World’s Largest Fish: వలలో పడిన ఈ చేప సైజ్ చూశారా, ప్రపంచంలోనే అతి పెద్దదట
ప్రపంచంలోనే అతి పెద్ద మంచినీటి చేపను కంబోడియాలోని మెకాంగ్ నదిలో కనుగొన్నారు.
వలలో చిక్కిన అతి పెద్ద మంచి నీటి చేప
ప్రపంచంలోని అతి పెద్ద మంచినీటి చేప కంబోడియాలోని మెకాంగ్ నదిలో కనిపించింది. ఈ చేప ఆకారాన్ని, రూపాన్ని గమనించాకఆగ్నేయాసియా, అమెరికా సైంటిస్ట్‌లు ఈ విషయాన్ని వెల్లడించారు. జూన్ 13న ఈ చేప వలలో చిక్కింది. 13 అడుగుల పొడవున్న ఈ చేప దాదాపు 300 కిలోల బరువున్నట్టు అక్కడి అధికారులు చెప్పారు. గతంలోనూ ఇదే మెకాంగ్ నదికి చెందిన 293 కిలోల బరువున్న క్యాట్ ఫిష్‌ని థాయ్‌లాండ్‌లో కనుగొన్నారు. ఇప్పుడు అంత కన్నా పెద్ద చేప వలలో చిక్కింది. స్థానిక మత్స్యకారులు దీన్ని మొదట గుర్తించారు. ఈ చేపను చూసి ఆశ్చర్యపోయిన వాళ్లు, వెంటనే సైంటిస్ట్‌లకు సమాచారం అందించారు. వారు ఈ చేపను చూసి ఇదే ప్రపంచంలో అతి పెద్ద మంచి నీటి చేప అని నిర్ధరించారు. మంచి నీటి నదుల్లో ఇంత పెద్ద చేప కనిపించటం ఇదే తొలిసారి అని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. మొదటి సారి ఈ చేపను చూడగానే షాక్ అయినట్టు వివరించారు.
సంరక్షణ లేకపోతే మనుగడ కష్టమే..
జీవితకాలమంతా మంచి నీళ్లలోనే ఉండే చేపల్ని మంచి నీటి చేపలుగా పరిగణిస్తారు. ట్యునా, మార్లిన్ లాంటి చేపలు సముద్రంలో మాత్రమేనివసిస్తాయి. ఇక మరికొన్ని చేపలు మంచినీళ్ల నుంచి ఉప్పు నీళ్లకు వలస వెళ్తుంటాయి. మెకాంగ్ నది పరిరక్షణ కోసం చాలా సంవత్సరాలుగా అక్కడి అధికారులు కృషి చేస్తున్నారు. ఈ నదీతీరాన్ని ఆనుకుని ఉన్న తెగల ఉనికినీ కాపాడుతున్నారు. నదిలోని చేపల్నీ సంరక్షిస్తున్నారు. ఈ చర్యల ఫలితంగానే ఇంత పెద్ద చేప కనిపించిందని అంటున్నారు స్థానిక అధికారులు. చైనా,మయన్మార్, లోవాస్, థాయ్‌లాండ్, కంబోడియా, వియత్నాం మీదుగా ప్రవహిస్తోంది మెకాంగ్ నది. ఎన్నో మంచి నీటి చేపలకు నిలయం ఈ నది. అయితే ఈ మధ్య కాలంలో వాతావరణ మార్పుల ప్రభావం పడుతోంది. నదిలోని చేపల మనుగడ కష్టంగా మారింది. అందుకే సంరక్షణా చర్యలు చేపట్టారు.
పెద్ద చేపలకు ప్రమాదం తప్పదేమో..
ప్రపంచవ్యాప్తంగా పెద్ద చేపలు ప్రమాదంలో ఉన్నాయని అంటున్నారు శాస్త్రవేత్తలు. వాటి పునరుత్పత్తికి చాలా సమయం పడుతుందని,అప్పటి వరకూ వాటిని కాపాడుకోకపోతే క్రమంగా వాటి సంఖ్య తగ్గిపోతుందని అంటున్నారు. అతిగా చేపలు పట్టటమూ వాటి మనుగడను ప్రమాదంలో పడేస్తోందని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మంచి నీటిచేపల్లో 70% వరకూ ప్రమాదంలోనే ఉన్నాయని వివరిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ప్రభుత్వాలు రక్షణ చర్యలు చేపట్టకపోతే భవిష్యత్‌లో ఇంత భారీ చేపలు కనిపించవని ఆందోళన చెందుతున్నారు. మెకాంగ్ నదిలో రెండు నెలల కాలంలోనే ఇలాంటి పెద్ద చేపలు నాలుగు కనిపించటం సంతోషంగా ఉందని చెప్పారు.