Egg Yolk vs Heart Health : గుడ్డులోని పచ్చసొన తింటే గుండెపోటు వస్తుందా? నిపుణులు చెప్తోన్న విషయాలివే
Egg Yolk Myths : గుడ్డులోని పచ్చసొనను చాలామంది దూరం పెడతారు. అయితే దీనిని తింటే నిజంగానే ఆరోగ్యానికి మంచిది కాదా? గుండెపోటుకు దారి తీస్తుందా? నిపుణులు ఏమంటున్నారు.

Eat Egg Yolk or Avoid : కొన్ని సంవత్సరాలుగా ఆరోగ్యం, ఫిట్‌నెస్ గురించి ప్రజలలో అవగాహన పెరిగింది. ఈ నేపథ్యంలోనే అనేక అపోహలు కూడా వేగంగా వ్యాప్తి చెందాయి. వాటిలో ఒకటి గుడ్డులోని పచ్చసొన గుండెకు ప్రమాదకరమని, గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుందనే వాదన ఉంది. అందుకే చాలామంది బరువు, కొలెస్ట్రాల్ భయంతో గుడ్డులోని తెల్లసొన మాత్రమే తింటారు. పచ్చసొనను తీసివేస్తారు. కానీ ఈ భయం నిజంగా సరైనదేనా? దీని గురించి నిపుణులు ఏమంటున్నారు? గుడ్డులోని పచ్చసొన తినడం వల్ల గుండెపోటు వస్తుందా?
గుడ్డు పచ్చసొనతో గుండెపోటు?
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మన శరీరంలో 80 శాతం కొలెస్ట్రాల్‌ను కాలేయం ఉత్పత్తి చేస్తుంది. అంటే ఆహారం ద్వారా లభించే కొలెస్ట్రాల్ రక్తంలో కొలెస్ట్రాల్‌ను పెంచడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. గుడ్డు పచ్చసొన తినడం వల్ల గుండెపోటు లేదా స్ట్రోక్ ప్రమాదం పెరగదని.. ఇది శరీరానికి అనేక ముఖ్యమైన పోషకాలను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోజుకు ఒక గుడ్డు తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరగదని 1.5 లక్షల మందిపై చేసిన అధ్యయనంలో తేలిందని నిపుణులు చెబుతున్నారు.
గుడ్డు పచ్చసొనతో ప్రయోజనాలు
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గుడ్డు పచ్చసొనలో ఉండే పోషకాలు శరీరానికి చాలా అవసరం. గుడ్డు పచ్చసొన మన శరీరంలో హెచ్‌డిఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. లుటిన్, కోలిన్, అనేక ముఖ్యమైన విటమిన్లు గుండె, కాలేయం, మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. బరువు పెరగడం లేదా కొలెస్ట్రాల్ పెరగడం గురించి ఉన్న అపోహలను కూడా నిపుణులు పూర్తిగా అపోహలుగా పేర్కొంటున్నారు. ఆరోగ్యకరమైన, మధుమేహం లేని, అధిక రక్తపోటు లేని వ్యక్తి రోజుకు మూడు గుడ్లు తినవచ్చని వారు చెబుతున్నారు.
సమస్య ఎక్కడుందంటే..
చాలా సమస్యలు గుడ్డు పచ్చసొనలో కాకుండా.. దానిని వండే విధానంలో ఉంటాయంటున్నారు. వెన్న, క్రీమ్ లేదా ఎక్కువ నూనెలో తయారుచేసిన గుడ్డు వంటకాలు జీర్ణ సమస్యలను, కొవ్వును పెంచుతాయని చెప్తున్నారు. కాబట్టి గుడ్డును ఆరోగ్యకరమైన మార్గంలో ఉడికించడం ముఖ్యం. ఉడికించిన గుడ్డులో 77 కేలరీలు, 3.5 గ్రాముల మొత్తం కొవ్వు, 1.6 గ్రాముల సంతృప్త కొవ్వు, 186 mg కొలెస్ట్రాల్, 62 mg సోడియం, 0.56 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 0.56 గ్రాముల చక్కెర, 6.3 గ్రాముల ప్రోటీన్ లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీనితో పాటు గుడ్డులో విటమిన్ ఎ, డి, ఇ, కె, అనేక రకాల విటమిన్ బి లు మంచి మొత్తంలో లభిస్తాయంటున్నారు. కాబట్టి అపోహలను వీడి రోజుకు ఒక ఫుల్ ఎగ్ తినవచ్చని చెప్తున్నారు. కేవలం వైట్ మాత్రమే కాకుండా.. ఎల్లో కూడా ఆరోగ్యానికి మంచిదని.. చెప్తున్నారు. ఎక్కువ మోతాదులో తీసుకోవాలనుకుంటే వైద్యుల సలహాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.






















