Chittoor Police: రెండేళ్ల క్రితం చిరుతను చంపిన వేటగాళ్లు, పట్టించిన సోషల్ మీడియా ఫొటోలు!
Chittoor Police: రెండేళ్ల క్రితం నాటు తుపాకీలతో చిరుత పులిని చంపిన.. ఓ ముఠాను చిత్తూరు పోలీసులు పట్టుకున్నారు. వారిపై అటవీ శాఖ చట్టం క్రింద కేసు నమోదు చేశారు
Chittoor Police: చిత్తూరు జిల్లాలో రోజు రోజుకి వేటగాళ్ల ఆగడాలు హద్దులు మీరుతున్నాయి. అటవీ ప్రాంతంలోని వన్య ప్రాణులను సంహరించి పైశాచికత్వంను పొందుతున్నారు. తాజాగా కినాటకంపల్లె అటవీ ప్రాంతంలో చిరుత పులిని నాటు తుఫాకీతో వేటాడిన వేటగాళ్లు.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఫోటోలు వైరల్ గా మారడంతో రంగంలోకి దిగిన చిత్తూరు అటవీ శాఖ అధికారులు అటవీ ప్రాంతంలో వన్య ప్రాణులను సంహరించే ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారిపై అటవీ శాఖ చట్టం క్రింద కేసు నమోదు చేశారు. నిందుతుల వద్ద నుండి చిరుత పులి గోర్లు, రెండు నాటు తుఫాకీలు, మూడు సెల్ ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఫొటోలు పోస్టు చేయడంతో వెలుగులోకొచ్చిన నిందితులు..
చిత్తూరు ఫారెస్టు డిఏఫ్ఓ చైతన్య కుమార్ రెడ్డి వెల్లడించిన వివరాల మేరకు.. చిత్తూరు జిల్లా, యాదమర్రి మండలం, కినాటంపల్లె అటవీ ప్రాంతంలో రెండేళ్ల క్రితం చిరుత పులిని కొందరు వ్యక్తులు వేటాడి సంహరించిన ఫోటోలు గత మూడు రోజుల క్రితం సోషల్ మీడియాలో కలకలం రేపాయి. దీంతో రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు సోషల్ మీడియాలో ఫొటోలు పోస్టు చేసిన వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా, తీగ లాగితే డొంక కదిలినట్లు అటవీ ప్రాంతంలో వన్య ప్రాణులను సంహరించే ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు చిత్తూరు ఫారెస్టు డిఏఫ్ఓ చైతన్య కుమార్ రెడ్డి వెల్లడించారు. గుడిపాల మండలంకు చేందిన గంగాధరం, ధనశేఖర్, మధు అనే వ్యక్తులు గత రెండేళ్ల క్రితం కినాటంపల్లె అటవీ ప్రాంతంలో వేటాకి వెళ్లారని, ఆ సమయంలో చిరుత పులిని నాటు తుఫాకీతో కాల్చి సంహరించి, పులి గోర్లను తీసుకుని, పులితో ఫోటోలు సైతం దిగిన తర్వాత చిరుత పులి కళేబరాన్ని అక్కడే ఉన్న లోయలో పడవేశారన్నారు.
అయితే గత మూడు రోజులుగా చిరుత పులితో ఫోటోలు తీసుకున్న కొందరు వ్యక్తులు ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. అంతే కాకుండా అటవీ ప్రాంతంలోని దుప్పి, కనిత, జింకలను సైతం వేటాడే వారని దర్యాప్తులో తేలిందన్నారు. గంగాధరం, మధు, ధనశేఖర్ లకు బాసు, రుద్రన్ అనే వ్యక్తులు నాటు తుఫాకీలు సప్లై చేసే వారని తెలిపారు. బాసు, రుద్రన్ లు పదిహేను వేల నుండి ఏడు వేల వరకూ నాటు తుఫాకీలు అమ్మేవారని, వీరిలో గంగాధరం అనే వ్యక్తిపై ఫారెస్ట్ యాక్ట్ క్రింద గతంలో కేసు నమోదు అయ్యాయినట్లు గుర్తించాంమన్నారు. ఐదుగురు నిందుతుల వద్ద నుండి పులిగోర్లను, రెండు నాటు తుఫాకీలను, రెండు సెల్ ఫోన్స్, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వారిపై ఫారెస్టు యాక్ట్ క్రింద కేసు క్రింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని ఫారెస్ట్ డిఏఫ్ఓ చైతన్య కుమార్ రెడ్డి వెల్లడించారు. ఎవరైనా వన్య ప్రాణులను సంహరించినా, ఇబ్బందులకు గురి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాంమని ఆయన హెచ్చరించారు.