PFI Raids: 'ఆపరేషన్ PFI'- 8 రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ, ఈడీ దాడులు ముమ్మరం
PFI Raids: పీఎఫ్‌ఐ కార్యాలయాలపై ఎన్ఐఏ, ఈడీ దాడులు కొనసాగుతున్నాయి.
PFI Raids: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)పై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఉక్కుపాదం మోపుతున్నాయి. పీఎఫ్ఐ సంస్థతో సంబంధం ఉన్న సభ్యులు, కార్యాలయాలపై.. కేంద్ర జాతీయ దర్యాప్తు సంస్థ (NIA), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మరో సంయుక్త ఆపరేషన్ నిర్వహించింది. 8 రాష్ట్రాల్లో ఏకకాలంలో దర్యాప్తు సంస్థలు దాడులు నిర్వహిస్తున్నాయి.
ఈ రాష్ట్రాల్లో
ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, దిల్లీ, కేరళ, గుజరాత్, కర్ణాటక, అసోంలో దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్‌లో యాంటీ టెర్రర్ స్క్వాడ్ (ATS), స్థానిక పోలీసులు కూడా పాల్గొంటున్నారు. పీఎఫ్‌ఐకి సంబంధించిన 25 ప్రదేశాలలో తాజా దాడులు నిర్వహిస్తున్నట్లు ABP న్యూస్‌కు సమాచారం అందింది.
రెండు వారాల్లో మూడోసారి దేశంలో పీఎఫ్ఐ కార్యకలాపాలపై.. ఎన్ఐఏ, ఇతర దర్యాప్తు సంస్థలు దాడులు నిర్వహిస్తున్నాయి. దేశంలోని 11 రాష్ట్రాల్లోని 95 ప్రాంతాల్లో ఫెడరల్ యాంటీ టెర్రర్ ఏజెన్సీ దాడులు నిర్వహించిన కొద్ది రోజులకే మళ్లీ ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ఎన్‌ఐఏ తాజా దాడులు గతంలో జరిగిన రైడ్, దర్యాప్తు ఆధారంగా సాగుతున్నట్లు సమాచారం.
అరెస్ట్
కర్ణాటకలో ఆరుగురిని అదుపులోకి తీసుకోగా, మహారాష్ట్రలోనూ పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇదీ జరిగింది
మొత్తం 11 రాష్ట్రాల్లోని PFI (Popular Front of India) ఆఫీసుల్లో ఎన్‌ఐఏ, ఈడీ అధికారులు ఇటీవల రెయిడ్స్ చేశారు. జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న 106 మందిని అరెస్ట్ చేశారు. ఈ 106 మందిలో అత్యధికంగా కేరళకు చెందిన వారే ఉన్నారు. కేరళలో 22 మంది, మహారాష్ట్ర, కర్ణాటకలో 20 మంది, ఆంధ్రప్రదేశ్ ఐదుగురు, అసోంలో 9 మంది, దిల్లీలో ముగ్గురు, మధ్యప్రదేశ్‌లో నలుగురు, పుదుచ్చేరిలో ముగ్గురు, తమిళనాడులో 10 మంది, యూపీలో 8 మందితో పాటు రాజస్థాన్‌లో ఇద్దరు అరెస్ట్ అయ్యారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత పకడ్బందీగా భారీ సోదాలు చేపట్టాయి NIA,ED. ఇప్పటి వరకూ అరెస్ట్ అయిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చుతున్న వారి ఇళ్లలో ఈ సోదాలు ఇంకా జరుగుతున్నాయి. కొందరు ఉగ్రవాదులకు ట్రైనింగ్ క్యాంప్‌లూ నిర్వహించారు. ఇంకొందరు యువకులను ఉగ్రవాద సంస్థల్లో చేరేలా ప్రోత్సహిస్తున్నారని NIA అధికారులు చెబుతున్నారు.
యువతకు శిక్షణ పేరుతో పీఎఫ్‌ఐ చట్టవిరుద్ధ కార్యకలపాలు సాగిస్తోందనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు, తీవ్రవాద భావజాలం వ్యాప్తి వంటి ఆరోపణలు రావడంతో నేడు ఎన్‌ఐఏ, ఈడీ సంయుక్తంగా పీఎఫ్‌ఐ కార్యాలయాలు, సభ్యుల ఇళ్లపై దాడులు చేపట్టింది.
Also Read: Viral Video: పాప బ్యాగ్‌లో పాము- ఓపెన్ చేసిన టీచర్, వైరల్ వీడియో!