Taliban Education Ban: మహిళల హక్కులు మా ప్రియారిటీ కానే కాదు, మా చట్టమే మాకు ముఖ్యం - తాలిబన్ ప్రతినిధి
Taliban Education Ban: మహిళల హక్కుల్ని కాపాడటం తమ ప్రాధాన్యత కాదని తాలిబన్ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు.
Taliban Women Education Ban:
మహిళలపై ఆంక్షలు..
అఫ్గనిస్థాన్‌లో తాలిబన్ల పాలన మొదలైనప్పటి నుంచి మహిళా హక్కుల్ని పూర్తిగా అణిచివేస్తున్నారు. ముఖ్యంగా వాళ్లు చదువుకోకుండా అడ్డుకుంటోంది తాలిబన్ ప్రభుత్వం. యూనివర్సిటీ విద్యపై ఇటీవలే నిషేధం విధించింది. స్వచ్ఛంద సంస్థల్లోనూ పని చేయకూడదని తేల్చి చెప్పింది. ఈ నిర్ణయాలపై అంతర్జాతీయంగా విమర్శలు వస్తున్నాయి. అయినా...తాలిబన్‌లు మాత్రం ఇవేవీ లెక్క చేయడం లేదు. పైగా...దీని గురించి మాట్లాడటానికీ ఆసక్తి చూపించడం లేదు. "మహిళలపై ఆంక్షల్ని తొలగించాలనే విషయం అసలు మా ప్రియారిటీ కానే కాదు" అని తాలిబన్ ప్రతినిధి ఒకరు చేసిన వ్యాఖ్యలు సంచలనమవుతున్నాయి.
"మహిళల హక్కులు అనేది మా ప్రియారిటీ కాదు. ఇస్లామిక్ లా కి వ్యతిరేకంగా ఉండే దేన్నైనా మేం సహించం. ప్రస్తుతం దేశంలో ఏ నిబంధనలైతే ఉన్నాయో..వాటికి అనుగుణంగానే నడుచుకుంటున్నాం"
- తాలిబన్ ప్రతినిధి
పలు దేశాలు ఆగ్రహం..
ఇప్పటికే మహిళల చదువులపై తీవ్రమైన ఆంక్షలు విధిస్తున్నారు తాలిబన్లు. ఎన్‌జీవోల్లోనూ పని చేయకూడదన్న రూల్ తీసుకొచ్చాక మహిళల నిరసనలు తీవ్రమయ్యాయి. చాలా యూనివర్సిటీల ముందు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. అమెరికా, యూకే, జర్మనీ, ఈయూ సహా పలు దేశాలు తాలిబన్ల నిర్ణయాన్ని తప్పుబడుతున్నాయి. ఇప్పటికిప్పుడు ఈ ఆంక్షలన్నీ ఎత్తివేసి మహిళలు చదువుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. యూనిసెఫ్ రిపోర్ట్ ప్రకారం...అఫ్గాన్‌లో బాలికలు సెకండరీ ఎడ్యుకేషన్ కొనసాగించకపోవడం వల్ల దేశ జీడీపీ 2.5% మేర పడిపోయింది. కేవలం 12 నెలల్లోనే 500 మిలియన్ డాలర్ల మేర కోల్పోయింది. అయితే...తాలిబన్లు మాత్రం "మతపరమైన విధానాలను ఓ సారి గమనించండి. అనవసరమైన రచ్చ చేయకండి" అంటూ ఆయా దేశాలకు వివరణ ఇస్తున్నాయి. ఇప్పటికే 11 దేశాలు తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాటం మొదలు పెట్టాయి.
మహిళల ఆందోళన..
మహిళలనే లక్ష్యంగా చేసుకుని తాలిబన్లు విపరీత ఆంక్షలు విధిస్తున్నారు. ఈ క్రమంలోనే...వాళ్ల చదువులపైనా తుపాకీ గురి పెడుతున్నారు. మహిళలు యూనివర్సిటీ విద్య అభ్యసించడంపై నిషేధం విధించారు. మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నారంటూ అమెరికా సహా ఐక్యరాజ్య సమితి దేశాలు మండి పడుతున్నా...తాలిబన్లు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. "మేమేమీ అంత అరాచకవాదులం కాదు. ఎలా పాలించాలో తెలుసు" అంటూనే అప్ఘనిస్థాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు...అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే ఇలాంటి విపరీత నిర్ణయాలు తీసుకుంటున్నారు. మహిళల వస్త్రధారణపై ఇప్పటికే ఆంక్షలు విధించగా...ఇప్పుడు వాళ్ల చదువులపైనా ఉక్కుపాదం మోపుతున్నారు. నిజానికి తాలిబన్లు అధికారంలోకి వచ్చాక..యూనివర్సిటీలు అన్నీ ఇష్టం ఉన్నా లేకపోయినా...ఇలాంటి నిర్ణయాలను అమలు చేయాల్సి వస్తోంది. యువతీ యువకులకు ప్రత్యేక తరగతి గదులు ఏర్పాటు చేయడం, వేరువేరు ఎంట్రెన్స్‌లు పెట్టడం లాంటివి అమల్లోకి వచ్చాయి. యువతులకు కేవలం మహిళలే పాఠాలు చెప్పాలని ఆర్డర్లు జారీ చేశారు. సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్‌ను అభ్యసించే వీల్లేకుండా ఇప్పటికే చాలా మందిపై నిషేధం విధించారు. "మాకేం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. నేనే కాదు నా తోటి స్నేహితులు కూడా మౌనంగా ఉండిపోయారు" అని ఓ యువతి ఆవేదన వ్యక్తం చేసింది.
Also Read: Nepal Aircraft Crash:నేపాల్‌లో ఘోర ప్రమాదం, రన్‌వేపై క్రాష్ అయిన విమానం - ఫ్లైట్‌లో 72 మంది