Dosa and Vada with Saggubiyyam : సగ్గుబియ్యంతో ఇన్స్టాంట్ వడలు, దోశలు.. ఒకటే బ్యాటర్‌తో రెండు రెసిపీలు
Saggubiyyam Dosa : సగ్గుబియ్యంతో పాయాసం చేసుకుంటాము కానీ.. సగ్గుబియ్యంతో చేసిన బ్యాటర్‌తో వడలు, దోశలు కూడా చేసుకోవచ్చని మీకు తెలుసా? పైగా ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదట.
Tasty Breakfasts with Saggubiyyam : సగ్గుబియ్యాన్ని చాలామంది స్వీట్స్ చేసుకోవడానికి.. లేదా చలువ చేస్తుందని సూప్ చేసుకోవడానికి చూస్తారు. కానీ వాటితో మనం సౌత్ ఇండియా బ్రేక్‌ఫాస్ట్‌లు కూడా చేసుకోవచ్చు. పైగా వాటితో తయారు చేసుకునే పదార్థాలు ఆరోగ్యానికి కూడా చాలా మంంచివి. సమయం లేనప్పుడు మీరు సగ్గుబియ్యంతో దోశలు తయారు చేసుకోవచ్చంటే నమ్ముతారా? అంతేకాకుండా ఇదే పిండిని మీరు వడలకు కూడా ఉపయోగించవచ్చని తెలుసా? మీ ఇంట్లో డిఫరెంట్ టిఫెన్స్ అడిగేవారికి ఈ పిండి సరైన ఎంపిక అవుతుంది. ఎందుకంటే టేస్ట్‌తోనే కాకుండా.. మీకు సమయాన్ని ఆదాచేయడంలో కూడా హెల్ప్ అవుతుంది. మరి ఈ ఇన్స్టాంట్ వడలు, దోశలు ఎలా రెడీ చేసుకోవచ్చో? వాటికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
సగ్గుబియ్యం - 1 కప్పు
బియ్యం - 1 కప్పు
అల్లం - అంగుళం
పచ్చిమిర్చి -3
పెరుగు - పావు కప్పు
కరివేపాకు - 1 రెబ్బ
కొత్తిమీర - 1 కట్ట
ఉప్పు - రుచికి తగినంత
నూనె - వడలు, దోశలు వేయడానికి సరిపడ
తయారీ విధానం
సగ్గుబియ్యాన్ని మిక్సీలో వేసి పిండిగా చేసుకోవాలి. బియ్యాన్ని కూడా మిక్సీలో వేసుకుని పిండిగా చేసుకోవాలి. మెత్తని పొడిగా చేసుకుని.. ఈ రెండింటి ఓ గిన్నెలో వేసి కలపాలి. దానిలో పెరుగు, నీరు వేసి రెండు గంటలు నాననివ్వాలి. అయితే ఇదే పిండిని మరోలా కూడా తయారు చేసుకోవచ్చు. సగ్గుబియ్యాన్ని రెండు గంటలు నానబెట్టాలి. బియ్యాన్ని కూడా రెండు గంటలు నానబెట్టాలి.
ఇప్పుడు మిక్సీ తీసుకుని బియ్యాన్ని, సగ్గుబియ్యాన్ని విడి విడిగా వాటిని గ్రైండ్ చేయాలి. ఎందుకంటే సగ్గుబియ్యం పూర్తిగా, మెత్తగా గ్రైండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న పిండిని.. మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. వీటిని గ్రైండ్ చేస్తున్నప్పుడు ఎక్కువ నీటిని వాడకూడదు. తక్కువ నీటిని వాడుతూ.. పిండి కాస్త గట్టిగా ఉండేలానే చూసుకోవాలి. ఎందుకంటే పెరుగు కూడా వేయాల్సి ఉంది కాబట్టి పిండి ఎక్కువ జారుడుగా అయ్యే ప్రమాదముంది. బియ్యం, సగ్గుబియ్యం పిండి బాగా కలిసేలా తిప్పండి.
ఇలా సిద్ధం చేసుకున్న పిండిలో పెరుగు వేయాలి. పుల్లని పెరుగు అయితే ఇంకా మంచిది. అంతేకాకుండా దీనిని మామూలు దోశ పిండి వలె రాత్రి పూట పులియబెట్టాల్సిన అవసరం లేదు. మీరు పిండిని నానబెట్టడానికి రెండు గంటలు తీసుకుంటే చాలు. పిండిలో పెరుగు వేసి బాగా కలిపిన తర్వాత దానిలో సన్నగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తురుము, కరివేపాకు తురుమును వేయాలి. దీనిలో మీరు ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు వేస్తే రుచి మరోలా ఉంటుంది. వేసినా వేయకున్నా మాత్రం వడలు టేస్టీగా ఉంటాయి.
ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై కడాయిపెట్టి డీప్ ఫ్రైకి తగినంత నూనె వేసి దానిలో పిండిని వడలులాగా వత్తుకుని వేయాలి. ఒకవైపు వేగిన తర్వాత మరోవైపు కూడా వేయించుకోవాలి. అంతే సగ్గుబియ్యం వడలు రెడీ. అయితే మీరు దీనిలో కాస్త నీరు ఎక్కువ వేసి సగ్గుబియ్యం దోశలు వేసుకోవచ్చు. పెరుగు వేసిన తర్వాత.. దోశలకు తగ్గట్లు నీరు పోసుకుని.. అప్పుడు ఇదే పిండితో దోశలు వేసుకోవచ్చు. ఈ రకమైన దోశలు ఉడకడానికి కాస్త సమయం ఎక్కువ పడుతుంది కాబట్టి ఓపికగా చేసుకోవాలి. కానీ వీటి రుచి ఓపికకు వర్త్ అనిపిస్తుంది. ఈ రెండు వంటకాలను మీరు అల్లం చట్నీతో హాయిగా లాగించవచ్చు. లేదంటే మీకు ఇష్టమైన చట్నీనిని చేసుకోవచ్చు.
Also Read : పరీక్షల సమయంలో పిల్లలకు ఇలాంటి ఫుడ్స్ పెడితే మంచిది