ABP-C voter Survey: గుజరాత్‌లో గెలుపెవరిది? కమల వికాసమా లేక కాంగ్రెస్ ప్రభంజనమా?
Gujarat elections 2022: డిసెంబర్‌లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై ABP News,C Voter Opinion Poll నిర్వహించింది.
Gujarat elections 2022: మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపెవరిది? డిసెంబర్‌లో జరగనున్న ఈ ఎన్నికల్లో ప్రజలు ఎవరిని గెలిపించనున్నారు? మళ్లీ గుజరాత్‌లో కమలం వికసిస్తుందా? లేక ఆమ్‌ఆద్మీ పార్టీ అందరికీ షాకిస్తుందా? జోడో యాత్రతో జోష్‌లో ఉన్న కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఈ ప్రశ్నలన్నింటిపై ABP News,C Voter Opinion Poll నిర్వహించింది.
ఈ పోల్‌లో గుజరాత్‌లో మరోసారి భాజపా విజయం సాధిస్తుందని అంచనా వేసింది. 1995 నుంచి రాష్ట్రంలో అధికారంలో ఉంది భాజపా. ఇప్పుడు ఏడోసారి కూడా గెలుస్తుందని ఈ పోల్‌లో తేలింది.
ఎవరికెన్ని?
మొత్తం గుజరాత్‌లో 182 స్థానాలు ఉన్నాయి. ఇందులో భాజపా 131-139 సీట్లు సాధిస్తుందని సర్వే అంచనా వేసింది. గుజరాత్‌లో కాంగ్రెస్‌కు 31- 39 సీట్లు వస్తాయని, ఆప్ 7-15 సీట్లు మాత్రమే సాధించే అవకాశముందని వెల్లడించింది. ఇతరులకు 0-2 సీట్లు వచ్చే అవకాశమున్నట్లు తేలింది.
అయితే ఆప్ రేసులోకి రావడం వల్ల భాజపా, కాంగ్రెస్ ఓటు శాతం తగ్గిపోతుందని తెలిపింది. భాజపాకు 45.4%, కాంగ్రెస్‌కు 29.1%, ఆప్‌నకు 20.2%, ఇతరులకు 5.3% ఓట్లు దక్కుతాయని అంచనా వేసింది ABP News,C Voter Opinion Poll 2022.
పలు ప్రశ్నలు
దీంతో పాటు భాజపా పాలన, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం ఇలా పలు సమస్యలపై ప్రజల అభిప్రాయాలను ఏబీపీ- సీఓటర్ బయటపెట్టింది.
1.ఇప్పటివరకు ఏ పార్టీ ఎన్నికల ప్రచారం అత్యంత ప్రభావవంతంగా ఉందని మీరు అనుకుంటున్నారు?
ఈ ప్రశ్నకు భాజపా ఎన్నికల ప్రచారం అత్యంత ప్రభావవంతంగా ఉన్నట్లు తేలింది. ఆ తర్వాత ఆమ్‌ఆద్మీ, చివరి స్థానంగా కాంగ్రెస్ నిలిచింది.
2. ఎన్నికల సమయంలో ద్రవ్యోల్బణం, విద్య వంటి సమస్యలు కాకుండా కులం, మతపరమైన సమస్యలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయా?
ఈ ప్రశ్నకు ఎక్కువ శాతం మంది అవును అని సమాధానమిచ్చారు.
3. ఆమ్ ఆద్మీ పార్టీ వల్ల గుజరాత్‌లో ఏ పార్టీ ఎక్కువ నష్టపోతుంది?
గుజరాత్‌లో ఆమ్‌ఆద్మీ ప్రభావం వల్ల కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉందని సర్వేలో తేలింది.
4.ప్రస్తుతం మీకు అత్యంత ముఖ్యమైన సమస్య ఏంటీ?
నిరుద్యోగం- 33.4%
విద్యుత్/నీళ్లు/రోడ్లు- 18.2%
5. ప్రస్తుత BJP రాష్ట్ర ప్రభుత్వ పనితీరును మీరు ఎలా రేట్ చేస్తారు?
బాగుంది- 44.0%
పర్లేదు- 23.8%
బాలేదు- 32.2%
సీఎం ఎవరు?
సీఎం అభ్యర్థిగా ఎవరుంటే బాగుంటుందన్న విషయంలోనూ సర్వే జరిగింది. ఇందులో 33.0% మంది.. ప్రస్తుత సీఎం భూపేందర్ భాయ్ పటేల్ (భాజపా)కు మద్దతుగా నిలిచారు. 20.4% మంది ఆప్‌నకు చెందిన అభ్యర్థే ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారని ABP News, C Voter సర్వే వెల్లడించింది.
2017లో
గుజరాత్‌లో ప్రస్తుతం భాజపా ప్రభుత్వం అధికారంలో ఉంది. గుజరాత్‌లో 182 శాసనసభ స్థానాలుండగా.. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి 99 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 77 స్థానాలు సాధించింది. ఆ తర్వాత రాష్ట్రంలో పలుమార్లు ఉప ఎన్నికలు జరగడంతో ప్రస్తుతం కాషాయ పార్టీ బలం 111కు పెరిగింది.