Agnipath Scheme: అగ్నివీరులపై ఎలాంటి వివక్ష ఉండదు, ఆందోళనలు వద్దు-అనిల్ పూరీ ఇంకేమన్నారంటే
అగ్నిపథ్ పథకంపై సైనిక వ్యవహారాల అదనపు సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పూరీ స్పష్టతనిచ్చారు. అగ్నివీరులకు శాశ్వత సైనికులతో పాటు సమాన ప్రాధాన్యత దక్కుతుందని స్పష్టం చేశారు.
అగ్నిపథ్‌పై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న క్రమంలో కేంద్రం అన్ని విధాలా వివరణ ఇచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఈ నియామక ప్రక్రియను నిలిపివేసే ప్రసక్తే లేదని ఇప్పటికే స్పష్టం చేసింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆర్మీలోని ఉన్నతాధికారులతో వరుస సమావేశాలు ఏర్పాటు చేశారు. ప్రజలకు అర్థమయ్యే విధంగా ఈ పథకంలోని ప్రయోజనాలను వివరించారని సూచించారు. అందులో భాగంగానే పలువురు సీనియర్ అధికారులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి అగ్నిపథ్‌పై స్పష్టతనిచ్చారు. సైనిక వ్యవహారాల అదనపు సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పూరీ ఈ సందర్భంగా కీలక వివరాలు వెల్లడించారు.
అగ్నివీరులకు ఎలాంటి ఇబ్బందులు కలగవు..
అగ్నిపథ్‌లో భాగంగా ఎంపికైనా అగ్నివీరులు సర్వీస్‌లో ఉండగా అమరులైతే వారికి కోటి రూపాయల పరిహారం దక్కుతుందని స్పష్టం చేశారు అనిల్ పూరీ. సియాచెన్‌తో సహా మరికొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో పని చేసే సైనికులతో సమానంగా అగ్నివీరులకూ ప్రాధాన్యత దక్కుతుందని వెల్లడించారు. ఈ విషయంలో అగ్నివీరులపై ఎలాంటి వివక్ష ఉండదని అన్నారు. ప్రస్తుతానికి అగ్నిపథ్‌లో భాగంగా 46 వేల మందిని తీసుకుంటున్నామని, త్వరలోనే ఈ సంఖ్యను 1.25 లక్షలకు పెంచుతామని తెలిపారు. వచ్చే నాలుగైదేళ్లలో క్రమంగా ఈ సంఖ్యను 50 వేలు, 60 వేలకు పెంచుతామని, ఆ తరవాత ఒకేసారి లక్ష మందిని రిక్రూట్ చేసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్ట్‌లా దీన్ని చేపట్టామని, పూర్తి స్థాయిలో పరిశీలించాక క్రమంగా విస్తరిస్తామని చెప్పారు అనిల్ పూరీ.
రిజర్వేషన్ల నిర్ణయం ముందుగా తీసుకున్నదే..
అగ్నిపథ్‌పై ఆందోళనలు వ్యక్తమైన తరవాతే రిజర్వేషన్లు, వయోపరిమితి పెంపు లాంటి నిర్ణయాలు పెంచారని కేంద్రంపై విమర్శలు వచ్చాయి. ఈ అంశంపైనా స్పష్టతనిచ్చారు అనిల్ పూరీ. అవి ఈ అల్లర్లు జరగకముందే తీసుకున్న నిర్ణయాలని స్పష్టం చేశారు. ఎప్పటి నుంచో అగ్నిపథ్‌ను తీసుకొచ్చే విషయమై మేథోమధనం సాగుతోందని చెప్పారు. దేశ సైన్యంలో యువకుల సంఖ్యను పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఏటా త్రివిధ దళాల నుంచి 17,600 మంది ముందుగానే రిటైర్ అయిపోతున్నారని, ఆ లోటును భర్తీ చేసేందుకే ఇలా రిక్రూట్‌మెంట్ చేసుకోవాల్సి వస్తోందని వివరణ ఇచ్చారు. అగ్నివీరులకు సీఏపీఎఫ్, అస్సోం రైఫిల్స్ బలగాల్లో 10% రిజర్వేషన్లు వర్తిస్తాయని ఇటీవలే ప్రకటించింది కేంద్రం. వయోపరిమితిని కూడా పెంచింది. అయినా ఆందోళనలు మాత్రం ఆగటం లేదు. రిక్రూట్‌మెంట్‌ని మొదలు పెడతామంటూ ఇప్పటికే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్పష్టం చేసింది. డిసెంబర్ నాటికి తొలి బ్యాచ్‌ను సిద్ధం చేసేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది కేంద్రం. ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదన్నట్టుగా వ్యవహరిస్తోంది.