Heart Attack with Pollution: కాలుష్యం ఎక్కువైతే గుండె ఆగిపోవడం ఖాయం - కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడి
ప్రస్తుతం వాహనాల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతునట్టే వాయు కాలుష్యం కూడా అంతకంతకూ పెరిగి ప్రమాదకర స్థాయికి చేరుతుంది. వాతావరణ కాలుష్యం కారణంగా తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.
వాయు కాలుష్యం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం చెడిపోవడమే కాదు ఇప్పుడు గుండె పోటు, ఇతర హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుందని సరి కొత్త అధ్యయనం వెల్లడించింది. మరీ ముఖ్యంగా వాయు కాలుష్యం పార్టిక్యులేట్ మ్యాటర్(pm) 2.5 కి దీర్ఘకాలికంగా గురికావడం వల్ల గుండె పోటు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది. పార్టిక్యులేట్ మ్యాటర్ అంటే గాలిలోని కాలుష్యాన్ని కొలిచే మీటర్. కాలిఫోర్నియాలో 3.7 మిలియన్ల మంది మీద జరిపిన పరిశోధనకి సంబంధించి వివరాలతో కూడిన అధ్యయనాన్ని జామా నెట్వర్క్ ఓపెన్ లో ప్రచురించారు. వాయు కాలుష్యం వల్ల అక్యూట్ మయోకార్డియల్ ఇన్ఫ్రారాక్షన్ (AMI), ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ మరణాలు, హృదయ సంబంధ వ్యాధుల మరణాల ప్రమాదంతో ముడిపడి ఉందని కనుగొంది.
వాయు కాలుష్య నియంత్రణ ప్రమాణాలు తగినంత రక్షణగా లేని కారణంగా హృదయ సంబంధ మరణాల ప్రమాదాన్ని పెంచుతుంది. 2007 నుంచి 2016 వరకు జరిగిన అధ్యయనం జరిగింది. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిలో అంతకముందు స్ట్రోక్ లేదా అక్యూట్ మయోకార్డియల్ ఇన్ఫ్రారాక్షన్ ఇబ్బందులు లేవు. కానీ వాయు కాలుష్యం బారిన పడిన తర్వాత ఈ వ్యాధులు వచ్చినట్టు తెలిపారు. కార్డియోవాస్కులర్ మరణాల కంటే కాలుష్యం వల్ల వచ్చే AMI మరణాలు ఎక్కువగా ఉన్నట్టు ఆధారాలతో సహా గుర్తించారు. వాయు కాలుష్యం మీద ప్రస్తుతం ఉన్న నియంత్రణ ప్రమాణాలు తగినంత రక్షణగా లేవని ఈ పరిశోధనలు రుజువు చేస్తున్నాయి.
మహిళలూ జాగ్రత్త
వాయు కాలుష్య కారకాలకు ఎక్కువ కాలం పాటు బహిర్గతం కావడం వల్ల రుతుక్రమం ఆగిపోయిన మహిళల్లో ఎముకలు దెబ్బతింటాయని ఒక అధ్యయనం కనుగొంది. నైట్రస్ ఆక్సైడ్లు వృద్ధాప్యానికి దగ్గరగా ఉన్న వాళ్ళకి రెండు రెట్లు హాని కలిగిస్తాయి. కారు, ట్రక్ ఎగ్జాస్ట్ నుంచి ఈ వాయువు వెలువడుతుంది. పేలవమైన గాలి నాణ్యత వల్ల ఎముకలు, వెన్నెముక తీవ్రంగా దెబ్బతింటాయని పరిశోధకులు తెలిపారు. దాని వల్ల బోలు ఎముకల వ్యాధి, వృద్ధుల్లో అయితే ఎముకలు విరిగిపోవడం వంటి ప్రతికూల ప్రభావాలు చూపించే అవకాశం ఉంది.
రుతుక్రమం ఆగిపోయిన 1,61,808 మంది మహిళల డేటాను పరిశోధకులు విశ్లేషించారు. వాయు కాలుష్యాన్ని అంచనా వేసి దానికి వారి శరీరంలోని భాగాలు ఎలా ప్రభావితం అవుతున్నాయో ఆరు సంవత్సరాల పాటు పరిశీలించారు. వాయు కాలుష్యానికి తక్కువగా గురైన మహిళల్లో ఎముకల నష్టం, పగుళ్లు ఎక్కువగా ఉండటం లేదు. కాలుష్యం బారిన పడుతున్న వారి ఆరోగ్య పరిస్థితులు ఎంత వరకు దారి తీస్తాయనే దాని మీద మరింత లోతుగా పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు వెల్లడించారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: డిస్పోజబుల్ పేపర్ కప్పులు ఎక్కువ వాడుతున్నారా? అవి ఆరోగ్యానికి ఎంత హానికరమో తెలుసా?