Cadaver Review - కడవర్ రివ్యూ : డెడ్ బాడీ చెప్పిన కథ, అమలా పాల్ సినిమా ఎలా ఉందంటే?
OTT Review - Cadaver Movie : అమలా పాల్ ప్రధాన పాత్రలో నటించడంతో పాటు స్వయంగా నిర్మించిన 'కడవర్' సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో విడుదలైంది.
అనూప్ ఎస్. పానికర్
అమలా పాల్, హరీష్ ఉత్తమన్, త్రిగుణ్, అతుల్యా రవి తదితరులు
సినిమా రివ్యూ : కడవర్
రేటింగ్ : 2.75/5
నటీనటులు : అమలా పాల్, హరీష్ ఉత్తమన్, త్రిగుణ్, అతుల్యా రవి, వినోద్ సాగర్, రిత్వికా పన్నీర్ సెల్వం, మునీష్ కాంత్ తదితరులు
రచన : అభిలాష్ పెళ్ళై
సినిమాటోగ్రఫీ: అరవింద్ సింగ్
సంగీతం : రంజిన్ రాజ్
నిర్మాత : అమలా పాల్
దర్శకత్వం: అనూప్ ఎస్. పానికర్
విడుదల తేదీ: ఆగస్టు 12, 2022
ఓటీటీ వేదిక : డిస్నీ ప్లస్ హాట్ స్టార్
'కడవర్' (Cadaver Movie) సినిమాతో నిర్మాతలుగా మారిన కథానాయికల జాబితాలో అమలా పాల్ (Amala Paul) చేరారు. ఆమె ప్రధాన పాత్రలో నటించడంతో పాటు నిర్మించిన చిత్రమిది. తమిళంలో తెరకెక్కించారు. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో అనువదించారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ వేదికలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది? (Cadaver Review Telugu)
కథ (Cadaver Story) : హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హాస్పిటల్ అధిపతి సలీం రెహమాన్ (రవిప్రకాష్) కనిపించడం లేదని ఆయన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. రెండు రోజుల తర్వాత నగర శివార్లలో పూర్తిగా కాలిపోయిన కారులో, ఆ మంటల్లో ఆహుతైన మృతదేహం లభిస్తుంది. అది సలీమ్ రెహమాన్‌ది అని తెలుస్తుంది. జైలులోని వాసు (త్రిగుణ్ అలియాస్ అరుణ్ అదిత్) గదిలో ఆయన బొమ్మ గీసి ఉంటుంది.
సలీంను హత్య చేసింది తానేనని వాసు అంగీకరిస్తాడు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్‌లో క్రిమినాలజీ చేసిన పోలీస్ సర్జన్ అండ్ పాథాలజిస్ట్ భద్ర (అమలా పాల్) సహాయం తీసుకోమని ఏసీపీ విశాల్ (హరీష్ ఉత్తమన్) కు ఉన్నతాధికారులు చెబుతారు. అప్పుడు ఆమె ఏం చేసింది? జైలులో ఉన్న వాసు హత్య ఎలా చేశాడు? లేదంటే అతనికి ఎవరైనా సహాయం చేశారా? అతని జీవితంలో ఏంజెల్ (అతుల్యా రవి) ఎవరు? వాసు, ఏంజెల్‌కు... సలీం రెహమాన్‌కు సంబంధం ఏమిటి? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ (Cadaver Movie Review In Telugu) : ఇదొక ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. కథగా చూస్తే... ఇందులో పగ, ప్రతీకారం, చట్టం పరిధి దాటి ఒక మహిళ చేసిన న్యాయం వంటివి ఉన్నాయి. అయితే... సినిమా ప్రారంభంలో అటువంటి భావన రాకుండా కథను ముందుకు నడిపారు.
మార్చురీలో శవాలను ఒక మహిళ ఎగ్జామిన్ చేసి రిపోర్ట్ ఇవ్వగలదా? ధైర్యంగా పరిశోధన చేయగలదా? అనే సందేహాలను వీక్షకుడిలో రానివ్వలేదు దర్శకుడు. మార్చురీలోకి వెళ్లిన పోలీస్ ఇబ్బంది పడుతూ ముక్కు మూసుకుంటే... హ్యాపీగా బాక్స్‌లో ఫుడ్ తింటున్న పాథాలజిస్ట్‌గా అమలా పాల్‌ను పరిచయం చేసి కథలోకి వెళ్లారు దర్శకుడు. ఆ తర్వాత కూడా ఎక్కువ సమయం తీసుకోలేదు. హత్య, జైల్లో గోడపై హత్యకు గురైన వ్యక్తి బొమ్మ చూపిస్తూ ఆసక్తి కలిగించారు. అతనికి బొమ్మలు గీయడం వచ్చా? వంటి సందేహం అవసరం లేదు. దానికో లాజిక్ చూపించారు.
