Ashok Gehlot: మోడీ, అమిత్‌షాలకు ఎమ్మెల్యేలు భయపడడం లేదు, బీజేపీపై వ్యతిరేకత పెరుగుతోంది - అశోక్ గహ్లోట్
Ashok Gehlot on Modi-Shah: ప్రధాని మోడీ, అమిత్‌షాలపై అశోక్ గహ్లోట్ విమర్శలు చేశారు.
Ashok Gehlot on Modi-Shah:
ప్రధాని పదేపదే ప్రచారం చేస్తున్నారు: గహ్లోట్
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోట్ పాలిలో పర్యటిస్తున్నారు. పాలి నుంచి జోధ్‌పూర్ విమానాశ్రయానికి వచ్చిన ఆయనకు కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. ఈ సమయంలోనే గహ్లోట్ మీడియాతో కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీని టార్గెట్‌గా చేసుకుని విమర్శించారు. త్వరలోనే గుజరాత్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో...అశోక్ గహ్లోట్..ఏదో ఓ సందర్భంలో బీజేపీపై మండి పడుతూనే ఉన్నారు. గుజరాత్‌లో ప్రభుత్వ వ్యతిరేకత ఉందని తేల్చి చెప్పారు. అందుకే...ప్రధాని నరేంద్ర మోడీ తరచుగా గుజరాత్‌లో పర్యటిస్తూ...వీధి వీధికి వెళ్లి ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. "స్వయంగా ప్రధాని పదేపదే వెళ్లి ప్రచారం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది" అని అన్నారు గహ్లోట్. గుజరాత్ ఎన్నికల్లో 125 సీట్లు సాధించడమే లక్ష్యంగా పెట్టుకుని కాంగ్రెస్...వ్యూహరచన చేస్తోందని వెల్లడించారు. "గుజరాత్‌లో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. ప్రజలు అల్లాడిపోయారు. ఎంతో మంది చనిపోయారు. కల్తీ లిక్కర్ కారణంగా 70 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతే కాదు. ఇటీవల మోర్బి వంతెన కూలిపోయి 135 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇంత వరకూ దీనిపై విచారణ కూడా పూర్తి కాలేదు. అందుకే గుజరాత్ హైకోర్ట్ సుమోటోగా తీసుకుంది" అని మండిపడ్డారు గహ్లోట్. భారత్ జోడో యాత్ర గురించీ ప్రస్తావించారు. "భారత్ జోడో యాత్ర చాలా బాగా కొనసాగుతోంది. గత ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ గుజరాత్‌కు వచ్చారు. అప్పుడు కాంగ్రెస్ 77 సీట్లు సాధించింది. ఈ సారి కూడా యాత్ర చేపడుతున్నారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగమే ప్రధాన ఎజెండాగా భారత్‌లోని ప్రతి ఇంటినీ చేరుతోంది ఈ యాత్ర.
గుజరాత్ ఎన్నికల తరవాతే..
అశోక్ గహ్లోట్..ప్రధాని మోడీ, అమిత్‌షాపైనా విమర్శలు గుప్పించారు. "బీజేపీపైనా వ్యతిరేకత పెరుగుతోంది. గుజరాత్‌లో 33 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే అధిష్ఠానంపై అసహనంతో ఉన్నారు. హిమాచల్‌లోనూ దాదాపు 21 మంది ఎమ్మెల్యేలు అసమ్మతి ప్రకటించారు. బీజేపీలో గతంలోలా లేదు. ప్రధాని మోడీ, అమిత్‌షాకు భయపడి చాలా మంది ఎమ్మెల్యేలు మౌనంగా ఉండిపోయారు. కానీ..ఇప్పుడు వాళ్లు గట్టిగా మాట్లాడుతున్నారు. క్రమంగా మార్పు వస్తోంది" అని అన్నారు. భారత్ జోడో యాత్ర వచ్చే నెల రాజస్థాన్‌లోకి ప్రవేశించనుంది. ఆసమయంలోనే రాహుల్ తమ సమస్యలు పరిష్కరించాలని భావిస్తోంది రాష్ట్ర క్యాడర్. డిప్యుటీ సీఎం సచిన్ పైలట్ కూడా ఇదే విషయాన్ని ఇప్పటికే అధిష్ఠానానికి తెలియజేశారు. "ఏదో ఓ స్పష్టత ఇవ్వండి" అంటూ డిమాండ్ చేస్తున్నారు. పార్టీలోని సమస్యలు తీర్చకుండా జోడో యాత్ర కొనసాగించటం సరికాదని చెబుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధిష్ఠానం ఓ కీలక విషయం వెల్లడించింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తరవాతే రాజస్థాన్ రాజకీయ సంక్షోభాన్ని డీల్ చేస్తామని తెలిపింది. డిసెంబర్ తొలి వారంలో మధ్యప్రదేశ్ నుంచి నేరుగా రాజస్థాన్‌లోని జలావర్ ప్రాంతానికి చేరుకుంటారు రాహుల్ గాంధీ. దాదాపు 20 రోజుల పాటు రాష్ట్రంలోని జలావర్, కోట, స్వామి మధోపుర్, దౌస్, అల్వార్ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. 2018లో రాజస్థాన్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి.
Also Read: Viral: ఆ ఊరికి వెళ్లి సెటిలైతే పాతిక లక్షల రూపాయలు ఇస్తారు, ఎందుకంటే