Bhabanipur Bypoll 2021: 'భవానీపుర్'లో దీదీ నామినేషన్.. భాజపా తరఫున బరిలోకి ప్రియాంక
బంగాల్ భవానీపుర్ అసెంబ్లీ స్థానానికి సీఎం మమతా బెనర్జీ నామినేషన్ దాఖలు చేశారు. దీదీపై పోటీగా ప్రియాంక తిబ్రీవాల్ ను భాజపా ఎంపిక చేసింది.
భవానీపుర్ శాసనసభ స్థానానికి బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నామినేషన్ వేశారు. కోల్‌కతాలోని సర్వే బిల్డింగ్‌కు చేరుకొని నామపత్రాల సమర్పించారు.
#WATCH West Bengal CM Mamata Banerjee files nomination for by-polls to Bhabhanipur seat
— ANI (@ANI) September 10, 2021
BJP and CPI-M have fielded Priyanka Tibrewal and Srijib Biswas respectively against the CM pic.twitter.com/LSvB1Zdfyk
మమతా బెనర్జీపై భవానీపూర్ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు తమ అభ్యర్థిని భాజపా ప్రకటించింది. న్యాయవాది ప్రియాంక తిబ్రీవాల్ ను తమ అభ్యర్థిగా భాజపా వెల్లడించింది. భవానీపుర్తో పాటు ఈ నెల 30న ఎన్నికలు జరిగే ఇతర నియోజకవర్గాలకూ అభ్యర్థులను భాజపా ఖరారు చేసింది.
జంగీపుర్ నుంచి సుజిత్ దాస్, సంషేర్‌గంజ్ నుంచి మిలన్ ఘోష్ ను బరిలో నిలిపింది భాజపా. ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నట్లు కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది.
ఎవరీ ప్రియాంక..?
- ప్రియాంక తిబ్రీవాల్.. 2014 ఆగస్టులో భాజపాలో చేరారు. అంతకుముందు బాబుల్ సుప్రీయోకు ఆమె న్యాయ సలహాదారుగా పనిచేశారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు.
- 2020 ఆగస్టులో బంగాల్ భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం)కు ఉపాధ్యక్షురాలుగా నియమితులయ్యారు.
- ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సెంట్రల్ కోల్‌కతాలోని ఎంటల్లీ నియోజకవర్గం నుంచి ప్రియాంక.. భాజపా తరఫున పోటీ చేసి ఓడిపోయారు.
- బంగాల్ శాససనభ ఎన్నికల అనంతరం చెలరేగిన హింసపై కలకత్తా హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేసిన వారిలో ప్రియాంక ఒకరు.
- ప్రస్తుతం పార్టీ జాతీయ అధికార ప్రతినిధుల్లో ప్రియాంక ఒకరు.
మమతా ఓటమి..
ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 294 స్థానాలకు టీఎంసీ 213 చోట్ల గెలిచింది. భాజపా 77 చోట్ల గెలిచి ప్రధాన ప్రతిపక్ష స్థానం సంపాదించుకుంది. ఎన్నికల అనంతరం ఇద్దరు భాజపా ఎమ్మెల్యేలు టీఎంసీలో చేరారు.
మమతా బెనర్జీ నందిగ్రామ్ నియోజకర్గం నుంచి పోటీ చేసిన భాజపా అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఓడిపోయారు. సీఎం పదవి చేపట్టిన దీదీ ఆరు నెలల్లోగా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంది. అందుకే భవానీపుర్ ఉప ఎన్నికలో విజయం మమతకు కీలకంగా మారింది. భవానీపుర్ సహా మరో రెండు నియోజకవర్గాల ఉపఎన్నికల ఫలితాలు అక్టోబర్ 3న వెలువడనున్నాయి.