Breaking News Live Telugu Updates: బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటిస్తున్న సీఎం కేసీఆర్ - 90 శాతం హామీలు అమలు చేశామని వెల్లడి
Breaking News Live Telugu Updates: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం వెంటనే పొందవచ్చు.
LIVE
Background
KCR To Release BRS Manifesto: తెలంగాణ సహా 5 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ఇటీవల ఈసీ విడుదల చేసింది. దాంతో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోపై ఫోకస్ చేశారు. ఇదివరకే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ మ్యానిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారు చేశారు. అక్టోబర్ 15 (ఆదివారం) మధ్యాహ్నం 12.15 కు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ముహూర్తం ఫిక్స్ చేశారు. అదే రోజు అభ్యర్థులకు కేసీఆర్ బి ఫామ్ ఇవ్వనున్నారు. ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగేలా ఉంటుందని హరీష్ రావు, కేటీఆర్ లు చెప్పడంతో బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై ప్రజలతో పాటు విపక్షాలలోనూ ఉత్కంఠ నెలకొంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ కి 5 రోజుల ముందు బీఆర్ఎస్ పార్టీ (అప్పటి టీఆర్ఎస్ పార్టీ) మేనిఫెస్టోను ప్రకటించింది. కానీ ఈసారి అభ్యర్థులను చాలా త్వరగానే ప్రకటించిన సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోతో మ్యాజిక్ చేయాలని భావిస్తున్నారు. 2019లో ఎన్నికలు జరగాల్సి ఉండగా సీఎం కేసీఆర్ కొన్ని నెలల ముందే అసెంబ్లీని రద్దు చేసి 2018లోనే ఎన్నికలకు వెళ్లి ఘన విజయం సాధించారు.
రైతు బంధు, రైతు భీమాపై ప్రకటనలు ఉంటాయని అన్నదాతలు భావిస్తున్నారు. గృహిణుల కోసం ప్రకటన ఉంటుందని మహిళలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆసరా పింఛన్ల పెంపు చేసే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. బీసీ బంధు, దళిత బంధు లాంటి పథకాల అమలు వేగవంతం చేసే విధంగా కేసీఆర్ మరిన్ని వరాలు ప్రకటిస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. అనారోగ్యం నుంచి కోలుకున్న కేసీఆర్.. మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లతో ప్రత్యేకంగా సమావేశమై బీఆర్ఎస్ మ్యానిఫెస్టోకు తుది మెరుగులు దిద్దినట్లు సమాచారం. ప్రతిపక్షాల వ్యూహాలకు చెక్ పెట్టేలా, అన్ని వర్గాల వారిని ఆకర్షించేలా ఎన్నికల్లో గెలుపు కోసం ప్రణాళికలు రచిస్తున్నారు.
16న సీఎం కేసీఆర్ సభ
అక్టోబర్ 16వ తేదీన జనగామలో ముఖ్యమంత్రి కేసీఆర్ సభ ఏర్పాటు చేసినట్లు మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. జనగామలో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు బహిరంగ సభ ప్రారంభమవుతుందన్నారు. సీఎం కేసీఆర్ సభ ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. జిల్లాకు సాగునీరు, తాగునీరు వచ్చిందన్నారు. జనగామ పట్టణంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్లు ఎర్రబెల్లి చెప్పారు.
మరో లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లు: సీఎం కేసీఆర్
హైదరాబాద్ లో మరో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇళ్లు ఉన్న వారికి గృహలక్ష్మీ కొనసాగిస్తూనే.. ఇళ్ల స్థలాలు లేని వారికి స్థలాలు కూడా ప్రభుత్వమే సమకూర్చాలని నిర్ణయించినట్లు బీఆర్ఎస్ మేనిఫెస్టోలో వివరించారు.
'సౌభాగ్య లక్ష్మీ' పథకం - పేద మహిళలకు రూ.3 వేలు
సౌభాగ్య లక్ష్మీ పథకం కింద బీపీఎల్ కింద ఉన్న పేద మహిళలకు రూ.3 వేల గౌరవ భృతి ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.
ఆరోగ్య శ్రీ గరిష్ట పరిమితి రూ.15 లక్షలు: సీఎం కేసీఆర్
ఆరోగ్య శ్రీ గరిష్ట పరిమితి రూ.15 లక్షలకు పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీనికి కేసీఆర్ ఆరోగ్య రక్ష అని పేరు పెట్టారు. అర్హులైన మహిళలకు రూ.3 వేల భృతి అందిస్తామన్నారు. అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులకు రూ.400కే సబ్సిడీ సిలిండర్ అందిస్తామని వెల్లడించారు.
రైతు బంధు పథకం ద్వారా రూ.16 వేలు: సీఎం కేసీఆర్
రైతు బంధు పథకం ద్వారా రూ.16 వేలు అందించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీన్ని దశలవారీగా పెంచనున్నట్లు పేర్కొన్నారు.
వికలాంగుల పెన్షన్ రూ.6 వేలకు పెంపు: సీఎం కేసీఆర్
వికలాంగుల పెన్షన్ రూ.6 వేలకు పెంచనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీన్ని కూడా దశల వారీగా చేయనున్నట్లు తెలిపారు.