Coriander Aloo With Puri : కొత్తిమీర ఆలూ.. క్రిస్పీ పూరీలు.. కలిపి తింటే ఉంటాది.. నోరూరించే రెసిపీలు ఇవే
Dhaniya Aloo Curry With Crispy Puri : టేస్టీ ఫుడ్ తినాలనే క్రేవింగ్స్ ప్రతి ఒక్కరికీ ఉంటాయి. అలాంటప్పుడూ ఇంట్లోనే కొన్ని రకాల వెరైటీలు ట్రై చేయవచ్చు. అలాంటి రెసిపీనే కొత్తిమీర ఆలూ.. క్రిస్పీ పూరీ.
Tasty South Indian Breakfast : ఉదయాన్నే టేస్టీగా తినాలనిపించినప్పుడు చక్కగా ఇంట్లో తయారు చేసుకోగలిగే రెసిపీలు చాలా ఉన్నాయి. పైగా వాటిని చేసుకునేందుకు ఎక్కువ సమయం కూడా పట్టదు. రుచిలోనూ.. హెల్త్ విషయంలోనూ మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. పైగా కొన్ని కాంబినేషన్స్ కచ్చితంగా ట్రై చేయాలి. వాటిని బయట ఆర్డర్ ఇస్తే ఎలా చేస్తారోననే భయం ఉంటుంది కాబట్టి.. ఇంట్లోనే చేసుకోగలిగే రెసిపీలు ట్రై చేయాలి. అలాంటి కాంబినేషనే కొత్తిమీర ఆలూ.. క్రిస్పీ పూరీలు. వీటిని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏంటి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
గోధుమ పిండి - 200 గ్రాములు
రవ్వ - 100 గ్రాములు
ఉప్పు - అర టీస్పూన్
నూనె - వంటకి తగినంత
నీరు - వంటకి తగినంత
కొత్తిమీర - 1 కట్ట
పచ్చిమిర్చి - 3
అల్లం - అంగుళం
బంగాళదుంపలు - 400 గ్రాములు
జీలకర్ర - అర టీస్పూన్
ధనియాలు - 1/2 టీస్పూన్
బే ఆకు - 1
ఉప్పు - రుచికి తగినంత
కారం - 1 టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
పసుపు - 1 టీస్పూన్
తయారీ విధానం
ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో గోధుమ పిండి.. రవ్వ వేసి బాగా కలపండి. దానిలో పిండికి సరిపడేంత ఉప్పు.. రెండు చెంచాల నూనె వేసి బాగా కలపాలి. ఇప్పుడు పిండిని మెత్తగా, పూరీలకు సరిపడే విధంగా సరిపోయేంత నీరు పోసి పిండిని ఉండలు లేకుండా మెత్తగా కలపాలి. పిండిలో ఉండలు ఉంటే పూరీలు సరిగ్గా రావు కాబట్టి. పిండిని బాగా మిక్స్ చేయాలి. ఇలా కలిపిన పిండిని ఓ అరగంట పక్కన పెట్టాలి. ఇలా చేయడం వల్ల పూరీలు బాగా వస్తాయి.
ఇప్పుడు బ్లెండర్ తీసుకుని దానిలో కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం వేసి పేస్ట్ చేయాలి. మెత్తగా అయ్యేందుకు కాస్త నీరు కూడా బాగా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ని తీసుకుని దానిలో బంగాళదుంపల ముక్కలను వేయాలి. అవి ఉడికేంత నీటిని వేసి.. 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. దీనిలో చిటికెడు ఉప్పు వేస్తే దుంపలు బాగా ఉడుకుతాయి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టౌవ్ ఆపేసి.. ప్రెషర్ను తీయాలి. వేడి నీటిని పారేసి.. చల్లని నీళ్లు వేసి.. దుంపలపై ఉన్న పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.
స్టౌవ్ వెలిగించి కడాయి పెట్టి.. దానిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడిచేయాలి. దానిలో జీలకర్ర, ధనియాలు, బే ఆకు అంటే బిర్యానీ ఆకును వేసి బాగా కలపాలి. ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ప్యూరీని వేసి.. రెండు నిమిషాలు ఉడికించాలి. దానిలో ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు వేసి ఉడికించాలి. అవి కాస్త వేగిన తర్వాత దానిలో ఉడికించిన బంగాళ దుంపలు వేసి బాగా కలపాలి. అనంతరం దానిలో కాస్త నీరు వేసి 3 నిమిషాలు ఉడికించాలి. బాగా కలిపి మూత వేసి మరో 7 నిమిషాలు ఉడికించాలి. ఉప్పు చెక్ చేసుకుని.. సరిపోకపోతే కాస్త వేసి.. స్టౌవ్ ఆపేయాలి.
ఇప్పుడు ముందుగా నానబెట్టిన పిండిని తీసుకుని.. చిన్న బంతిగా చేసుకోవాలి. చపాతీ కర్రతో వాటిని ఒత్తుకోవాలి. ఇలా మొత్తం పిండిని పూరీలుగా, గుండ్రంగా ఒత్తుకున్న తర్వాత.. పెద్ద కడాయి తీసుకుని స్టౌవ్ వెలిగించి దానిపై పెట్టాలి. దానిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనెను వేసి.. స్టౌవ్ను తగ్గించాలి. నూనె వేడిగా ఉన్నప్పుడు తయారు చేసి పెట్టుకున్న పూరీలను నూనెలో వేసి.. గోల్డెన్ బ్రౌన్, క్రిస్పీగా వచ్చేవరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. నూనె ఎక్కువ ఉండకూడదు అనుకుంటే పూరీలను నూనెనుంచి తీసి.. టిష్యూలపై వేసుకోవచ్చు. దీనివల్ల నూనె తగ్గిపోతుంది. ఇప్పుడు ముందుగా చేసుకున్న కొత్తిమీర ఆలుతో కలిపి హాయిగా వీటిని లాగించేయవచ్చు.