Miss Perfect Web Series Review - మిస్ పర్ఫెక్ట్ రివ్యూ: క్లీనింగ్ పిచ్చితో లావణ్యకు ఎన్ని తిప్పలో - వెబ్ సిరీస్ హిట్టా? ఫట్టా?
OTT Review - Miss Perfect Web Series streaming on Disney Plus Hotstar: లావణ్య త్రిపాఠి, అభిజీత్ నటించిన వెబ్ సిరీస్ 'మిస్ పర్ఫెక్ట్'. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
విశ్వక్ ఖండేరావ్
లావణ్య త్రిపాఠి, అభిజీత్, అభిజ్ఞ, ఝాన్సీ, హర్షవర్థన్, మహేశ్ విట్టా, హర్ష్ రోషన్ తదితరులు
Disney Plus Hotstar
Lavanya Tripathi and Abhijeet's Miss Perfect web series review in Telugu: లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ 'మిస్ పర్ఫెక్ట్'. 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేమ్, 'బిగ్ బాస్ 4' విన్నర్ అభిజీత్ ఆమెకు జంటగా నటించారు. అభిజ్ఞ, హర్షవర్ధన్, ఝాన్సీ, మహేష్ విట్టా, సునైనా ఇతర ప్రధాన తారాగణం. 'స్కై ల్యాబ్' ఫేమ్ విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహించారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే...
కథ: లావణ్య రావు (లావణ్య త్రిపాఠి) స్వచ్ఛ భారత్‌కి బ్రాండ్ అంబాసిడర్ లాంటి అమ్మాయి. ఆమెకు క్లీనింగ్ అంటే చాలా ఇష్టం. కాదు.. కాదు... ఆమెకు ఓసీడీ. బాయ్ ఫ్రెండ్ ప్రపోజ్ చేస్తుంటే... స్విమ్మింగ్ పూల్ క్లీన్ చేసే రకం. దాంతో అతడు బ్రేకప్ చెప్పి వెళ్లిపోయాడు. ఆ టైంలో ప్రమోషన్ వస్తే హైదరాబాద్ షిఫ్ట్ అవుతుంది. ఆమె ఫ్లాట్‌లో వంట చేయడానికి పని అమ్మాయి జ్యోతి (అభిజ్ఞ) వస్తుంది. లావణ్య గేటెడ్ కమ్యూనిటీలో రోహిత్ (అభిజీత్) ఫ్లాట్‌లో కూడా జ్యోతి పని చేస్తుంటుంది. కరోనా, క్వారంటైన్ కారణంగా తాను పనికి రాలేనని చెబుతుంది. ఆ విషయం రోహిత్‌కు చెప్పమని రిక్వెస్ట్ చేస్తుంది.
ఫ్లాట్‌కు వచ్చిన లావణ్యను చూసి పని మనిషి అని, జ్యోతి మరొకర్ని పంపిందని భావిస్తాడు రోహిత్. లావణ్య అసలు విషయం చెబుదామని అనుకున్నా... ఫ్లాట్ అంతా చిందరవందరగా ఉండటం చూసి క్లీన్ చేస్తుంది. ప్రతి రోజూ ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతూ వస్తుంది. తన పేరు లక్ష్మి అని చెబుతుంది. లక్ష్మీ అలియాస్ లావణ్యను చూసి రోహిత్ ప్రేమలో పడతాడు. ఆమె కోసం జ్యోతిని పనిలోంచి తీసేస్తాడు. అతడికి కుకింగ్ అంటే ఇష్టం. ప్రతి రోజూ లక్ష్మికి ఇష్టమైనవి వండి పెడుతూ ఉంటాడు. తన ఇంటికి పని మనిషిగా వచ్చేది లక్ష్మి కాదని, లావణ్య అని రోహిత్ తెలుసుకున్నాడా? లేదా? ఆమెకు తన ప్రేమ విషయం చెప్పాడా? లేదా? రోహిత్ మీద లావణ్య అభిప్రాయం ఏంటి? అతనికి తన అసలు పేరు ఎందుకు చెప్పలేదు? చివరికి ఏమైంది? అనేది వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ: 'మిస్ పర్ఫెక్ట్' కాన్సెప్ట్ గురించి క్లుప్తంగా చెప్పాలంటే... తాను ప్రేమించిన అమ్మాయి పని మనిషి కాదని, పెద్ద ఉద్యోగం చేస్తుందని అని తెలిశాక అబ్బాయి ఏం చేశాడు? ఎలా రియాక్ట్ అయ్యాడు? అనేది సిరీస్. ఆ అమ్మాయికి ఓసీడీ అంటూ షుగర్ కోటింగ్ ఇచ్చారు. ఈ తరహా కథల్లో సిట్యువేషనల్ కామెడీ ఎంత బాగా వర్కవుట్ అయితే చూసే జనాలు అంత ఎంజాయ్ చేస్తారు. మరి, 'మిస్ పర్ఫెక్ట్'లో కామెడీ అలా కుదిరిందా? అంటే 'లేదు' అని చెప్పాలి.
