California Shooting: అమెరికాలో 10 మందిని కాల్చి చంపిన కిల్లర్ ఆత్మహత్య, అసలేం జరిగిందంటే?
California Shooting: అమెరికాలోని మాంటెరీ పార్కులో కాల్పులు జరిపి పది మంది హత్యకు కారణం అయిన నిందుతుడు తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
California Shooting: అమెరికాలో కాల్పులు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. కాలిఫోర్నియాలోని మాంటెరీ పార్క్‌లో చైనీస్ న్యూ ఇయర్ వేడుకలో జరిగిన కాల్పుల్లో 10 మంది మరణించారు. అయితే ఈ మారణకాండకు పాల్పడినట్లు భావిస్తున్న 72 ఏళ్ల వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. షాట్ గన్ తో తనకు తానే కాల్చుకున్నట్లు అతడి శరీరంపై గాయం ఉందని పోలీసులు వివరించారు. అనుమానితుడు చైనా నుంచి వలస వచ్చిన 72 ఏళ్ల హూ కాన్ ట్రాన్ గా పోలీసులు గుర్తించారు. ట్రాన్ కాల్పులకు పాల్పడిన తర్వాత కొందరు వ్యక్తులు అతడి ఆయుధాన్ని లాక్కున్నట్లు సమాచారం. అతడు గతంలో ట్రక్కు డ్రైవర్ గా పని చేశాడు. దీంతో పాటు ట్రాన్స్ ట్రక్కింగ్ ఐఎన్సీ పేరిట వ్యాపారం చేసినట్లు తెలుస్తోంది.
California police hunting the gunman who killed 10 people at a dance club during Lunar New Year celebrations broke into a van after a lengthy standoff Sunday, where images showed a body slumped in the driver's seathttps://t.co/oUQoFKoeFZ pic.twitter.com/vIzgnp7sZP
— AFP News Agency (@AFP) January 23, 2023
మాజీ భార్యను వెతుక్కుంటూ వచ్చే కాల్పులు చేసినట్లు సమాచారం..
కాల్పులు జరిపిన డ్యాన్స్ స్టూడియోకు ట్రాన్ తరచూ వస్తాడని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. అక్కడ అతడి మాజీ భార్యతో కలిసి సమయం గడిపేవాడని వారు చెప్పారు. అతడు 2006లోనే భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. ఘటనా స్థలానికి సమీపంలోని సాన్ గాబ్రియేల్ లో నివాసం ఉండేవాడు. స్టూడియోలోని శిక్షకులు, చాలా మంది వ్యక్తులతో అతడికి అంతగా పడేది కాదని స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు అతడికి కోపం చాలా ఎక్కువని వివరించారు. మాజీ భార్యను వెతుక్కుంటూ ట్రాన్స్ డ్యాన్స్ స్టూడియోస్ కు వచ్చినట్లు స్థానిక పత్రికలు పేర్కొన్నాయి. అక్కడ ఆమెను చూడగానే రెచ్చిపోయి విచ్చల విడిగా కాల్పులు జరిపినట్లు వెల్లడించాయి.
న్యూ ఇయర్ వేడుకల్లో కాల్పుల కలకలం
మాంటెరీ పార్క్‌లో సాంప్రదాయ చైనీస్ న్యూ ఇయర్ (లూనార్ న్యూ ఇయర్) వేడుకలు జరుపుకుంటున్నారు. అదే సమయంలో ఈ కాల్పులు జరిగాయి. ఘటనా స్థలానికి లాస్ ఏంజిల్స్ సిటీ హెడ్‌క్వార్టర్స్‌కు కేవలం 7 కిలో మీటర్ల దూరంలోనే ఉంది. కాల్పుల సమయంలో వేలాది మంది ప్రజలు అక్కడే ఉన్నారు. అప్పుడే అక్కడకు వచ్చిన ఓ వ్యక్తి మెషీన్ గన్ తో కాల్పులకు పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ కాల్పుల ఘటన అనంతరం పోలీసులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కాల్పులకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని అన్నారు. షూటర్ డ్యాన్స్ క్లబ్‌లోకి ప్రవేశించి, తుపాకీని తీసి కాల్పులు జరపడం ప్రారంభించాడని, ఆ తర్వాత గందరగోళం ఏర్పడిందని వెల్లడించారు. అక్కడకు వచ్చిన వారంతా గందరగోళంగా అటూఇటూ పరుగెట్టడంతో ఈ హడావుడిలోనే నిందితుడు తప్పించుకున్నాడని వివరించారు. ఈ సమయంలో కారులోకి వెళ్లిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోందని అన్నారు. అయితే ఎందుకు కాల్చాడు, ఆ తర్వాత ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో త్వరలోనే తెలుసుకుంటామన్నారు.