News
News
X

Sardar Movie Review: సర్దార్ రివ్యూ: బాటిల్ నీళ్లు తాగాలంటే భయపెట్టే సినిమా - కార్తీకి హ్యాట్రిక్ ఇచ్చిందా?

తెలుగు వారికి ఎంతో చేరువైన తమిళ హీరో కార్తీ హీరోగా నటించిన ‘సర్దార్’ సినిమా ఎలా ఉందంటే?

FOLLOW US: 

సినిమా రివ్యూ : సర్దార్
రేటింగ్ : 3.25/5
నటీనటులు : కార్తీ, రాశీ ఖన్నా, రజీషా విజయన్, చుంకీ పాండే, లైలా తదితరులు
ఛాయాగ్రహణం : జార్జ్ సి.విలియమ్స్
సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్
నిర్మాత : ఎస్.లక్ష్మణ్ కుమార్
రచన, దర్శకత్వం : పీఎస్ మిత్రన్
విడుదల తేదీ: అక్టోబర్ 21, 2022

కార్తీ లేటెస్ట్ స్పై థ్రిల్లర్ ‘సర్దార్’ శుక్రవారం థియేటర్లలో విడుదల అయింది. 20 రోజుల క్రితమే ‘పొన్నియిన్ సెల్వన్: 1’తో హిస్టారికల్ బ్లాక్‌బస్టర్ అందుకున్న కార్తీ ఈసారి స్పై థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ట్రైలర్ అద్భుతంగా కట్ చేయడంతో ప్రేక్షకులకు అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. తమిళంలో ‘విరుమన్’, ‘పొన్నియిన్ సెల్వన్: 1’లతో హిట్ కొట్టిన కార్తీ ‘సర్దార్’ కూడా హిట్ అయితే హ్యాట్రిక్ కొట్టనున్నాడు. ‘అభిమన్యుడు’ లాంటి సూపర్ సైబర్ థ్రిల్లర్‌ను అందించిన పీఎస్ మిత్రన్ ఈ సినిమాకు దర్శకత్వం అందించాడు. మరి కార్తీ కోరుకున్న హ్యాట్రిక్ తనకు దక్కిందా?

కథ: విజయ్ ప్రకాష్ (కార్తీ) ఒక పోలీస్ ఇన్‌స్పెక్టర్. తన చిన్నప్పటి నుంచి తండ్రి (మరో కార్తీ) దేశద్రోహి అని సమాజం మొత్తం తనను వేధిస్తూ ఉంటుంది. దీంతో తనను తాను మంచివాడిగా ప్రూవ్ చేసుకోవాలని ప్రతి చిన్న పనిని పబ్లిసిటీ చేసుకుంటూ ‘Face of AP Police’గా మారతాడు. మరోవైపు భారతదేశం మొత్తం పైప్ లైన్ ద్వారా నీళ్లు సప్లై చేయాలనే ఒయాసిస్ వాటర్ టెక్నాలజీస్ అనే ప్రైవేటు కంపెనీ ‘వన్ కంట్రీ వన్ పైప్‌లైన్’ అనే ప్రాజెక్టును తలపెడుతుంది. దీన్ని ఆపాలని ఒక సోషల్ యాక్టివిస్టు (లైలా) ప్రయత్నిస్తారు. కానీ సడెన్‌గా ఒకరోజు ఆవిడ చనిపోతారు. తను ఒక దేశద్రోహి అని తెలుస్తుంది. దీంతో తన కొడుకు (రిత్విక్) అనాథ అవుతాడు. ఈ కేసును ఎలాగైనా ఛేదించాలని విజయ్ ప్రకాష్ డిసైడ్ అవుతాడు. అసలు ఒయాసిస్ కంపెనీ వెనక ఎవరున్నారు? దేశద్రోహి అని ముద్రపడ్డ గూఢచారి సర్దార్ ఎవరు? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: ఒక్కో దర్శకుడికి ఒక్కో బలం ఉంటుంది. రాజమౌళి బలం ఎమోషన్, శంకర్ బలం గ్రాండియర్, రాజ్‌కుమార్ హిరాణీ బలం ఎంత బలమైన విషయాన్ని అయినా అందరికీ అర్థం అయ్యేలా నవ్వించే విధంగా చెప్పగలగడం. అలాగే సర్దార్ డైరెక్టర్ పీఎస్ మిత్రన్‌కు కూడా ఒక బలం ఉంది. అదే డిటైలింగ్. తను చెప్పాలనుకున్న అంశం గురించి పైపైన మాత్రమే చర్చించి వదిలేయకుండా కూలంకషంగా అర్థం అయ్యేలా చెప్పడం మిత్రన్ స్పెషాలిటీ. టెక్నాలజీపై అభిమన్యుడు, విద్యావ్యవస్థపై హీరో (తెలుగులో శక్తి) లాంటి సినిమాలు తీసిన మిత్రన్ ఈసారి పంచభూతాల్లో ఒకటైన నీటిని కథావస్తువుగా ఎంచుకున్నాడు. అలా అని నీటి కాలుష్యం, ఫ్యాక్టరీల జోలికి పోకుండా నీటి అమ్మకంపై కాన్సన్‌ట్రేట్ చేశాడు. ఒకప్పుడు ఉచితంగా లభించే నీరు ఇప్పుడు కొనుక్కుని తాగుతున్నాం. ఏ నీటినైనా భయం లేకుండా తాగే పరిస్థితి నుంచి కేవలం మినరల్ వాటర్ మాత్రమే తాగే రోజులకు వచ్చేశాం. ఇలాంటి భయపెట్టే నిజాలను ఈ సినిమాలో టచ్ చేశాడు. అభిమన్యుడు చూశాక చాలా మంది స్మార్ట్ ఫోన్ వాడాలంటేనే భయపడ్డారు. అలాగే ఈ సినిమా చూశాక బాటిల్లోని నీరు తాగాలంటే ఆలోచిస్తారు.

