Andheri By Election: మాపై ఇంత పక్షపాతమేంటి? పార్టీ గుర్తు కేటాయింపుపై ఈసీకి లేఖ రాసిన ఠాక్రే వర్గం
Andheri By Election: ఎన్నికల సంఘం తమకు కేటాయించిన పార్టీ గుర్తుపై ఠాక్రే వర్గం అసహనంగా ఉంది.
Andheri By Election:
కాగడా గుర్తుపై అసహనం..
మహారాష్ట్ర రాజకీయాల్లో వేడి కొనసాగుతూనే ఉంది. ఉద్ధవ్, ఠాక్రే వర్గాలు ఏదో విషయంలో గొడవ పడుతూనే ఉన్నాయి. ఈ మధ్యే శివసేన పార్టీ పేరును, గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ఫ్రీజ్ చేసింది. ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఉద్ధవ్ ఠాక్రే వర్గం.. దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అంధేరీ ఈస్ట్ ఉప ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. దీంతో పోటీకి ఉద్ధవ్ ఠాక్రే వర్గం, ఏక్‌నాథ్ శిందే వర్గం కొత్త పేర్లు, గుర్తులను ఎంచుకోవాలని ఈసీ ఆదేశించింది. ఈసీ ఆదేశం మేరకు రెండు వర్గాలు ఇప్పటికే కొత్త పేర్లు, గుర్తులకు సంబంధించిన ఆప్షన్‌లను ఈసీకి సమర్పించాయి. ఎవరిది అసలైన శివసేన అనే విషయంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే వర్గాల మధ్య వివాదం కొనసాగుతోంది. అయితే..మహారాష్ట్రలోని అంధేరీ ఈస్ట్ నియోజకవర్గానికి జరిగే ఎన్నికల్లో ఠాక్రే వర్గానికి కాగడా గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. దీనిపైనే...ఠాక్రే వర్గం చాలా అసంతృప్తితో ఉంది. ఈ క్రమంలోనే...కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. పార్టీ గుర్తులను కేటాయించటంలో "పక్షపాతం" చూపించారని అసహనం వ్యక్తం చేసింది. "ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం
చాలా అసంతృప్తిని కలిగించింది. ఉద్దవ్ ఠాక్రే కూడా దీనిపై అసహనంగా ఉన్నారు" అని ఠాక్రే తరపు న్యాయవాది వివేక్ సింగ్ ఈ లేఖలో పేర్కొన్నారు. పార్టీ గుర్తుని కాగడాగా నిర్ణయించిన కేంద్ర ఎన్నికల సంఘం...పార్టీ పేరుని శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రేగా కొనసాగించవచ్చునని తేల్చి చెప్పింది.
ఎన్నో రోజులుగా యుద్ధం..
శివసేన ఎవరిదన్న అంశంలో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే వర్గాల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. దీంతో ఇరు వర్గాలు ఎప్పుడో సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. తమదే నిజమైన శివసేన అని ఏక్‌నాథ్ శిందే వర్గం చెప్పటంతో పాటు, శివసేన పార్టీ గుర్తుని తమకే ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. అయితే విచారణ తేలేంత వరకూ ఎన్నికల సంఘం ఈ అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని సుప్రీం కోర్టు గతంలో తేల్చి చెప్పింది. అనంతరం ఈ అంశంపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవచ్చని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఏక్‌నాథ్ శిందే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినా ఇంకా శివసేన ఎవరిది అన్న చర్చ వాడివేడిగా సాగుతూనే ఉంది. ఈ అంశంపై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ఎన్నోసార్లు స్పందించారు. బాలాసాహెబ్ స్థాపించిన శివసేనను కేంద్ర ప్రభుత్వం నాశనం చేయాలని చూస్తోందని విమర్శించారు. 56 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీని ఇలా చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇక మరో విషయంలోనూ ఠాక్రే వర్గం ఆగ్రహంగా ఉంది. బృహణ్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMMC)పై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని, రుజుటా లట్కే రాజీనామాను ఆమోదించకుండా కావాలనే జాప్యం చేస్తోందని విమర్శిస్తోంది. ఉద్దవ్ వర్గం నుంచి రుజుటా లట్కే అంధేరీ ఎన్నికల బరిలోకి దిగనున్నారు. BMMC రాజీనామా ఆమోదిస్తే తప్ప ఆమె ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఉండదు. రుజుటా భర్త ఎమ్మెల్యే రమేష్ లట్కే మృతితో ఇక్కడ ఉప ఎన్నికలు నిర్వహించాల్సి వస్తోంది.
Also Read: Viral Video: ఇదేందిరా నాయనా! చిరుతతో యువతి లిప్ లాక్- వైరల్ వీడియో!