Chhatrapati Shivaji Remarks: ఆయనను వేరే చోటకు పంపిస్తే బెటర్, చరిత్ర తెలియని వ్యక్తి ఇక్కడెందుకు? - మహారాష్ట్ర గవర్నర్‌పై ఎమ్మెల్యే ఫైర్
Chhatrapati Shivaji Remarks: ఛత్రపతి శివాజీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర గవర్నర్ రాష్ట్రం నుంచి దూరంగా పంపేయాలని ఓ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
Chhatrapati Shivaji Remarks:
బీజేపీకి వినతి..
మహారాష్ట్ర గవర్నర్ ఛత్రపతి శివాజీపై చేసిన వ్యాఖ్యలు రాజకీయాలను వేడెక్కించాయి. ఠాక్రే వర్గం ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడుతోంది. ప్రభుత్వం దీనిపై ఎందుకు స్పందించడం లేదంటూ ప్రశ్నిస్తోంది. ఈ క్రమంలోనే శిందే వర్గంలోని ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ స్పందించారు. "గవర్నర్ భగవత్ సింగ్ కొషియారిని రాష్ట్రం నుంచి ఎక్కడికైనా దూరంగా పంపేయాల్సిందే" అని డిమాండ్ చేశారు. మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన శివాజీపై అలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంపై మండి పడ్డారు. గతంలోనూ ఇలాంటి కామెంట్స్ చేసి విమర్శల పాలయ్యారని గుర్తు చేశారు. "ఛత్రపజి శివాజీ సిద్ధాంతాల్ని గవర్నర్ అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో మరే వ్యక్తితోనూ ఆయనను పోల్చలేం. కేంద్రంలోని బీజేపీ నేతలకు నాదో విన్నపం. రాష్ట్ర చరిత్ర గురించి తెలియని ఇలాంటి వ్యక్తిని వేరే ఎక్కడికైనా పంపడం మంచిది" అని
స్పష్టం చేశారు. రాష్ట్ర రాజకీయాల గురించి, ప్రజల సెంటిమెంట్‌ల గురించి తెలియని వ్యక్తి గవర్నర్ పదవిలో ఎలా ఉంటారని మరి కొందరు ప్రశ్నిస్తున్నారు.
ఇదీ జరిగింది..
మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొష్యారి తరచూ ఏదో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇప్పుడు మరోసారి అలాంటి వివాదంలోనే చిక్కుకున్నారు. ఛత్రపత్రి శివాజీ చేసిన కామెంట్స్ మహారాష్ట్ర రాజకీయాల్లో వేడిని పెంచాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై శివసేన తీవ్రంగా మండి పడుతోంది. ఛత్రపతి శివాజీ ఐకానిక్ పర్సనాలిటీ అయినా అదంతా పాత రోజుల్లోనని...ఇప్పటి ఐకానిక్ పర్సనాలిటీస్ బీఆర్ అంబేడ్కర్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అని ఆయన చేసిన కామెంట్స్‌తో పెద్ద దుమారం రేగింది. నేషనల్ కాంగ్రెస్ పార్టీ (NCP)తో పాటు ఠాక్రే నేతృత్వంలోని శివసేన విమర్శలు ధాటిని పెంచింది. "ఇది ఛత్రపతి శివాజీకి తీరని అవమానం" అని విమర్శిస్తున్నాయి. ఔరంగాబాద్ లోని డాక్టర్ బాబాసాహెబ్ అండేక్కర్ యూనివర్సిటీలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు...గవర్నర్ భగత్ సింగ్ కొష్యారీ. ఆ సమయంలోనే ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. "ఒకప్పుడు భారత్‌లో ఐకాన్ లాంటి వ్యక్తులెవరంటే నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ అని సమాధానం ఇచ్చేవారు. కానీ...మహారాష్ట్ర ఈ విషయంలో ప్రత్యేకం. ఇక్కడ ఎంతో మంది గొప్ప వ్యక్తులున్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ ఒకప్పటి ఐకాన్. కానీ ఇప్పుడు అంబేడ్కర్, నితిన్ గడ్కరీ ఆ స్థాయిలో ఉన్నారు" అని అన్నారు గవర్నర్.
కేంద్ర మంత్రి గడ్కరీని, ఛత్రపతి శివాజీతో పోల్చడమేంటని విమర్శలు ఎదుర్కొంటున్నారు. "రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలి. రాజ్యాంగ పరమైన పదవిలో ఉన్న వ్యక్తి తరచూ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. బీజేపీ మాత్రం ఆయన వ్యాఖ్యలపై ఎప్పుడూ మౌనంగానే ఉంటోంది. ఇది మహారాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బ తీస్తోంది" అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. గతంలో మహారాష్ట్రప్రజల్ని అవమానిస్తూ చేసిన వ్యాఖ్యలూ తీవ్ర వివాదాస్పదమయ్యాయి.
Also Read: Sachin Pilot Vs Gehlot: గుజరాత్ ఎన్నికల తరవాతే రాజస్థాన్ గురించి ఆలోచిస్తాం, ప్రకటించిన కాంగ్రెస్