News Reels

నీటి అమ్మకం కాన్సెప్ట్‌కు గూఢచారి నేపథ్యాన్ని జోడించి సినిమాను అత్యంత ఆసక్తికరంగా మలిచాడు. ‘400 గ్రామాలకు నీరు అందించే చెరువులో విషం కలుస్తుందని పుకారు సృష్టించాం. వాళ్లు ఆ చెరువు నీళ్లు తాగుతారా? అదే నీళ్లను బాటిల్‌లో పెట్టి మూత వేస్తే డబ్బులిచ్చి మరీ కొనుక్కుంటారు.’ లాంటి డైలాగ్స్ ప్రస్తుత పరిస్థితికి అద్దం పడతాయి.

కార్తీ పబ్లిసిటీ కోసం చేసే చిన్న చిన్న పనులను ఫన్నీగా చూపించడంతో సినిమా ప్రారంభం అవుతుంది. సర్దార్ కోసం వేట, నీటి కంపెనీలపై లైలా పోరాటం, కార్తీ ట్రాక్‌లు మూడు కాసేపు సమాంతరంగా సాగుతాయి. అంతవరకు సినిమా టైమ్‌పాస్‌గానే సాగుతాయి. సర్దార్ వేటకు లైలా పోరాటం తోడైనప్పటి నుంచి కథ సీరియస్‌గా మారుతుంది. ఇక లైలా క్యారెక్టర్ మరణం కార్తీ దగ్గరకి వచ్చినప్పటి నుంచి సినిమా రేసీగా సాగుతుంది. దేశద్రోహిగా ముద్రపడ్డ లైలా కొడుకులో కార్తీ తనను చూసుకునే సన్నివేశాలు ఎమోషనల్‌గా సాగుతాయి. ఇంటర్వెల్ ముందు సర్దార్ పాత్ర ఇంట్రడక్షన్ ఫైట్ సినిమా గ్రాఫ్‌ను అమాంతం పైకి తీసుకెళ్తుంది.

సెకండాఫ్‌లో సర్దార్ పాత్ర ఫ్లాష్‌బ్యాక్‌లో కొన్ని సీన్లు, పాటలు  కథాగమనానికి అడ్డుపడతాయి. కానీ ఫ్లాష్‌బ్యాక్ అయ్యాక సినిమా మళ్లీ ఊపందుకుంటుంది. సర్దార్ తిరిగి దేశంలో అడుగుపెట్టడం, తన అసలు శత్రువు ఎవరో తెలుసుకునే సన్నివేశాలు రేసీగా సాగుతాయి. అక్కడి నుంచి సినిమా పూర్తిగా యాక్షన్ ట్రాక్ తీసుకుంటుంది. యాక్షన్ సీన్లలో కూడా పీఎస్ మిత్రన్ మార్కు డిటైలింగ్ కనిపిస్తుంది. సినిమాలో ఎక్కడో ఒక చోట చెప్పిన గుర్తు కూడా ఉండని డైలాగ్‌ను క్లైమ్యాక్స్‌కు కనెక్ట్ చేయడం హైలెట్.

