Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికల అభ్యర్థుల్ని ప్రకటించిన కాంగ్రెస్, నామినేషన్ వేసిన సోనియా గాంధీ
Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికలకు కాంగ్రెస్ నలుగురు అభ్యర్థులను ప్రకటించింది.
Rajya Sabha Elections 2024: కాంగ్రెస్ రాజ్యసభ ఎన్నికలకు సిద్ధమైంది. ఇప్పటికే నలుగురు అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాలో సోనియా గాంధీ కూడా ఉన్నారు. ఆమె తెలంగాణలో లోక్‌సభకు పోటీ చేస్తారన్న వార్తలు వచ్చినా...ఆమె రాజ్యసభకు పోటీ చేస్తున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. రాజస్థాన్ నుంచి సోనియా బరిలోకి దిగుతున్నారు. ఆమెతో పాటు బిహార్ నుంచి డాక్టర్ అఖిలేష్ ప్రసాద్ సింగ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి శ్రీ అభిషేక్ మను సింఘ్వీ, మహారాష్ట్ర నుంచి చంద్రకాంత్ హండోర్‌ని అభ్యర్థులుగా ప్రకటించారు. త్వరలోనే తెలంగాణ నుంచి అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయి. సోనియా గాంధీ ఇప్పటికే రాజస్థాన్ నుంచి నామినేషన్ వేశారు. జైపూర్ నుంచి ఆమె నామినేషన్ వేసినట్టు ప్రకటించారు. ఈ సమయంలో సోనియాతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఉన్నారు. 1998 నుంచి 2022 వరకూ సోనియా గాంధీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టారు. ఐదు సార్లు లోక్‌సభ ఎంపీగా గెలిచారు.
Congress releases a list of candidates for the Rajya Sabha Biennial elections.
— ANI (@ANI) February 14, 2024
Sonia Gandhi from Rajasthan
Abhishek Manu Singhvi from Himachal Pradesh pic.twitter.com/lXFCvMXgZp
ఫిబ్రవరి 27వ తేదీన మొత్తం 56 సీట్లకు రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌తో మన్మోహన్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజ్యసభ సభ్యత్వ గడువు ముగిసిపోనుంది. వీరితో పాటు మరో 9 మంది కేంద్రమంత్రుల సభ్యత్వమూ ముగిసిపోతుంది. వీళ్లలో అశ్వినీ వైష్ణవ్, ధర్మేంద్ర ప్రదాన్, భూపేంద్ర యాదవ్, మన్‌సుఖ్ మాండవీయ ఉన్నారు. ఫిబ్రవరి 8వ తేదీనే నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఫిబ్రవరి 15వ తేదీతో నామినేషన్‌ల స్వీకరణ గడువు ముగిసిపోతుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 20 ఆఖరు తేదీ. ఫిబ్రవరి 27వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఈ ఓటింగ్ కొనసాగుతుంది. యూపీలో అత్యధికంగా 10 మంది సభ్యులను ఎన్నుకోనున్నారు. ఆ తరవాత బిహార్, మహారాష్ట్రలో ఆరుగురు చొప్పున సభ్యుల ఎన్నిక జరగనుంది. ఇక పశ్చిమబెంగాల్‌లో ఐదుగురు, మధ్యప్రదేశ్‌లో ఐదుగురు, కర్ణాటకలో నలుగురు సభ్యులను ఈ ఎన్నికల ద్వారా ఎన్నుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, రాజస్థాన్‌లో మూడు సీట్లున్నాయి. ఛత్తీస్‌గఢ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో ఒక్కో సీట్‌కి ఎన్నికలు జరగనున్నాయి. రాజ్యసభ సభ్యుల్ని ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. బ్యాలెట్ పేపర్ విధానంలో ఈ ఎన్నిక జరుగుతుంది. బ్యాలెట్ పేపర్‌పై అభ్యర్థుల వివరాలుంటాయి. ఆ పేర్లలో తనకు నచ్చిన పేరుని మార్క్ చేసి బాక్స్‌లో వేస్తారు ఎమ్మెల్యేలు. తొలిరౌండ్‌లో అవసరమైన మెజార్టీ సాధించిన వ్యక్తి గెలిచినట్టుగా ప్రకటిస్తారు. అందరికన్నా తక్కువ ఓట్లు వచ్చిన వాళ్లను తొలగిస్తారు.
#WATCH | Jaipur | Congress Parliamentary Party Chairperson Sonia Gandhi files her nomination for the Rajya Sabha election, from Rajasthan.
— ANI (@ANI) February 14, 2024
Rahul Gandhi, Priyanka Gandhi Vadra, Ashok Gehlot and Govind Singh Dotasra are with her.
(Video: Rajasthan Vidhan Sabha PRO) pic.twitter.com/htQ5rSFOvV