(Source: ECI/ABP News/ABP Majha)
Hypocrites: గెలవకపోతే ఈశాన్య ప్రజలు భారతీయులు కారా..? వారి ఆవేదనకు సమాధానం ఎవరు చెబుతారు..?
విజేతలుగా నిలిచినప్పుడే ఈశాన్య రాష్ట్రాల ప్రజల్ని భారతీయులుగా గుర్తిస్తారని లేకపోతే చైనీస్, నేపాలీ,చింకీస్ అంటారని మిలింద్ సోమన్ భార్య అంకితా కొన్వర్ ఆవేదన చెందుతున్నారు.
మీరాబాయి చాను... ఒలింపిక్స్‌లో తొలి రోజే వెయిట్ లిఫ్టింగ్‌లో రజతం గెలిచి.. దేశానికి పతకాల జాబితాలో చోటు కల్పించారు. ఇప్పుడు ఆమెను అందరూ అభినందిస్తున్నారు. ఇండియన్ అంటూ... భుజాలకెక్కించుకుంటున్నారు. బహుమతులు ప్రకటిస్తున్నారు. ఈ ప్రతిభావంతురాలు ఈశాన్య రాష్ట్రంలోని మణిపూర్‌కు చెందినవారు. అక్కడే పుట్టి పెరిగి.. గెలుపుతీరాలకు చేరారు. ఇప్పుడు అందరూ ఆమెను భారతీయురాలిగానే చెబుతున్నారు. నిజం కూడా అదే. కానీ గెలిచినప్పుడు.. విజేతల్ని కాకుండా ఎంత మంది ఈశాన్య రాష్ట్రాల సామాన్య పౌరుల్ని భారతీయులుగా కలుపుకుంటున్నారు ...?
కొన్నాళ్ల క్రితం హిందీలో పింక్ అనే సినిమా వచ్చింది. అందులో ముగ్గురు స్నేహితుల్లో ఒకరు ఈశాన్య రాష్ట్రానికి చెందిన అమ్మాయి. కోర్టు విచారణలో .. లాయర్ ఆమెను గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఇండియన్ కాదన్నట్లుగా మాట్లాడతారు. అది సినిమానే కావొచ్చు. నిజానికి అది దేశం మొత్తం ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఎదుర్కొంటున్న విపక్ష. దేశంలో ఎక్కడైనా భారతీయులు బతకొచ్చు. స్వేచ్చగా ప్రయాణించవచ్చు. ఈశాన్య రాష్ట్రాల వారికీ ఆ హక్కు ఉంది. కానీ వారు అటు ఢిల్లీకి వెళ్లినా.. ఉత్తరాదికి వెళ్లినా దక్షిణాదికి వెళ్లినా... వాళ్లు ఇండియన్సేనా అన్న అనుమానపు చూపులు చూస్తారు. వేధిస్తారు.
అందుకే చాలా సార్లు ఈశాన్య రాష్ట్రాల యువత తాము ఇండియన్సేనని ... అలాగే ట్రీట్ చేయాలని అనేక ప్రదర్శనల ద్వారా తమ ఆవేదన వెలిబుచ్చుకున్నారు. కానీ వివక్ష ఒక్క సారిగా పోదు. తాజాగా.. మణిపూర్‌కు చెందిన మీరాబాయి పతకం సాధించడంతో మరోసారి అందరి దృష్టి ఈశాన్య రాష్ట్రాలపై పడింది. ఆమె ఎలాంటి విమర్శనాత్మక వ్యాఖ్యలు చేయలేదు కానీ... ఇతర ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చి ప్రముఖులుగా మారిన వారు మాత్రం.. తమ అసంతృప్తిని దాచుకోవడం లేదు.
ఏదైనా విజయం సాధించినప్పుడు.. పతకాల గెలిచినప్పుడు మాత్రమే.. ఈశాన్య రాష్ట్రాల ప్రజల్ని ఇండియన్స్ గా చూస్తారని.. అంకితా కొన్వర్ అనే యువతి ఆవేదన వ్యక్తం చేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈమె... బాలీవుడ్ నటుడు.. సూపర్ మోడల్ మిలింద్ సోమన్ ... భార్య. విజయాలు. ఏమీ లేకపోతే.. ఈశాన్య రాష్ట్రాల ప్రజల్ని చింకీ, చైనీస్, నేపాలీ, కరోనా అని పిలుస్తారంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇది హిపోక్రసీ అనే బహిరంగంగానే విమర్శిస్తోంది.
ఇది నిజమే.. నిజంగానే ఈశాన్య రాష్ట్రాల ప్రజల పట్ల విపక్ష చూపించే వారు..ఈ అంశంపై తమను తాము సమీక్షించుకోవాల్సి ఉంది. వారిని కించ పరచినా.. వారి పట్ల తేలిక భావం ఉన్న వారెవరైనా.. ఇప్పుడు.. తమను తాము ప్రశ్నించుకోవాలి. అప్పుడే.. మీరాబాయి చాను విజయానికి సార్థకత లభిస్తుంది.