AICC New Office : ఢిల్లీలో కాంగ్రెస్‌కు కొత్త ఆఫీస్ - పేరు ఇందిరా భవన్ -బుధవారమే ఓపెనింగ్ !
Congress: ఢిల్లీలో ఏఐసిసి కొత్త కార్యాలయం ఇందిరా భవన్ బుధవారం ప్రారంభం కానుంది. ఐదు దశాబ్దాల తర్వాత పార్టీ కార్యాలయం మారుతోంందది.
AICC new office in Delhi Indira Bhavan will be inaugurated on Wednesday: అఖిల భారత కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయం సర్వ హంగులతో సిద్ధమయింది. బుధవారం సోనియాగాంధీ కాంగ్రెస్ కొత్త కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు కాంగ్రెస్ ముఖ్య నేతలంతా ఢిల్లీ చేరుకుంటున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లారు.
పదిహేనేళ్ల క్రితం నిర్మాణం ప్రారంభించి ఇప్పటికి పూర్తి చేసుకున్న కాంగ్రెస్
ఢిల్లీలో ‘24 అక్బర్ రోడ్’ ఇప్పటి వరకూ ఏఐసిసి కార్యాలయంగా ఉంది. దాదాపుగా ఐదు దశాబ్దాల నుంచి అదే ఆఫీసు. ఇప్పుడు కొత్త ఆఫీసుని దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ మార్గ్ కి మారుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయ నిర్మాణం పదిహేనేళ్లుగా సాగగుుతోంది. 2009లో సోనియా ఏఐసీసీ నేతగా ఉన్నపుడు నిర్మాణం ప్రారంభించారు. జన్ సంఘ్ సిద్ధాంతకర్తల్లో ఒకరైన దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పేరిట ఉన్న రోడ్ లో కాంగ్రెస్ కొత్త ఆఫీసు ఉండటాన్ని ఆ పార్టీ నాయకత్వం ఇష్టపడటం లేదు. అందుకే వెనుక గేట్ నే మెయిన్ గేట్‌గా ప్రకటించి వెనుక గేట్ నుంచి రాకపోకలు జరిపేలా నిర్ణయించి, పార్టీ కార్యాలయ చిరునామాను ‘9ఎ కోట్ల రోడ్’గా ప్రకటించారు. దీనికి ఇందిరా భవన్ అని పేరు పెట్టారు.
ప్రస్తుతం అక్బర్ రోడ్‌లో కార్యాలయం - బిజీగా ఉన్న ప్రాంతం కావడంతో తరలింపు
ప్రస్తుతం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంగా సేవలందిస్తున్న 24, అక్బర్ రోడ్ భవంతి ఢిల్లీలో అత్యంత బిజీ ఏరియాలో ఉంది. పాలనా భవనాలతో పాటు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారుల నివాస భవనాలు మాత్రమే ఉంటాయి. అన్నీ కేంద్ర ప్రభుత్వ బంగ్లాలే. ఏఐసీసీ ఆఫీసు ఉన్నది కూడా ప్రభుత్వ బంగ్లాలోనే. ఆ ప్రాంతంలో రాజకీయ పార్టీల కార్యాలయాలపై సుప్రీంకోర్టు అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ ఇచ్చిన ఆదేశాల తర్వాత డీడీయూ మార్గ్‌లో వివిధ రాజకీయ పార్టీలకు స్థలాలను కేటాయించారు.
ఎప్పుడో సొంత ఆఫీస్ కట్టుకున్న బీజేపీ -ఇన్నాళ్లకు పూర్తి చేసుకున్న కాంగ్రెస్
బీజేపీ తమకు కేటాయించిన స్థలంలో అధునాతన సదుపాయాలతో ఓ భవనాన్ని అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్మించుకుంది. బీజేపీ కన్నా చాలా ఏళ్ల క్రితమే కాంగ్రెస్ పార్టీ కూడా డీడీయూ మార్గ్‌లో తమకు కేటాయించిన స్థలంలో భవన నిర్మాణం చేపట్టినా అధికారం పోవడంతో నిర్మాణాన్ని నత్తనడకన కొనసాగించారు. ఇప్పుడు పూర్తికావడంతో అక్కడి నుంచి కార్యకలాపాలను కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. మొత్తం 6 అంతస్థుల్లో నిర్మించిన ఈ భవనంలో అత్యాధునిక సౌకర్యాలను ఏర్పాటు చేసుకున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పార్టీకి చెందిన 400 మంది కీలక నాయకులు హాజరుకానున్నారు.