Sprouts: ఈ ఐదు మొలకెత్తిన గింజలు తింటే ఆరోగ్యమే కాదు బరువు తగ్గుతారు
మొలకెత్తిన గింజలు తినడానికి అందరూ ఇష్టపడతారు. ఇవి ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి.
బరువు తగ్గాలని అనుకునే వాళ్ళు ఎక్కువగా ఎంచుకునే ఆహార పదార్థం మొలకెత్తిన గింజలు. ఎన్నో పోషకాలు నిండిన వీటిని తీసుకుంటే శరీరానికి చాలా ప్రోటీన్స్ అందుతాయి. ఇందులో ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కాయధాన్యాలు రాత్రంతా నానబెట్టి ఒక తడి వస్త్రంలో మూతి కట్టి ఉంచితే మొలకలు వస్తాయి. ఇవి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. మొలకెత్తిన గింజల్లో ప్రోటీన్ 20-30 శాతం పెరుగుతుంది. మొలకెత్తిన గింజలు బయట మార్కెట్లో కూడా అందుబాటులో ఉంటాయి. శనగలు, మూంగ్ దాల్, బీన్స్, కిడ్నీ బీన్స్ విత్తనాలు ఎక్కువగా మొలకెత్తిన గింజలుగా తింటారు. కానీ వీటితో పాటు మన వంట గదిలో దొరికే ఈ పప్పులు కూడా తినేందుకు చాలా బాగుంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇటువంటి మొలకెత్తిన గింజలు తాజాగా మనం ఇంట్లో చేసుకుని తినాలి. మార్కెట్లో నిల్వ ఉన్నవి తింటే లేనిపోని అనారోగ్యాలు తెచ్చుకున్నట్టు అవుతుంది.
అలసందలు
భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో లోబయియా, రోగి, చావ్లీ అని కూడా వీటిని పిలుస్తారు. సూపర్ రిచ్ ప్రోటీన్ కంటెంట్ ఫుడ్ ఇది. ఈ బీన్స్ ని కౌపీస్ అని కూడా పిలుస్తారు. ఐరన్, పోలేట్ సమృద్ధిగా ఉంటాయి. ఒక కప్పు ఉడికించిన అలసందలలో 13 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. ఇది మొలకెత్తినప్పుడు ప్రోటీన్ కంటెంట్ 15-16 గ్రాముల వరకి పెరుగుతుంది.
మట్కీ పప్పు
భారతదేశంలోని కొండ ప్రాంతాలు, మహారాష్ట్రలో ప్రసిద్ధి చెందిన ఈ బీన్స్ ని మట్కీ దాల్ అని పిలుస్తారు. ఈ పప్పులో ప్రోటీన్ కంటెంట్ చాలా సమృద్ధిగా ఉంటుంది. నెమ్మదిగా జీర్ణం అయ్యే ఆహారం ఇది. కేవలం 100 గ్రాముల మోత్ బీన్స్ లో దాదాపు 22 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. వీటిని మొలకెత్తించినప్పుడు అందులో ప్రోటీన్లు 25-26 గ్రాముల వరకి వస్తాయి. ఈ బీన్స్ రాత్రంతా నానబెట్టి మొలకెత్తించిన తర్వాత తాజాగా ఉన్నప్పుడే తినాలి. లేదంటే దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
పెసరపప్పు
మొలకెత్తించే కాయధాన్యంగా ఇది ప్రసిద్ధి చెందింది. ఫైబర్, ప్రోటీన్ మెండుగా ఉంటాయి. కేవలం 100 గ్రాముల మొలకెత్తిన మూంగ్ దాల్ లో దాదాపు 3.5 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అలాగే ఇందులో ఉండే క్రియారహిత ఎంజైమ్ లు కూడా ఇవి మొలకెత్తిన తర్వాత యాక్టివ్ గా ఉంటాయి. ఇది సులభంగా జీర్ణమై శరీరంలో శోషించబడుతుంది.
శనగలు
మొలకలుగా ఉపయోగపడే మరొక ప్రసిద్ధమైన పప్పు శనగలు. ఒక కప్పు శనగల్లో 36 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. రుతు సమస్యలు ఉన్న మహిళలకి ఇది చాలా మంచిది.
సోయాబీన్
జపాన్, కొరియా, చైనా వంటి ఇతర ఆసియా దేశాల్లో దీన్ని మొలకెత్తిన గింజలుగా అనేక ప్రయోజనాల కోసం వినియోగిస్తారు. ఉడికించిన దాని కంటే పచ్చిగా తినడానికి చాలా మంది ఇష్టపడతారు. ఒక కప్పు మొలకెత్తిన సోయాబీన్స్ లో 9 గ్రాముల ప్రోటీన్ పొందవచ్చు. ఐరన్ లోపం ఉన్నపుడు ఈ బీన్స్ తింటే దాన్ని అధిగమించవచ్చు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also read: అనారోగ్యంగా ఉన్నప్పుడు జిమ్‌కు వెళ్తున్నారా? గుండె పోటు ప్రమాదం పొంచి ఉండొచ్చు