'కడవర్' నిడివి తక్కువే. రెండు గంటల్లో సినిమా పూర్తయ్యింది. తొలి గంటలో కథ కంటే కథనంపై ఎక్కువ దృష్టి పెట్టారు. వీక్షకుడి ఊహకు ప్రశ్నలు వదులుతూ వెళ్లారు. సినిమా మధ్యలో మేజర్ ట్విస్ట్ రివీల్ అయ్యాక... ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన సందర్భాలు వచ్చాయి. అప్పుడు థ్రిల్స్ కంటే డ్రామా ఎక్కువైంది ఎమోషన్స్‌ది అప్పర్ హ్యాండ్ కావడంతో కథ కాస్త నిదానంగా ముందుకు వెళ్ళింది. స్టార్టింగులో త్రిగుణ్, అతుల్యా రవి మధ్య సీన్స్ చిన్న చిన్న బ్రేకులు వేసినా... త్వరగా ముగించడంతో పెద్ద ఇబ్బంది కాలేదు. అమలా పాల్ - అతుల్యా రవి, అమలా పాల్ - విద్యాసాగర్ ఫ్లాష్‌బ్యాక్ సీన్స్ ఉత్కంఠగా వెళుతున్న కథకు పెద్ద బ్రేకులు వేశాయి. ఆ సీన్స్ క్రిస్పీగా రాసుకుని, సినిమా చూసే వాళ్ళకు ఉత్కంఠ కలిగించే విధంగా తెరకెక్కిస్తే బావుండేది. సినిమా నెక్స్ట్ లెవల్‌కు వెళ్ళేది.
సినిమాటోగ్రఫీ, సంగీతం, ఆర్ట్ వర్క్... టెక్నికల్‌గా 'కడవర్' డీసెంట్ ఫిల్మ్ అని చెప్పాలి. నిర్మాతగా అమలా పాల్ మంచి కథ ఎంపిక చేసుకున్నారు. కథకు ఎంత అవసరమో... అంత ఖర్చు చేశారు.
నటీనటులు ఎలా చేశారు? : అమలా పాల్ కొత్తగా కనిపించారు. హెయిర్ స్టైల్, ఆమె డ్రస్సింగ్ నుంచి యాక్టింగ్ వరకూ... ప్రతిదీ కొత్తగా ఉంది. గ్లామర్ రోల్స్‌కు మాత్రమే పరిమితం కాకుండా యాక్టింగ్‌కు ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ చేయడానికి ఆమె ఆసక్తిగా ఉన్నారని చెప్పడానికి 'కడవర్' మరొక ఉదాహరణ. వాసు పాత్రకు త్రిగుణ్ న్యాయం చేశాడు. అతనికి జోడీగా అతుల్యా రవి కనిపించారు. పోలీస్ పాత్రకు హరీష్ ఉత్తమన్ సూట్ అయ్యారు. మిగతా పాత్రధారులు తమ తమ పరిధి మేరకు చక్కటి నటన కనబరిచారు.
Also Read : మాలిక్ రివ్యూ: ఫహాద్ ఫాజిల్ గ్యాంగ్‌స్టర్ థ్రిల్లర్ ఆకట్టుకుంటుందా?
ఓవరాల్‌గా చెప్పేది ఏంటంటే? : 'కడవర్' అంటే శవం (డెడ్ బాడీ). మరణించిన మనిషి శరీరం సహాయంతో హంతుకులను పట్టుకోవచ్చనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. సినిమా స్టార్టింగ్ బావుంది. అయితే... ఊహాజనిత సన్నివేశాలు, క్లైమాక్స్ కొంత థ్రిల్ తగ్గించాయి. కాస్త రొటీన్ అనిపించాయి. అయినప్పటికీ... డెడ్ బాడీలను ఎగ్జామిన్ చేసే పాథాలజిస్ట్ క్యారెక్టర్ బేస్ చేసుకుని కథ చెప్పాలనే ఆలోచన బావుంది. నటిగా, నిర్మాతగా అమలా పాల్ బెస్ట్ ఇచ్చారు. కొత్తదనం కోరుకునే, థ్రిల్లర్స్ ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చుతుంది.
Also Read : లాల్ సింగ్ చడ్డా రివ్యూ : ఆమిర్ సినిమా ఎలా ఉంది? హిందీలో నాగ చైతన్యకు గ్రాండ్ ఎంట్రీ లభిస్తుందా? లేదా?