Akkada Ammayi Ikkada Abbayi Review - అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి రివ్యూ: లవ్ ప్లస్ కామెడీ... సేఫ్ ఫార్ములాతో ప్రదీప్ మాచిరాజు సినిమా - హిట్టా? పట్టా?
Akkada Ammayi Ikkada Abbayi 2025 Review Telugu: బుల్లితెర, వెండితెర ప్రేక్షకులకు ప్రదీప్ మాచిరాజుకు స్పెషల్ ఫాలోయింగ్ ఉంది. ఈ రోజు 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'తో హీరోగా థియేటర్లలోకి వచ్చారాయన.
నితిన్ - భరత్
ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి, సత్య, గెటప్ శ్రీను, బ్రహ్మాజీ, కోదాటి పవన్ కళ్యాణ్, వెన్నెల కిషోర్ తదితరులు
Pradeep Machiraju's AAIA (Akkada Ammayi Ikkada Abbayi) Review: బుల్లితెరపై ప్రదీప్ మాచిరాజు యాంకరింగ్ సూపర్ హిట్. వెండితెరపై నటుడిగానూ విజయవంతమైన సినిమాలలో కనిపించారు. ఆ తర్వాత '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?'తో కథానాయకుడిగా మారారు. హీరోగా మొదటి అడుగులో విజయం సాధించారు. హీరోగా ఆయన వేసిన రెండో అడుగు 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'. 'జబర్దస్త్', 'సర్కార్' షోస్ ఫేమ్ నితిన్ - భరత్ దర్శకత్వం వహించారు. పాటలు, ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో చూడండి.
కథ (Akkada Ammayi Ikkada Abbayi Story): బైరిలంక గ్రామంలో ఓ తరం వచ్చేసరికి ప్రతి కుటుంబంలోనూ మగ బిడ్డ జన్మిస్తాడు. వరుసగా 60 మందికి పైగా అబ్బాయిలు పుట్టిన తర్వాత ఓ ఇంటిలో అమ్మాయి పుడుతుంది. ఆమెకు రాజా (దీపికా పిల్లి) అని పేరు పెడతారు. ఊరిలోనే 60 మంది అబ్బాయిలలో ఎవరో ఒకరికి రాజాను ఇచ్చి పెళ్లి చెయ్యాలని, రాజా పెళ్లి చేసుకున్న అబ్బాయికు తన ఆస్తిని రాసి ఇవ్వడంతో పాటు తన తర్వాత ప్రెసిడెంట్ చేస్తానని మాట ఇస్తాడు ఊరి పెద్ద.
ఆ ఊరిలో బాత్రూమ్స్ కట్టడం కోసం ఒక సివిల్ ఇంజనీర్ కృష్ణ ప్రదీప్ మాచిరాజు రప్పిస్తారు. బాత్రూమ్స్ కట్టడం కోసం సివిల్ ఇంజనీర్ ఎందుకు వచ్చాడు? అనేది పక్కన పెడితే... కృష్ణతో రాజా ప్రేమలో పడుతుంది. తమలో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంటుందని ఎదురు చూసిన 60 మంది... కృష్ణ - రాజాల ప్రేమ విషయం తెలిశాక ఏం చేశారు? తోటి వ్యక్తికి సహాయం చేసే అలవాటు లేని కృష్ణ... రాజా ప్రేమ కోసం ఏం చేయడానికి సిద్ధపడ్డాడు? ఆ 60 మందికి ఏం చేశాడు? చివరకు ఏం తెలుసుకున్నాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Akkada Ammayi Ikkada Abbayi Review Telugu): బుల్లితెరపై ప్రదీప్ మాచిరాజుకు క్లీన్ ఇమేజ్ ఉంది. ఆయన యాంకరింగ్ అందరినీ అలరించేలా ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ప్రదీప్ వినోదాన్ని ఎంజాయ్ చేస్తారు. అది దృష్టిలో పెట్టుకుని రచయిత సందీప్ బొల్ల, దర్శక ద్వయం నితిన్ - భరత్ సేఫ్ గేమ్ ఆడారు.
