Diwali Special Besan Barfi Recipe : దీపావళి స్పెషల్ బేసన్ బర్ఫీ.. తయారు చేయడం చాలా తేలిక
Easy Besan Burfi Recipe : ఈ దీపావళికి ఇంట్లోనే స్వీట్స్ తయారు చేసుకోవాలనుకుంటే.. ఇక్కడ సింపుల్, ఈజీ, టేస్టీ బెసిన్ బర్ఫీ రెసిపీ ఉంది.
![Diwali Special Besan Barfi Recipe : దీపావళి స్పెషల్ బేసన్ బర్ఫీ.. తయారు చేయడం చాలా తేలిక Diwali Special sweet Besan Barfi here is the Recipe step by stepEasy besan burfi recipe and ingredients Diwali Special Besan Barfi Recipe : దీపావళి స్పెషల్ బేసన్ బర్ఫీ.. తయారు చేయడం చాలా తేలిక](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/07/1bb8f637091613f4350fbfa1cbb947021699324364409874_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Besan Barfi recipe : పండుగ అంటేనే కమ్మని వంటలు, స్వీట్లు, విందులు, వినోదాలు. ముఖ్యంగా దీపావళి సమయంలో స్వీట్లకు డిమాండ్ ఎక్కువ. ఫ్రెండ్స్, బందువులకు స్వీట్లు ఇచ్చి దీపావళి శుభాకాంక్షలు చెప్పుకుంటారు. అయితే బయటకొనే స్వీట్ల కన్నా.. ఇంట్లోనే తయారు చేసుకోగలిగే స్వీట్స్ ఇవ్వొచ్చు. వంట చేయడానికి ఎక్కువ టైమ్ పడుతుంది. బడ్జెట్ ఎక్కువ అవుతుంది అనుకుంటున్నారా? అయితే మీ సమయం, డబ్బులు వృథా చేయించని రెసిపీ ఇక్కడ ఉంది. అదే బేసిన్ బర్ఫీ.
సాధారణంగా బర్ఫీ అనగానే కాజు బర్ఫీ, బాదం బర్ఫీ అంటారు. ఈ డ్రై ఫ్రూట్ బర్ఫీలు చాలా ఖర్చుతో కూడుకున్నవి. అయితే మీరు శనగపిండితో తక్కువ ఖర్చుతో ఈ బర్ఫీలు చేయొచ్చు. బేసిన్ లడ్డూ చేసే వారికి ఇది మరింత ఈజీ రెసిపీ అవుతుంది. మరి దీనిని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
శెనగపిండి - రెండు కప్పులు
నెయ్యి - అరకప్పు
రవ్వ - 2 టేబుల్ స్పూన్లు
పంచదార - 1 కప్పు
దాల్చిన చెక్క పొడి - అర టీ స్పూన్
నీళ్లు - అరకప్పు
డ్రై ఫ్రూట్స్ - టేస్ట్‌కి తగ్గట్లు
తయారీ విధానం
ముందుగా స్టౌవ్ వెలిగించి వెడల్పాటి కడాయి పెట్టాలి. దానిలో నెయ్యి వేయాలి. మంటను మీడియంగా ఉంచాలి. నెయ్యి కరిగిన తర్వాత.. రవ్వ వేసి వేయించాలి. వెంటనే దానిలో శెనగపిండి మొత్తం వేయాలి. ఉండలు ఏర్పడకుండా దానిని కలుపుతూనే ఉండాలి. మూడు నుంచి నాలుగు నిమిషాలు మంటమీదే ఉంచి పిండిని బాగా కలుపుతూ ఉండాలి. నెయ్యిలో పిండి బాగా కలిసి.. మంచి చిక్కని పేస్ట్ మాదిరి తయారవుతుంది.
శెనగపిండి రంగు గోల్డెన్ బ్రౌన్‌గా మారేవరకు పిండిని స్టవ్ మీద ఉంచి వేయిస్తూనే, కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతున్నప్పుడు పిండి నుంచి నెయ్యి విడుదలవుతుంది. మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు స్టౌవ్ ఆపేయాలి. అయినా కూడా పిండిని మరోసారి కలపి పక్కన ఉంచండి. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం ఓ గిన్నె తీసుకుని దానిలో పంచదార, అరకప్పు నీళ్లు వేసి.. పంచదార పూర్తిగా కరిగేలా మీడియం మంటపై ఉంచండి. లేత తీగపాకం వచ్చే వరకు ఉంచాలి. ఇది కాస్త చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి. శెనగపిండి మిశ్రమం కాస్త వేడిగా ఉన్నప్పుడు.. కాస్త దాల్చిన చెక్క పొడి, సిరప్ వేసి.. బాగా కలపాలి.
పిండిలో సిరప్ బాగా కలిస్తే అది చిక్కటి రూపాన్ని పొందుతుంది. ఈ మిశ్రామన్ని.. ముందుగా నెయ్యి, డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేసిన ప్లేటులో వేయండి. స్పాచ్యూలాతో దానిని స్ప్రెడ్ చేయండి. పైన కూడా డ్రై ఫ్రూట్స్ వేసి.. స్పాచ్యూలాతో నొక్కండి. అది పూర్తిగా సెట్ అయ్యే వరకు చల్లారనివ్వండి. వేడి తగ్గాక ముక్కలు కోసేయడమే. అంతే తాజా, టేస్టీ బేసిన్ బర్ఫీ రెడీ. మీరు.. మీ ఇంటిల్లిపాది హాయిగా దీనిని లాగించేయవచ్చు. బంధుమిత్రులకు పంచేయవచ్చు.
Also Read : దీపావళికి ఈ క్రియేటివ్ ఐడియాలతో మీ ఇంటిని ఇలా అందంగా అలంకరించేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)