Fuel Price Stability : పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగవు - ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొంటామని కేంద్రం భరోసా !
పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగా ఉంచుతామని కేంద్రం ప్రజలకు భరోసా ఇచ్చింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత భారీగా పెంచుతారన్న ప్రచారం కారణంగా ప్రభుత్వం ఈ క్లారిటీ ఇచ్చింది.
రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంతో పెట్రోల్, డీజిల్ ( Petrol Price ) ధరలు అమాంతం పెరిగిపోతాయని.. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత పెట్రోల్ రేటు రూ. నూట యాభై చేరుతుందని భయాందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ( Central Governament ) ప్రజలకు రిలీఫ్ ఇచ్చే మాట చెప్పింది. పరిస్థితులను తాము చాలా క్షణ్ణంగా అధ్యయనం చేస్తున్నామని ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్రోల్, డీజిల్ రేట్లను కట్టు తప్పి పోనివ్వబోమని.. పెరగకుండా చూస్తామని కేంద్రం చెప్పింది. ఇందు కోసం అన్ని మార్గాలనూ అన్వేషిస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వ అధికారులు స్పష్టం చేశారు.
యుద్ధ పరిస్థితుల కారణంగా క్రూడాయిల్ ( Crude ) ధర అంతర్జాతీయ మార్కెట్లో అనూహ్యంగా పెరిగిపోతోంది. క్రూడాయిల్ బ్యారెల్ ధర వంద డాలర్లు దాటిపోయింది. దీంతో పెట్రోల్ ధరలు పెరగడం ఖాయమైపోయింది. అయితే ప్రస్తుతం ఇండియాలో ( India ) ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ( Five State Elections ) జరుగుతున్నాయి. ఈ కారణంగా పెద్ద ఎత్తున పెట్రోల్ , డీజిల్ రేట్లను సవరించడం లేదు. వచ్చే నష్టాలను కంపెనీలే భరిస్తున్నాయి. అయితే ఒక్క సారి ఐదు రాష్ట్రాల పోలింగ్ ముగిసిన తర్వాత అన్నీ కలిపి ఒకే సారి వడ్డిస్తాయన్న ప్రచారం జరుగుతోంది.
ఇది ప్రజల్లో అంతకంతకూ పెరుగుతూండటంతో కేంద్రం ఈ భయాల్ని పారదోలడానికి.. పెట్రోల్ , డీజిల్ రేట్లు అనూహ్యంగా పెరగవడానికి భరోసా ఇస్తోంది. అవసరమైన నిల్వలను వ్యూహాత్మకంగా విడుదల చేస్తామని కూడా ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. రేట్లు ( Petrol Rates ) అనూహ్యంగా పెరగకుండా ఉండేలా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలను కేంద్రం తీసుకుంటుందని చెబుతున్నారు. మొత్తంగా పెట్రోల్ రేట్లు పెరగవనే భరోసాని కేంద్రం ప్రజలకు ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తోంది.
2014లో క్రూడాయిల్ ధర 110 డాలర్లకుపైగానే ఉండేది. ఆ తర్వాత అతి తక్కువకు పడిపోయింది. పాతిక డాలర్లకు కూడా వచ్చి పడింది. ఇప్పుడు మళ్లీ వంద డాలర్లకు చేరింది. అయితే ఇండియాలో పెట్రోల్ ధరలు మాత్రం అనూహ్యంగా పెరుగుతూనే ఉన్నాయి. కేంద్రం పెద్ద ఎత్తున ఎక్సైజ్ సుంకాలు పెంచడమే కారణం. ఇటీవల పెట్రోల్, డీజిల్‌పై కొంత మంది తగ్గించినా సుంకం మాత్రం అలాగే కొనసాగుతోంది. కేంద్రం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో ప్రజల ఆగ్రహానికి గురి కాకుండా ఈ ప్రకటన చేసిందో.. లేకపోతే నిజంగా పెట్రోల్ ధరలు పెరగకుండా చూస్తూందో..ఎన్నికలయిన తర్వాతే తేలుతుంది.