తెలుగు ప్రేక్షకులకు ఓసీడీ కథ కొత్త కాదు. 'మహానుభావుడు' చూశారు. అందులో హీరో క్యారెక్టరైజేషన్, సీన్లు చూసి థ్రిల్ ఫీలయ్యారు. నవ్వుకున్నారు. 'మిస్ పర్ఫెక్ట్' సిరీస్ మొత్తం మీద అలా ఎంజాయ్ చేసే సీన్ ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. ఏదో ఒక రోజు లావణ్య గురించి నిజం తెలుస్తుందని ప్రేక్షకుడికి తెలుసు. తెలిసిన రోజు ఏం జరుగుతుంది? అనేది క్యూరియాసిటీ పాయింట్. దాని కోసం చివరి ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాలి. అప్పటి వరకు కామెడీతో సిరీస్ లాగించడంలో దర్శక రచయితలు సక్సెస్ కాలేదు. మధ్యలో ఓల్డ్ ఏజ్ లవ్ ట్రాక్ అంత కన్విన్సింగ్‌గా లేదు.
లావణ్య క్యారెక్టరైజేషన్ బాగా డిజైన్ చేశారు. అయితే, అందుకు తగ్గ సన్నివేశాలు రాసుకోలేదు. ఆ క్యారెక్టరైజేషన్ పట్టుకుని మాంచి కామెడీ సీన్లు రాసుంటే లేడీ 'మహానుభావుడు' అయ్యేది. సింగర్ కావాలని ఇంట్లో నుంచి హైదరాబాద్ వచ్చిన పని మనిషి క్యారెక్టర్ గానీ, మీమర్ కావాలని అతని తమ్ముడు చేసే ప్రయత్నం గానీ నవ్వించలేదు. రైటింగ్ ఫెయిల్యూర్ వల్ల ఏదీ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. ఫోర్స్డ్ ఎమోషన్స్ అంతా!
'మిస్ పర్ఫెక్ట్'లో పర్ఫెక్షన్ కోసం ప్రయత్నించిన క్రెడిట్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ ఆర్ విహారికి దక్కుతుంది. సిరీస్ అని లైట్ తీసుకోకుండా మంచి మెలోడీ పాటలు కంపోజ్ చేశారు. నేపథ్య సంగీతం కూడా బావుంది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ ఓకే. 'మిస్ పర్ఫెక్ట్'లో హీరో హీరోయిన్లు అభిజీత్, లావణ్య త్రిపాఠి సైతం పర్ఫెక్షన్ కోసం ప్రయత్నించారు. తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇద్దరి స్టైలింగ్ బావుంది. హర్షవర్ధన్, ఝాన్సీ క్యారెక్టర్లు పరిమితమే. అభిజ్ఞ, మహేష్ విట్టాతో పాటు మిగతా నటీనటులు తమ పరిధి మేరకు చేశారు.
కథ కథనాల్లో, కామెడీలో, నెక్స్ట్ ఏంటి? అని క్యూరియాసిటీ క్రియేట్ చేయడంలో 'మిస్ పర్ఫెక్ట్' వెబ్ సిరీస్ 'పర్ఫెక్షన్' అనే పదానికి దూరంలో ఉంది. సిరీస్ కంటే ట్రైలర్ చాలా బావుంది. లావణ్య త్రిపాఠి, అభిజీత్ అభిమానులకు నచ్చుతుంది ఏమో!? కాంటెక్స్ట్ అర్థం కాకుండా క్లాప్స్ కొట్టే ఓపిక ఉన్నవాళ్లకు కూడా!!