Alluri Sitaramaraju News: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో బైకుపై వెళ్లి కలెక్టర్ సుడిగాలి పర్యటన!
Alluri Sitaramaraju News: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ సుమిత్ కుమార్ సుడిగాలి పర్యటన చేశారు. రహదారి సౌకర్యం లేని చోట మోటార్ సైకిల్ పై తిరుగుతూ సందర్శించారు
![Alluri Sitaramaraju News: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో బైకుపై వెళ్లి కలెక్టర్ సుడిగాలి పర్యటన! Alluri Sitaramaraju District Collector Sumith Kumar Sudden Visit in Maoist Affected Areas Alluri Sitaramaraju News: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో బైకుపై వెళ్లి కలెక్టర్ సుడిగాలి పర్యటన!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/13/6634899f0cdca20ee99424dc5aed4c4a1668320657191519_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Alluri Sitaramaraju News: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన పాడేరు మండలం జామి గూడ, పెదబయలు మండలం బూసిపుట్టు పంచాయతీలలో గల పలు గ్రామాలలో అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం సుడిగాలి పర్యటన చేశారు. ముంచింగి పుట్టు ప్రధాన కేంద్రంలో ఇద్దరు వ్యక్తులు అనుమతి లేని యాప్లతో రైతులను రిజిస్ట్రేషన్ చేయడం గమనించి వారిపై తగు చర్యలు తీసుకోవాలని స్థానిక ఎస్సైను ఆదేశించారు. అదే విధంగా ఏపీజీవీబీ, స్టేట్ బ్యాంక్ ఏటీఎంలో నగదు ఉండటం లేదని, ఏపీజీవీబీ కరస్పాండెంట్ ద్వారా నగదు తీసుకోవటానికి సర్వీస్ చార్జీల కన్నా అధికంగా తీసుకుంటున్నారని గ్రామస్థులు ఇచ్చిన ఫిర్యాదుపై కలెక్టర్ స్పందిస్తూ.. వెంటనే ఆయా బ్యాంకుల మేనేజర్లకు ఫిర్యాదు చేయడంతో పాటు వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. అనుమతులేని ఏజెంట్.. ఆధార్ అప్డేషన్ కరెక్షన్ తదితర పనులు చేయటం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు.
ముంచింగి పుట్ట నుంచి బూసి పుట్టు చేరుకున్న కలెక్టర్ 104 వాహనం ద్వారా అందిస్తున్న సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 104 వాహనం తిరిగే షెడ్యూల్ ను ముందుగానే గ్రామస్థులకు తెలియజేయాలని సూచించారు. అవసరమైన ప్రతి ఒక్కరికి స్కానింగ్ చేయాలని ఆదేశించారు. గ్రామంలో గర్భిణీలకు స్కానింగ్ అవసరమైతే ముంచింగి పుట్టు సామాజిక ఆరోగ్య కేంద్రం సందర్శించాలని అవసరమైన యంత్రాలతో పాటు శిక్షణ పొందిన డాక్టర్ ఉన్నారని తెలిపారు. వారి సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. జామి గూడా గ్రామం సందర్శించిన కలెక్టర్ పీఐయూ ద్వారా 220 లక్షల రూపాయలతో బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించి మార్చి నాటికి పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
కొజ్జారిగూడ, జాడి గూడ, గుంజువాడ, తారకి, జామి గూడ, పిన రావిల్లి, మొదలగు ఆరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల్లలో తనిఖీలు నిర్వహించారు. అయితే అక్కడి పాఠశాలల్లో పలువురు ఉపాధ్యాయులు వారానికి ఒక్కరోజే వచ్చి వెళ్తుంటారని గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ సుమిత్.. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓ, ఏటీడబ్ల్యూఓలు సోమవారం తనను వ్యక్తిగతంగా కలవాలని ఆదేశించారు. వారిపై తగు చర్యలకు ఉపక్రమించారు. అదే విధంగా కొజ్జారిగూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు మనబడి నాడు నేడు ఫేజ్ 1 కింద 18 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయని, కానీ ఎలాంటి పనులు చేపట్టలేదని సర్పంచ్, ఎంపీటీసీ, తదితరులు ఫిర్యాదు ఇచ్చారు. దీనిపై పూర్తి నివేదిక అందజేయాల్సిందిగా ట్రైబల్ వెల్ఫేర్ ఈఈని కలెక్టర్ ఆదేశించారు. కొజ్జారిగూడ గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి అక్టోబర్ నెలకు సరపరా అయిన పాలు గుడ్లు ఇతర రేషన్ అర్హుల ఇంటికి అందించాలని, నవంబర్ నెల కోటను కూడా వారి వారి ఇండ్లకు అందించాలని సూచించారు.
జామి గూడ పంచాయతీ పరిధిలో గల 14 గ్రామాల్లో 11 గ్రామాలకు 56 లక్షల రూపాయలతో జలజీవన్ మిషన్ కింద నీటి సరఫరా పనులు మంజూరయ్యాయని, అందులో మిగిలిన నిధులతో మిగిలిన మూడు గ్రామాలకు నీటి సరఫరా పథకాలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. గ్రామ పర్యటనల భాగంగా ఒక ఇంటి బయట ఉన్న వంతల బొజ్జయ్య దీనమైన ఆరోగ్య పరిస్థితిని గమనించిన కలెక్ట..ర్ అతనికి కావలసిన సహాయం అందించాలని ఆదేశించారు. బూసి పుట్టు గ్రామ సచివాలయ భవనం కాంట్రాక్టర్ రాజు ఇప్పటి వరకు పనులు ప్రారంభించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు కాంట్రాక్ట్ ను రద్దు చేయడంతో పాటు, అతనికి అప్పగించిన మిగిలిన కాంట్రాక్టులను కూడా రద్దుచేసి వేరొక కాంట్రాక్టర్ తో పూర్తి చేయించాలని ఆదేశించారు. జామి గూడ నుంచి ఆంధ్ర ఒడిశా బోర్డర్ వరకు సరైన రహదారి సౌకర్యం లేనందున కొంతదూరం జీపులో, మరికొంత దూరం బైకుపై ప్రయాణించి రోడ్ల పరిస్థితిపై ఆరా తీశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)