్థానాలకు చేరుకునే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.ఈ నిర్ణయం అమలు చేస్తే ఆదాయం పెరగడంతో పాటు ప్రయాణికులకూ సౌకర్యవంతంగా ఉంటుందని రైల్వే శాఖ భావిస్తోంది. మొట్టమొదట ఢిల్లీ నుంచి కాన్‌పూర్, వారణాసి నుంచి ఢిల్లీ మార్గాల్లో ఈ స్లీపర్ వందే భారత్ ట్రైన్ సర్వీస్‌లు నడవనున్నాయి.
Also Read: Meta Layoffs: ఉద్యోగులను భయపెడుతున్న జుకర్ బర్గ్, మళ్లీ లేఆఫ్‌లు ఉంటాయట!