కథ, కథనం, మాటలు, దర్శకత్వం... ఒక్క విషయంలోనూ సేఫ్ ఫార్ములా నుంచి బయటకు వెళ్లలేదు. 'మర్యాద రామన్న', 'పరుగు', అక్షయ్ కుమార్ 'రక్షా బంధన్' ఛాయలు సినిమాలో కనపడతాయి. 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' కథ పరంగా పెద్దగా ఎగ్జైట్ చేయదు. కాన్‌ఫ్లిక్ట్ పాయింట్స్ ఎగ్జైట్ చేసేలా కాకుండా కన్వీనియంట్‌గా రాసుకోవడం మైనస్. కానీ, కామెడీ విషయంలో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఆ విషయంలో సందేహం అవసరం లేదు.
కామెడీ కంటే ఎక్కువగా టెక్నికల్ పరంగా సినిమా హై స్టాండర్డ్స్ మైంటైన్ చేసింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఫ్రేమ్ బావుంది. సినిమాటోగ్రాఫర్ బాల్ రెడ్డి లైటింగ్ నుంచి ఫ్రేమింగ్ వరకు ప్రతి అంశంలో తీసుకున్న శ్రద్ధ తెరపై కనిపించింది. నెక్స్ట్ కొరియోగ్రఫీ గురించి మాట్లాడుకోవాలి. ప్రతి పాటను అందంగా తీశారు. ప్రదీప్ డాన్సులో స్టైల్, గ్రేస్ ఉన్నాయి. బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ కుదరడంతో పాటు రధన్ అందించిన బాణీలు బావుండడంతో తెరపై పాట వచ్చిన ప్రతిసారి చిన్న స్మైలీ ఫీలింగ్ వస్తుంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
కృష్ణ పాత్రకు తగ్గట్టు ప్రదీప్ మాచిరాజు చక్కగా నటించారు. ఆయన నటనలో, డైలాగ్ డెలివరీలో వంక పెట్టడానికి ఏమీ లేదు. ఎక్కువ తక్కువ కాకుండా ఈ సన్నివేశంలో ఇంతే చేయాలి అన్నట్టు కొలత కొలిచినట్లు చేశారు. దీపిక అందంగా కనిపించారు. పాటల్లో ఇంకా బాగున్నారు. కమెడియన్లలో బ్రహ్మాజీ, సత్య, గెటప్ శ్రీను, కోదాటి పవన్ కళ్యాణ్ నవ్వించారు. సత్య - గెటప్ శ్రీను, బ్రహ్మాజీ - సత్య - కోదాటి పవన్ మధ్య సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి. ఇంటర్వెల్ ముందు కొన్ని సన్నివేశాలు, ఇంటర్వెల్ తర్వాత మరికొన్ని సన్నివేశాలు నవ్వించాయి. రోహిణి, ఝాన్సీ, మొట్ట రాజేంద్రన్, మురళీధర్ గౌడ్ తదితరులు కనిపిస్తారు. ఓ సన్నివేశంలో బ్రహ్మానందం, కొన్ని సన్నివేశాల్లో వెన్నెల కిషోర్ కనిపించారు.
రెండున్నర గంటల్లో కాసేపు హాయిగా నవ్వుకోవడం కోసం, ప్రదీప్ మాచిరాజును వెండితెరపై చూడడం కోసం 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' థియేటర్లకు హ్యాపీగా వెళ్లొచ్చు. పాటల్లో అమ్మాయి అండ్ అబ్బాయి, కామెడీలో సత్య అండ్ గెటప్ శ్రీను - బ్రహ్మాజీ ఆకట్టుకుంటారు. క్లీన్ కామెడీ కోసం ఒక లుక్ వెయ్యొచ్చు.
Also Read: 'జాక్' రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ హ్యాట్రిక్ కొట్టాడా? 'బొమ్మరిల్లు' భాస్కర్ తీసిన సినిమా హిట్టేనా?





















