Chhattisgarh: పది నెలల పాపకు రైల్వేలో ఉద్యోగం, 18 ఏళ్లు రాగానే నేరుగా జాబ్‌లోకి-ఎందుకంటే?
ఓ రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రుల్ని కోల్పోయిన పది నెలల చిన్నారికి రైల్వే ఉద్యోగం ఇచ్చింది. మేజర్ కాగానే నేరుగా ఉద్యోగంలో చేరొచ్చని తెలిపింది.
చిన్నారికి రైల్వే ఉద్యోగం ఇవ్వటం ఇదే తొలిసారి..
ఇండియన్ రైల్వే చరిత్రలోనే ఓ అరుదైన రిక్రూట్‌మెంట్ జరిగింది. పది నెలల పాపకు ఉద్యోగం ఇచ్చింది భారతీయ రైల్వే. అపాయింట్‌మెంట్ లెటర్ రెడీగా ఉందని, ఆమెకు 18 ఏళ్లు నిండగానే నేరుగా వచ్చి జాయిన్ అవచ్చు అని వెల్లడించింది. అంతే కాదు. ఈ ఉద్యోగం ఇస్తున్నట్టు...ఆ పాప వేలి ముద్రను తీసుకుని రైల్వే రికార్డ్స్‌లో అధికారికంగా రిజిస్ట్రేషన్ కూడా చేశారు. ఓ చిన్నారికి ఇలా రైల్వే ఉద్యోగం ఇవ్వటం, చరిత్రలో ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన చిన్నారికి ఈ అరుదైన అవకాశం దొరికింది. అయితే ఈ రిక్రూట్‌మెంట్ వెనక ఓ విషాదం ఉంది. జూన్ 1న ఈ పాప తల్లిదండ్రులు రోడ్ యాక్సిడెంట్‌లో మరణించారు. ఈ పాప తండ్రి రాజేంద్ర కుమార్, బిలయ్‌లోని రైల్వే యార్డ్‌లో అసిస్టెంట్‌గా పని చేసేవారు. రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు మరణించగా, అదృష్టవశాత్తూ పాప బతికింది. ఈ చిన్నారికి రాయ్‌పూర్ రైల్వే డివిజన్‌లో సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేస్ సిబ్బంది విభాగంలో ఉద్యోగం ఇస్తున్నట్టు జులై 4వ తేదీన అధికారిక ప్రకటన చేశారు. నిబంధనల ప్రకారం ఈ కుటుంబానికి అన్ని విధాల సహకరిస్తామని వెల్లడించారు. కారుణ్య నియామకంలో భాగంగా ఈ రిక్రూట్‌మెంట్ చేపడతామని చెప్పారు.
కారుణ్య నియామకం అంటే..?
రైల్వేలో పని చేస్తున్న తల్లి లేదా తండ్రి మరణించిన సందర్భంలో, వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం అందిస్తారు. అలా కాకుండా వైద్య కారణాల వల్ల మధ్యలోనే రిటైర్ అయిపోయినా...వారిపై ఆధారపడిన వారికి ఉద్యోగం ఇస్తారు. ఉద్యోగుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో తీసుకొచ్చినవే ఈ కారుణ్య నియామకాలు. మృతి చెందిన ఉద్యోగుల వారసులు, వైద్య కారణాల వల్ల వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకున్న వారి వారసులు కారుణ్య నియామకాలకు అర్హులు. ఏడేళ్లు కనిపించకుండా పోయిన ఉద్యోగుల వారసులకూ ఈ ఉద్యోగాలు ఇచ్చేందుకు అవకాశముంటుంది. ఇలాంటి సందర్భాల్లో మిస్సింగ్ కేస్‌కు సంబంధించిన పోలీస్ రిపోర్ట్‌ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
Also Read: Sri Lanka Crisis: లంక ఎందుకిలా తగలబడుతోంది? ఆ నిర్ణయాలే నిప్పు రాజేశాయా?