Raghava Reddy Movie Review - రాఘవ రెడ్డి రివ్యూ: రాశి కుమార్తెగా నందితా శ్వేతా నటించిన సినిమా
Raghava Reddy Review In Telugu: శివ కంఠమనేని హీరోగా నటించిన తాజా సినిమా 'రాఘవ రెడ్డి'. ఇందులో రాశి, నందితా శ్వేతా తల్లి కుమార్తెలుగా నటించారు. జనవరి 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే?
సంజీవ్ మేగోటి
నందితా శ్వేతా, శివ కంఠమనేని, రాశి, ప్రవీణ్, అజయ్, పోసాని కృష్ణమురళి, అన్నపూర్ణమ్మ, అజయ్ ఘోష్
Raghava Reddy Telugu Movie Review: హీరోయిన్ నందితా శ్వేతా ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'రాఘవ రెడ్డి'. శివ కంఠమనేని, రాశి జంటగా నటించారు. ప్రవీణ్, అజయ్, పోసాని కృష్ణమురళి, అన్నపూర్ణమ్మ, అజయ్ ఘోష్, బిత్తిరి సత్తి, శ్రీనివాసరెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఎలా ఉందంటే?
కథ: లక్కీ అలియాస్ మహాలక్ష్మి (నందితా శ్వేతా) మహా అల్లరి పిల్ల. ఆమెది పక్కా తెలంగాణ భాష. ఆ అమ్మాయిని తీసుకుని వచ్చి విశాఖలోని కాలేజీలో జాయిన్ చేస్తుంది తల్లి దేవకీ (రాశి). తల్లి (అన్నపూర్ణమ్మ)తో కలిసి కుమార్తెను పెంచి పెద్ద చేస్తుంది. సింగిల్ పేరెంట్ అన్నమాట. దాంతో గారాబంతో పెరుగుతుంది. లక్కీ కాలేజీలో రాఘవ రెడ్డి (శివ కంఠమనేని) క్రిమినాలజీ ప్రొఫెసర్. ఆయన చాలా స్ట్రిక్ట్. లక్కీ అల్లరి పనులు చూసి పనిష్మెంట్ ఇస్తాడు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతుంటుంది. అయితే, ఒక రోజు లక్కీని ఎవరో కిడ్నాప్ చేస్తారు. అప్పుడు రాఘవ రెడ్డి దగ్గరకు దేవకీ వస్తుంది.
లక్కీని ఎవరు కిడ్నాప్ చేశారు? క్రిటికల్ కేసులు పరిష్కరించడంలో పోలీసులకు సాయం చేసే రాఘవ రెడ్డి తన తెలివితేటలు ఉపయోగించి లక్కీని ఎలా కాపాడాడు? లక్కీ, రాఘవ రెడ్డి, దేవకీ మధ్య సంబంధం ఏమిటి? అనేది సినిమా.
విశ్లేషణ: కమర్షియల్ కథ, కథనాలతో తెరకెక్కిన సినిమా 'రాఘవ రెడ్డి'. అయితే... రెగ్యులర్ యూత్ లవ్ స్టోరీని పక్కనపెట్టి డిఫరెంట్‌గా ట్రై చేశారు. తల్లీకూతుళ్లు, భార్యాభర్తల సెంటిమెంట్ ఉండేలా చూసుకున్నారు. దర్శకుడు సంజీవ్ మేగోటి రాసిన కథ, కథనాలు, సన్నివేశాలు కమర్షియల్ సినిమా ఫార్మాటులో తీశారు. రాఘవ రెడ్డి ఫుల్ వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్. శివ కంఠమనేని ఫైట్స్ చేశారు. పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పారు. సెంటిమెంట్ సీన్స్ చేశారు. తన శక్తి మేరకు రాఘవ రెడ్డి పాత్రకు న్యాయం చేయడానికి ప్రయత్నించారు. తన వరకు బాగా చేశారు. కెఎస్ శంకర్ రావ్, జి రాంబాబు యాదవ్, ఆర్ వెంకటేశ్వర్ రావు నిర్మాణ విలువలు పర్వాలేదు. సినిమా నిడివి రెండు గంటలు మాత్రమే. కానీ, ఇంకాస్త ట్రిమ్ చేయవచ్చు. అప్పుడు రేసీగా ఉండేది.
లక్కీ పాత్రకు అవసరమైన యాటిట్యూడ్ నందితా శ్వేతా చూపించారు. సాంగ్స్‌లో ఎనర్జీగా స్టెప్స్ వేశారు. ఫైట్స్ సూపర్ చేశారు. డైలాగ్ డెలివరీలో ఆమె ఎక్స్‌ప్రెషన్స్ నెక్స్ట్ లెవల్. నందిత తల్లిగా రాశి ఒదిగిపోయారు. ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె నటన ఆకట్టుకుంటుంది. పోసాని, అజయ్, ప్రవీణ్, అజయ్ ఘోష్, శ్రీనివాసరెడ్డి, బిత్తిరి సత్తి తదితరులు తమ పాత్రల పరిధి మేరకు చేశారు. పాటలు పర్వాలేదు. ఐటెం సాంగ్ చేసిన అమ్మాయి గ్లామర్ ఒలకబోసింది.
Also Read: #90's ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ రివ్యూ : ఈటీవీ విన్‌లో శివాజీ నటించిన వెబ్ సిరీస్
రెగ్యులర్ కమర్షియల్ కథలతో కంపేర్ చేస్తే... 'రాఘవ రెడ్డి' కథలో కాస్త కొత్తదనం ఉంది. వయసుకు తగ్గ పాత్రల్లో శివ కంఠమనేని, రాశి నటించారు. వాళ్లమ్మాయిగా నందితా శ్వేతా నటించారు. సెంటిమెంట్, ఎమోషనల్ సీన్స్ బావున్నాయి. ఫైట్స్ రొటీన్‌గా ఉన్నాయి. శ్రీనివాస రెడ్డి, బిత్తిరి సత్తి కామెడీ సరిగా వర్కవుట్ కాలేదు. భార్యాభర్తలు దూరం కావడానికి బలమైన కారణం రాసుకుని ఉంటే సన్నివేశాలకు మరింత బలం చేకూరేది. ఇమేజ్ ఉన్న హీరో చేయాల్సిన కథను సాధారణ హీరో చేశారు. థియేటర్లలో కంటే ఓటీటీలో వచ్చినప్పుడు చూడొచ్చు.
రేటింగ్: 2.25/5
Also Read: బెర్లిన్ సిరీస్ రివ్యూ: ‘మనీ హెయిస్ట్’ను మించిపోయిందా? ఎలా ఉంది?