Heart attack: మహిళల్లో పెరుగుతున్న గుండెపోటు కేసులు, కారణాలు ఇవే
గుండెపోటు బారిన పడుతున్న మహిళల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ, ఏటా పెరుగుతూ వస్తోంది.
ఒకప్పటి పరిస్థితి వేరు, యాభై ఏళ్లు నిండితే గాని ఎవరికీ గుండె సమస్యలు రావు అనే ధీమా ఉండేది. ఆధునిక కాలంలో మాత్రం 20 ఏళ్లకే గుండెపోటు బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. సాధారణంగా గుండెపోటు వచ్చే అవకాశం పురుషులకే ఎక్కువ, కానీ ఇప్పుడు మహిళల్లో కూడా గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. కరోనా అనంతరం గుండెపోటు బారిన పడుతున్న మహిళల సంఖ్య 35 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ నటి సుస్మితసేన్ తనకు గుండెపోటు వచ్చిందని చెప్పింది. అలాగే కన్నడ నటుడు విజయరాఘవేంద్ర సతీమణి స్పందన కూడా గుండెపోటుతోనే మరణించింది. వీళ్లిద్దరు వయసు యాభై ఏళ్ల లోపే. దీన్నిబట్టి మహిళలు కూడా గుండెపోటు విషయంలో అలసత్వం చూపించరాదని తెలుస్తోంది.
సాధారణంగా గుండెపోటుకు ముందు వచ్చే లక్షణం ఛాతీలో నొప్పి రావడం, ఛాతీ బిగుతుగా ఊపిరాడనట్లు కావడం జరుగుతుంది. కానీ ఒక్కోసారి ఎలాంటి లక్షణాలు కనబడకుండానే గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చిన్న చిన్న అసౌకర్యాలు ఉన్నా కూడా అలసత్వం వహించకుండా జాగ్రత్త పడటం చాలా ముఖ్యం. మెడ, దవడ, భుజాలు, ఛాతీ భాగంలో నొప్పిగా, అసౌకర్యంగా అనిపిస్తే తేలిగ్గా తీసుకోకూడదు. అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నా, ఒక చెయ్యి లేదు రెండు చేతులు నొప్పిగా అనిపిస్తున్నా, వికారంగా వాంతులు వస్తున్నట్టు అనిపించినా, ఎలాంటి కారణం లేకుండా చెమటలు పట్టినా, విపరీతమైన అలసట, నీరసం అనిపిస్తున్నా, గుండెల్లో మంట ఉన్నా, ఆహారం అరగకపోయినా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ కూడా గుండెపోటు లక్షణాలు గానే చెబుతున్నారు వైద్యనిపుణులు.
మధుమేహం ఉన్న మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మధుమేహం ఉన్న మహిళలకు సాధారణ మహిళలతో పోలిస్తే గుండెపోటు వచ్చే ముప్పు 50% ఎక్కువ అని పరిశోధనలు చెబుతున్నాయి. అలాగే ఎలాంటి లక్షణాలు లేకుండానే సైలెంట్ గా హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఒత్తిడి, ఆందోళన బారిన పడుతున్న మహిళలపై కూడా గుండెపోటు ప్రభావం అధికంగానే ఉంటుంది. శారీరక శ్రమ చేయకుండా, వ్యాయామాలు చేయకుండా ఎక్కువసేపు ఒకే చోట కూర్చుంటున్న వారిలో కూడా గుండె సమస్యలు రావచ్చు. అలాగే మెనోపాజ్ వచ్చిన మహిళల్లో కూడా ఈస్ట్రోజన్ స్థాయిలు తగ్గిపోయి గుండెపోటు వచ్చే ముప్పు పెరుగుతుందని వివరిస్తున్నారు వైద్య నిపుణులు. గర్భంతో ఉన్నప్పుడు హై బీపీ, మధుమేహం వంటి సమస్యలు ఉంటే దీర్ఘకాలంలో భవిష్యత్తులో గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. ఊబకాయంతో ఉన్నవారు, అధిక కొలెస్ట్రాల్ కలిగిన వారు కూడా, గుండెపోటు బారిన త్వరగా పడతారు. కాబట్టి బరువును అదుపులో ఉంచుకొని శారీరక వ్యాయామాలు రోజూ చేస్తూ ఉండాలి. తేలికపాటి ఆహారాన్ని తినాలి. ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గించుకోవాలి. ధూమపానం, మద్యపానం వంటివి మానేయాలి.
Also read: పాదాల వాపును తేలిగ్గా తీసుకోకండి, ఆ సమస్యలకు సంకేతం కావచ్చు
Also read: గర్భిణులు గ్రీన్ టీ తాగవచ్చా? తాగితే ఏమవుతుంది?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.