జీవీ ప్రకాష్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. యాక్షన్, ఎమోషనల్ సీన్లను జీవీ నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లాడు. రూబెన్ ఎడిటింగ్ కాస్త షార్ప్‌గా ఉండాల్సింది. ఫ్లాష్‌బ్యాక్‌లో కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేయవచ్చు. జార్జ్ సి.విలియమ్స్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. ప్రిన్స్ పిక్చర్స్ ఈ సినిమాను ఖర్చుకు వెనకాడకుండా తెరకెక్కించిందని విజువల్స్ చూసి చెప్పవచ్చు.

Also Read : జిన్నా రివ్యూ: మంచు విష్ణు జిన్నా ప్రేక్షకులను అలరించిందా?

ఇక నటీనటుల విషయానికి వస్తే... కార్తీకి సర్దార్ పాత్ర నిజంగా ఒక ఛాలెంజ్ లాంటిది. ఇందులో కార్తీ చాలా గెటప్స్‌లో కనిపించారు. అన్ని గెటప్స్‌కు మేకప్ కోసం సమయం కేటాయించడమే చాలా కష్టం. వయసు అయిపోయిన సర్దార్ పాత్రలో అయితే కార్తీ జీవించారు. హీరోయిన్లు ఇద్దరు పాత్రలకు కథలో పెద్దగా స్కోప్ లేదు. నెగిటివ్ షేడ్‌లో కనిపించిన చుంకీ పాండే విలనిజాన్ని బాగా చూపించారు. మిగతా పాత్రలు పోషించిన వారు తమ పాత్రలకు న్యాయం చేశారు.

ఓవరాల్‌గా చెప్పాలంటే... యాక్షన్ థ్రిల్లర్, స్పై జోనర్ సినిమాలను ఇష్టపడేవారు కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. కానీ ఈ సినిమా చూశాక బాటిల్ నీళ్లు తాగాలంటే కచ్చితంగా భయపెడతారు.

Also Read : 'అమ్ము' రివ్యూ : చిత్రహింసలు పెట్టే, కొట్టే భర్తను భార్య భరించాల్సిందేనా? ఐశ్వర్య లక్ష్మీ సినిమా ఎలా ఉందంటే?

Published at : 21 Oct 2022 03:26 PM (IST) Tags: Karthi Raashii Khanna Rajisha Vijayan ABPDesamReview Sardar Movie Review Sardar Movie Rating Karthi New movie

సంబంధిత కథనాలు

Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేస్తున్న దర్శకుడు - 'గబ్బర్ సింగ్'కు ముందు సీన్ రిపీట్!?

Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేస్తున్న దర్శకుడు - 'గబ్బర్ సింగ్'కు ముందు సీన్ రిపీట్!?

Panchathantram Trailer : బ్రహ్మానందం థీమ్ పంచేంద్రియాలు - వీల్ ఛైర్‌లో స్వాతి

Panchathantram Trailer : బ్రహ్మానందం థీమ్ పంచేంద్రియాలు - వీల్ ఛైర్‌లో స్వాతి

Gurtunda Seetakalam : తమన్నాతో సత్యదేవ్ సినిమా గుర్తుందిగా? విడుదలకు రెడీ!

Gurtunda Seetakalam : తమన్నాతో సత్యదేవ్ సినిమా గుర్తుందిగా? విడుదలకు రెడీ!

Avatar 2 Advance Bookings : హాట్ కేకుల్లా 'అవతార్ 2' టికెట్స్ - మూడు రోజుల్లో హాంఫట్!

Avatar 2 Advance Bookings : హాట్ కేకుల్లా 'అవతార్ 2' టికెట్స్ - మూడు రోజుల్లో హాంఫట్!

Samantha Health Update : సమంత బాడీకి ఆయుర్వేదమే మంచిదా - ఇప్పుడు హెల్త్ ఎలా ఉందంటే?

Samantha Health Update : సమంత బాడీకి ఆయుర్వేదమే మంచిదా - ఇప్పుడు హెల్త్ ఎలా ఉందంటే?

టాప్ స్టోరీస్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి

Manjima Mohan Pre Wedding Pics: హీరో హీరోయిన్ల ప్రీ వెడ్డింగ్ ఫొటోలు ట్రెండింగ్ , మీరు ఓ లుక్కేయండి

Manjima Mohan Pre Wedding Pics: హీరో హీరోయిన్ల ప్రీ వెడ్డింగ్ ఫొటోలు ట్రెండింగ్ , మీరు ఓ లుక్కేయండి