Taliban Captured Panjshir: తాలిబన్ల వశమైన 'పంజ్ షీర్'.. ఖండించిన ఎన్ఆర్ఎఫ్
ప్రభుత్వ ఏర్పాటుకు ముందే పంజ్ షీర్ ను కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తోన్న తాలిబన్లు కీలక ప్రకటన చేశారు. పంజ్ షీర్ తమ వశమైందని తెలిపారు. రెసిస్టెన్స్ ఫోర్స్ కు చెందిన కీలక నేతలు హతమైనట్లు తెలిపారు.
"పంజ్ షీర్'ను వశం చేసుకున్నాం... రెసిస్టెమ్స్ ఫోర్స్ లో ముఖ్యమైన నేతలను కాల్చిచంపాం." ఇవి తాజాగా తాలిబన్లు చేసిన వ్యాఖ్యలు.
ఓవైప పంజ్ షీర్ ను స్వాధీనం చేసుకున్నామని తాలిబన్లు ఆరోపిస్తుంటే మరోవైపు మా దళాలు పోరాటానికి సిద్ధంగా ఉన్నాయని రెసిసెన్టెన్స్ ఫోర్స్ చెబుతోంది. ఇంతకీ ఏది నిజం? అఫ్గాన్ లో యుద్ధం ముగిసిందని తాలిబన్లు అంటున్నారు. అఫ్గాన్ ప్రజల కోసం మా పోరాటం కొనసాగుతుందని ఎన్ఆర్ఎఫ్ చెబుతోంది.
నిజమేనా..?
అమెరికా సేనలు వెళ్లిపోయినా అఫ్గాన్ లో తాలిబన్ల వెన్నులో వణుకు పుట్టిస్తోన్న పంజ్ షీర్ ను స్వాధీనం చేసుకోవడం వారికి చాలా కీలకం. అందుకే కొన్ని రోజులుగా అక్కడ తాలిబన్లు-ఎన్ఆర్ఎఫ్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. అయితే ఈ రోజు ఉదయం తాలిబన్లు.. పంజ్ షీర్ తమ వశమైందని మీడియాకి చెప్పారు.
అన్నీ అబద్ధాలే..
అయితే తాలిబన్లు చేసిన వ్యాఖ్యలను నేషనల్ రెసిస్టెన్స్ ఫోర్స్ ఖండించింది. తమ దళాలు పంజ్ షీర్ లోనే ఉన్నట్లు పేర్కొంది. తాలిబన్లతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఎన్ఆర్ఎఫ్ ట్వీట్ చేసింది.
ముఖ్య నేతలు హతం..
తాలిబన్లు- పంజ్ షీర్ దళాలకు మధ్య యుద్ధం జరగడం మాత్రం వాస్తవమే. ఎన్ఆర్ఎఫ్ లో కీలక నేత, అహ్మద్ మసూద్ ప్రతినిధి ఫహీమ్ దస్తీని తాలిబన్లు కాల్చిచంపారని టోలో న్యూస్ వెల్లడించింది. మరో కీలక నేత జనరల్ అబ్దులగ్ ఉదాద్ జరా కూడా ఈ దాడులలో చనిపోయినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.
నేషనల్ రెసిస్టెన్స్ ఫోర్స్ వ్యవస్థాపకుడు అహ్మద్ మసూద్ ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. చర్చల ద్వారా అఫ్గానిస్థాన్ లో యుద్ధాన్ని ముగించాలని మతపెద్దలు ఇచ్చిన పిలుపునకు ఎన్ఆర్ఎఫ్ సూత్రప్రాయంగా అంగీరరించింది. యుద్ధాన్ని విరమించుకోవడానికి రెసిస్టెన్స్ ఫోర్స్ సిద్ధంగా ఉందని.. తాలిబన్లు వ్యాలీని వదిలి వెళ్తేనే చర్చలకు కొనసాగిస్తామని ఆయన అన్నారు. ఈ మేరకు గ్రూప్ ఫేస్ బుక్ పేజీలో ఆయన పోస్ట్ చేశారు.