Afghanistan Crisis Update: 'పంజ్ షీర్'లో 600 మంది తాలిబన్లు హతం!
అఫ్గాన్ పంజ్ షీర్ లో 600 మంది తాలిబన్లను హతం చేసినట్లు రెసిస్టెన్స్ ఫోర్స్ ప్రకటించింది. మరో 1000 మంది తాలిబన్లు తమ అధీనంలో ఉన్నట్లు పేర్కొంది.
అఫ్గానిస్థాన్ లో తాలిబన్లకు ఎదురుగాలి వీస్తోంది. ముఖ్యంగా పంజ్ షీర్ వ్యాలీ వారికి కొరకరాని కొయ్యగా మారింది. ఇటీవల పంజ్ షీర్ వ్యాలీని తాము ఆక్రమించినట్లు తాలిబన్లు తెలిపారు. అయితే తమ చేతిలో 600 మంది తాలిబన్లు హతమైనట్లు రెసిస్టెన్స్ ఫోర్స్ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు స్పుత్నిక్ వార్త సంస్థ తెలిపింది.
دشمن در منطقه دالانسنگ شکست خورد. اشغال عنابه و خنج #پنجشیر هیچ واقعیت ندارد. قهرمانان مجرب و جدید نیروهای مقاومت در خط مقدم جبههها حضور پیدا کردهاند. رزمندگان آزادی مدبرانه با روحیه بالا آماده هر نوع حمله و یورش هستند. تهاجم دشمن ذبون مثل همیشه ناکام و محکوم به شکست است. pic.twitter.com/EZLbp5eUJT
— Fahim Dashti فهیم دشتی (@FahimDashty) September 4, 2021
పాక్ సాయం..
పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ ఆధ్వర్యంలోనే తాలిబన్లు పంజ్ షీర్‌పై దాడి చేస్తున్నట్లు అఫ్గాన్ నేత అమ్రుల్లా సాలేహ్ ఆరోపిస్తున్నారు. 570 మంది పాకిస్థాన్ ప్రత్యేక దళాలు, అల్ ఖైదా, ఐసిస్ వంటి ఉగ్రవాదులు తమ ప్రావిన్స్‌పై దాడికి దిగుతున్నట్లు నార్తర్న్ అలయెన్స్ ఆరోపిస్తోంది.
పంజ్‌షీర్‌పై దాడి చేస్తున్న తాలిబన్ దళాలకు మార్గనిర్దేశం చేయడానికి పాక్ ఐఎస్‌ఐ హెడ్ నేరుగా రంగంలోకి దిగినట్లు రెస్టిసెన్స్ దళాలు ఆరోపిస్తున్నాయి. అయితే పాకిస్థాన్ మాత్రం అమ్రుల్లా సాలేహ్ చేస్తున్న ఆరోపణల్ని ఖండించింది.
భీకర పోరు..
పర్యాన్ జిల్లాలో తాలిబన్లు, రెసిస్టెన్స్ దళాల మధ్య పోరాటం కొనసాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాలిబన్లను రెసిస్టెన్స్ దళాలు ముప్పు తిప్పలు పెడుతున్నట్లు సమాచారం. రెసిస్టెన్స్ దళాలు అత్యాధునిక డ్రోన్లు, బాంబులు వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. పంజ్ షీర్‌కు ప్రవేశించే మార్గాల్లో ల్యాండ్‌మైన్స్ ఏర్పాటు చేయడం వల్ల తాలిబన్లకు ఇబ్బందులు కలుగుతున్నాయట.
ప్రభుత్వ ఏర్పాటు వాయిదా..
కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ప్రకటనను వచ్చే వారానికి వాయిదా వేశారు తాలిబన్లు. ప్రభుత్వ ఏర్పాటుపై శుక్రవారమే ప్రకటిస్తామని దానిని శనివారానికి వాయిదా వేశారు. తాజాగా మరోమారు వాయిదా పడినట్లు తాలిబన్ ప్రతినిధి జబియుల్లా ముజాహిద్ ప్రకటించారు.