Health Risks of Stress : టెన్షన్ ఎక్కువైతే శరీరానికి ఏం జరుగుతుందో తెలుసా? ఒత్తిడి ప్రమాదం అంటోన్న వైద్యులు
Stress on Physical Health : ఒత్తిడి మానసిక శారీరక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని వైద్యులు చెప్తున్నారు. దీర్ఘకాలిక ఒత్తిడి హార్మోన్ల అసమతుల్యత, రోగనిరోధక శక్తి తగ్గడం, వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందట.

Stress Can Damage Your Health : ఒత్తిడి లేదా టెన్షన్లో ఉన్నప్పుడు.. మన శరీరంలో చాలా సమస్యలు, వ్యాధులు మొదలవుతాయి. ఈ విషయం ఎక్కువమంది గుర్తించక స్ట్రెస్ అనేది మానసిక రోగమే అనుకుంటారు. కానీ ఒత్తిడి ఎక్కువైనప్పుడు మన శరీరంపై చాలా చెడు ప్రభావం పడుతుందని అంటున్నారు వైద్యులు. నిజానికి ఒక వ్యక్తి ఏదైనా విషయం గురించి ఒత్తిడి లేదా టెన్షన్లో ఉంటే.. అది కేవలం వారి మానసిక ఆరోగ్యానికి మాత్రమే హానికరం కాదు. శారీరక ఆరోగ్యానికి కూడా హానికరం అని పలు అధ్యయనాలు నిరూపించాయి. దీనివల్ల మీరు అనేక వ్యాధులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఒత్తిడి ప్రభావం శరీరంపై ఏవిధంగా ఉంటుందో తెలుసుకుందాం.
ఒత్తిడి శరీరానికి ఎలా హాని చేస్తుందంటే
డాక్టర్ల ప్రకారం.. మనం ఎప్పుడైనా టెన్షన్ లేదా ఒత్తిడిలో ఉన్నప్పుడు.. మన మెదడు శరీరానికి ప్రమాదం ఉందని సంకేతాలు పంపుతుందట. అంటే అది మన శరీరానికి ప్రమాద సంకేతాన్ని ఇస్తుంది. దీనివల్ల శరీరంలో కార్టిసాల్, అడ్రినలిన్ అనే రెండు హార్మోన్ల స్థాయి పెరగడం మొదలవుతాయి. దీనివల్ల శరీరంలో అనేక రకాల సమస్యలు రావచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తి ఎక్కువ కాలం ఒత్తిడి లేదా ఏదైనా సమస్య గురించి టెన్షన్లో ఉంటే.. అది శరీర రోగనిరోధక శక్తిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీనివల్ల శరీరం వ్యాధులతో పోరాడే తన సామర్థ్యాన్ని కోల్పోతుంది. కొత్త వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.
నిపుణుల ప్రకారం.. ఒక వ్యక్తి ఎక్కువ కాలం ఏదైనా విషయం గురించి ఒత్తిడిలో ఉంటే శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ పెరిగి శరీర జీవక్రియను దెబ్బతీస్తుంది. దీని కారణంగా మనం తినే ఆహారం నుంచి శరీరం సరైన శక్తిని తీసుకోలేకపోతుంది. దీనివల్ల శరీరంలో అనేక సమస్యలు మొదలవుతాయి. వాటిలో ముఖ్యమైనది ఆకలి లేకపోవడం. దీనివల్ల శరీరంలో అలసట, నీరసం, నొప్పి పెరుగుతాయి.
మహిళలపై ఒత్తిడి ప్రభావం
ఒత్తిడి ప్రభావం ఎక్కువగా మహిళలపై కనిపిస్తుంది. ఒక మహిళ ఎక్కువ కాలం ఒత్తిడి లేదా టెన్షన్లో ఉంటే వారికి థైరాయిడ్ అసమతుల్యత ఏర్పడుతుంది. ఋతుక్రమంలో సమస్యలు, సంతానోత్పత్తికి సంబంధించిన వ్యాధులు ఎదుర్కోవలసి రావచ్చు. అంతేకాకుండా మహిళల్లో వాపు, చర్మం పాడవడం, జుట్టు రాలడం వంటి సమస్యల ప్రమాదం కూడా ఉంటుంది.
ఒత్తిడికి సంబంధించిన శారీరక సమస్యలు ఇవే
ఒక వ్యక్తి ఎక్కువ ఒత్తిడి టెన్షన్ తీసుకోవడం వల్ల శరీర రోగనిరోధక శక్తిపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీనివల్ల జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు వస్తాయి. శరీర అంతర్గత అవయవాలలో వాపు, అలసట, శరీరంలో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.
మీరు ఇలాంటి ఒత్తిడి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే వెంటనే వైద్య నిపుణుల సహాయం తీసుకోండి. అంతేకాకుండా బ్రీతింగ్, యోగా వంటి వ్యాయామాలు చేయడం వల్ల సమస్య అదుపులో ఉంటుంది. మెరుగైన నిద్ర కూడా ఒత్తిడిని దూరం చేయడంలో హెల్ప్ చేస్తుందని గుర్తించుకోవాలి.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.






















