Wayanad Landslides: విపత్తు నిర్వహణ చట్టంలో మార్పులకు కేంద్రం సిద్ధం, వయనాడ్ విధ్వంసంతో కీలక నిర్ణయం
Wayanad: కేరళ సహా పలు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే విపత్తు నిర్వహణా చట్టంలో కీలక మార్పులకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ మేరకు సవరణ బిల్లు ప్రవేశపెట్టింది.
Disaster Management Act Amendment Bill: పలు రాష్ట్రాలు భారీ వర్షాలు, వరదలు, కొండ చరియలు విరిగిపడడం లాంటి విపత్తులతో సతమతం అవుతున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. Disaster Management Act 2005లో మార్పులు చేర్పులు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు పార్లమెంట్‌లో బిల్లు కూడా ప్రవేశపెట్టింది. కేంద్రమంత్రి నిత్యానంద్ రాయ్ ఈ బిల్‌ని ప్రవేశపెట్టారు. ఈ బిల్లులో కీలక విషయాలు చేర్చింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రాలతో పాటు జాతీయస్థాయిలో విపత్తులకు సంబంధించి పూర్తి స్థాయిలో డేటాబేస్‌ని ఏర్పాటు చేయాలని ఇందులో ప్రతిపాదించింది. ఏదైనా విపత్తు సంభవించినప్పుడు తక్షణమే స్పందించేందుకు ఈ డేటాబేస్ ఎంతో ఉపయోగ పడుతుందని వెల్లడించింది. తీసుకోవాల్సిన చర్యలపైనా ఓ అవగాహన వస్తుందని వివరించింది.
అంతే కాదు. రాష్ట్రాల రాజధానులతో పాటు కీలకమైన నగరాల్లో ప్రత్యేకంగా Urban Disaster Management Authority ఏర్పాటు చేయాలనీ ప్రతిపాదించింది. ఈ డేటాబేస్‌లో విపత్తు నిర్వహణకు ఎంత కేటాయించారు..? ఎంత ఖర్చు చేశారు అనే వివరాలతో పాటు ప్రభావాన్ని తగ్గించేందుకు ఎలాంటి ప్రణాళికలు అమలు చేయాలన్నదీ అందులో కనిపిస్తుంది.
ప్రస్తుతానికి మొత్తం 7 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ అన్ని చోట్లా పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి. వరదలు రావడం వల్ల జనజీవనం స్తంభించిపోయింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, కేరళలో ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. గత 24 గంటల్లో 7 రాష్ట్రాల్లో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగి పడుతున్న ఘటనల్లో 250 మంది చనిపోయారు. ఇప్పటికే కాంగ్రెస్ మోదీ సర్కార్‌పై మండి పడుతోంది. సరైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. కేంద్రం దీన్ని తీవ్ర విపత్తుగా పరిగణించి తక్షణమే ఎంపీలంతా రంగంలోకి దిగి ప్రభావిత ప్రాంతాలకు అండగా నిలవాలని స్పష్టం చేసింది.