ఏపీ ప్రభుత్వం స్పందించకుంటే తిరుగుబాటు తప్పదు: బొప్పరాజు వెంకటేశ్వర్లు
ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టారు.
Bopparaju Venkateswarlu Comments on AP Government:
వైఎస్సార్సీపీ ప్రభుత్వం రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని ఏపీ రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు హెచ్చరించారు. అనంతపురం జిల్లాలో రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల విస్తృత స్థాయి సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో కీలక విషయాలపై చర్చించారు.
ఈ సందర్భంగా రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.... ప్రభుత్వ నిర్ణయాలు, పథకాల విషయంలో సాధ్యం కానీ నిబంధనలు అమలు చేసి, ఉద్యోగులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆగ్రహించారు.
అన్ని విభాగాల్లోని ఉద్యోగులపై ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరిగిందని మండిపడ్డారు. " రెవెన్యూ ఉద్యోగులు గత నాలుగేళ్లుగా ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు రాకపోయినా పనిచేస్తున్నారు. తాజాగా ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, కొందరు కలెక్టర్లు, జేసీల నుంచి ఒత్తిళ్లు అధికమయ్యాయి. గ్రామాల్లో రీ సర్వే 100 రోజుల్లో పూర్తి చేయాలని నిబంధన అన్నప్పటికీ... కేవలం 15 రోజుల్లోనే పూర్తి చేయాలని ఆదేశించడం సరికాదు. రెవెన్యూ ఉద్యోగులకు సంబంధంలేని విధులు కేటాయిస్తున్నారు. గత నాలుగేళ్లుగా ఓటర్ల పరిశీలన చేస్తున్నా.. నిధులు ఇవ్వలేదు. ఒక అనంతపురం జిల్లాకే 5 కోట్ల బకాయి ఉంది. ఓటరు పరిశీలన ఒక క్లైమ్ కు 10 రూపాయల ఖర్చు అవుతున్నా... రెవెన్యూ ఉద్యోగులే జీతం నుంచి ఖర్చు పెడుతున్నారు. అక్టోబర్ 1వ తేదీన విజయవాడలోని రాష్ట్ర కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. ఆరోజు సమస్యలను మంత్రులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. అప్పటికి కూడా జగన్ ప్రభుత్వం స్పందించకపోతే తిరుగుబాటు తప్పదు" అని బొప్పరాజు వెంకటేశ్వర్లు ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఉద్యోగులపై పని భారం తగ్గించాలి....
రాష్ట్రంలో రెవెన్యూ ఉద్యోగులపై పనిభారం తగ్గించాలని బొప్పరాజు డిమాండ్ చేశారు. రెవెన్యూ ఉద్యోగులకు ఇతర శాఖల పనులు కూడా అప్పగిస్తున్నారని, దానివల్ల వారు మానసిక ఒత్తిడి, ఆరోగ్య ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని
ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొనేందుకు జిల్లాల వారీగా పర్యటిస్తున్నట్టు తెలిపారు. అక్టోబర్ ఒకటిన విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విఆర్‌ఎ స్థాయి ఉద్యోగి నుంచి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ వరకు రెవెన్యూ ఉద్యోగుల కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర కౌన్సిల్‌లో చర్చించి పరిష్కారం కోసం తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ కౌన్సిల్ సమావేశానికి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, సిసిఎల్‌ఎ జి.సాయిప్రసాద్, డిప్యూటీ కలెక్టర్లు, విఆర్‌ఒ, విఆర్‌ఎ అసోసియేషన్ల నాయకులు హాజరవుతారని చెప్పారు. వివిధ రూపాల రీత్యా రెవెన్యూ ఉద్యోగులకు ప్రభుత్వం నుండి రూ.ఆరు వేల కోట్ల బెనిఫిట్లు రావాల్సి ఉండగా వాటిని ఈ నెలాఖరులోగా చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు.
ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా వ్యాప్తంగా గురువారం నిరసన చేపట్టారు. ఏపీ జేఏసీ అమరావతి పిలుపు మేరకు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. పదవీ విరమణ ప్రయోజనాలు అందకపోవడం, కరోనా సమయంలో కారుణ్య నియామకాలు ఇవ్వకపోవడం, సీపీఎస్ రద్దుచేయకపోవడం, తదితర అంశాలపై నిరసన చేపట్టినట్టు తెలిపారు.