Congress on Rama Mandir: రామమందిరం పొలిటికల్ ప్రాజెక్టు, మేం హాజరు కాబోం - కాంగ్రెస్
Congress Party News: అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి గత నెలలోనే కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ అధీర్ రంజన్ చౌదరిలకు ఆహ్వానం అందింది.
Ayodhya Rama Mandir: ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యలో రామమందిర (Ayodhya Rama Mandir) ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి తాము హాజరు కాబోమని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇప్పటికే తమకు అందిన ఆహ్వానాన్ని తిరస్కరించింది. రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తాము గౌరవపూర్వకంగా తిరస్కరిస్తున్నట్లుగా ఓ ప్రకటన కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. జనవరి 22న జరిగే ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే సహా కాంగ్రెస్ నేతలెవరూ అయోధ్య వెళ్లడం లేదని వెల్లడించింది. రామమందిర కార్యక్రమాన్ని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల కార్యక్రమంగా కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. అయితే, దీనిపై బీజేపీ కూడా ఘాటుగా స్పందించింది.
నిజానికి అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి గత నెలలో కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, లోక్‌సభలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు అధీర్ రంజన్ చౌదరిలకు ఆహ్వానం అందింది. అయితే, ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలు అయోధ్య ఆలయాన్ని రాజకీయ ప్రాజెక్టుగా మార్చాయని కాంగ్రెస్ ఆరోపించింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, అధిర్ రంజన్ చౌదరి రామ మందిర ఆహ్వానాన్ని తిరస్కరించారు.
జనవరి 22న ప్రారంభం
భారతదేశంలోని హిందువులంతా దశాబ్దాలుగా అయోధ్యలో రామమందిర నిర్మాణం, అందులో రాములవారి ప్రతిష్ఠ గురించి ఎదురుచూస్తూనే ఉన్నారు. మొత్తానికి ఆ కల జనవరి 22న నెరవేరబోతోంది. ఏళ్లుగా రాముడి విగ్రహం అయోధ్యలో ఒక చిన్న గుడారంలో ఉండిపోయింది. ఇప్పుడు కొత్తగా నిర్మించిన అయోధ్య ఆలయంలో విగ్రహం ప్రతిష్ఠించబోతున్నారు. ఈ ఆలయ నిర్మాణం అత్యంత విశిష్టత కలిగినది. దీని నిర్మాణంలో ఇనుము, సిమెంట్ వంటివి ఏవీ ఉపయోగించలేదు. కేవలం రాతితోనే ఈ ఆలయాన్ని నిర్మించారు. రామ మందిర నిర్మాణానికి ప్రత్యేకమైన రాయిని వినియోగించారు. రాళ్లను ప్రత్యేకమైన గాడిలో కత్తిరించి.. జోడించారు. ఇలా జోడించేందుకు కూడా కాంక్రీటు వాడలేదు. రామాలయ నిర్మాణానికి వాడిన గులాబి రంగు రాయి అంతా కూడా రాజస్థాన్ లోని భరత్వ్ పూర్ గల బన్సీపహార్ పూర్ నుంచి తెచ్చారు. ఈ గులాబి రాయి జీవిత కాలం చాలా ఎక్కువ. అంతేకాదు ఈ రాయి చాలా దృఢమైంది.
అయోధ్య రామాలయం నాగర శైలి పద్ధతిలో నిర్మించారు. ఈ శైలిలో ఇనుమును ఉపయోగించరాదు. ఉత్తర భారత దేశంలోని మూడు నిర్మాణ పద్ధతుల్లో ఇదొక పద్ధతి. ఈ పద్ధతి నిర్మాణాలు వింధ్య, హిమాలయ పర్వత మధ్య ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఖజురహో, సోమనాథ్ ఆలయం, కోనార్క్ సూర్య దేవాలయం ఈ నిర్మాణ శైలిలో నిర్మించిన కట్టడాలే.