NTR Fan : ప్రాణాలు నిలిపేందుకు లక్షలు ఖర్చు పెట్టి జూ ఎన్టీఆర్ - కోలుకున్నాక విషాదం- తిరుపతి కౌశిక్ హఠాన్మరణం !
Tirupati: తిరుపతికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ చనిపోయారు. అతనిని కాపాపడుకునేందుకు జూనియర్ ఎన్టీఆర్ లక్షలు ఖర్చు పెట్టారు.

NTR fan Kaushik dies: జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు విషాద వార్త. అనారోగ్యం నుంచి కోలుకున్నాడని అనుకున్న ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ హఠాత్తుగా చనిపోయారు. క్యాన్సర్ తో బాధపడుతూ దేవర సినిమా చూసే వరకు ఉంటాను అంటూ కోరుకున్న యువకుడి గురించి మీడియాలో వైరల్ కావడంతో అప్పట్లో ఎన్టీఆర్ స్పందించారు. బెంగళూరు లో చికిత్స పొందుతున్న సమయం లో ఎన్టీఆర్ నేరుగా వీడియో కాల్ చేసి బాగుంటావు.. వైద్యం చేసుకో, వైద్య ఖర్చులు తాను చూసుకుంటాను అని ధైర్యం కల్పించారు. అతని తండ్రి టీటీడీ లో కాంట్రాక్ట్ డ్రైవర్ కావడంతో టీటీడీ, ఉద్యోగులు, దాతలు వివిధ రూపంలో సహాయం చేశారు. ట్రీట్ మెంట్ పూర్తి అయింది. చెన్నై ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసే సమయంలో డబ్బులు లేకపోవడంతో ఎన్టీఆర్ సిబ్బంది, అభిమాన సంఘం సభ్యులు ఆసుపత్రి బిల్లు కట్టి కౌశిక్ ను డిశ్చార్జి చేసి ఇంటికి పంపారు. మూడు నెలల పాటు మెడికల్ అబ్జర్వేషన్ అవసరమని చెప్పారు. అయితే మూడు నెలలు కాక ముందే చనిపోవడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది.
గత సెప్టెంబర్‌లో క్యాన్సర్ తో బాధపడుతూ చావు బతుకుల మధ్య వరకు వెళ్లిన తిరుపతి కి చెందిన శ్రీనివాసులు, సరస్వతి కుమారుడు కౌశిక్ తన చివరి కోరిక మేరకు దేవర సినిమా చూసి చనిపోవాలని కోరుకున్నాడు. తన అభిమాని విషయాన్ని తెలుసుకున్న ఎన్టీఆర్ వీడియో కాల్ ద్వారా కౌశిక్ తో మాట్లాడారు. థైర్యంగా ట్రీట్మెంట్ తీసుకో నేను కలుస్తాను.. చికిత్స కు కావాల్సిన ఖర్చు గురించి మీరు భయపడకండి అని హామీ ఇచ్చారు. అభిమాన నటుడు ఇచ్చిన హామి మేరకు కౌశిక్ ఆసుపత్రిలో చికిత్స పొందారు.
కౌశిక్ చికిత్స కోసం ఎన్టీఆర్ అభిమానులు, టీటీడీ సహా పలువురు సాయం చేశారు. అందరి సాయం ఫలించి కౌశిక్ క్యాన్సర్ నుంచి కోలుకున్నారని వైద్యులు ప్రకటించారు.చివరికి డిశ్చార్జ్‌కు కూడా డబ్బులు అవసరం అయితే ఎన్టీఆర్, ఆయన ఫ్యాన్స్ సాయం చేశారు. ఓ ప్రాణం నిలిపామన్న ఆనందం ఆ ఫ్యాన్స్ లో ఇప్పటి వరకూ ఉంది. ఎన్టీఆర్ కు ఆ కుటుంబం కృతజ్ఞతలు చెప్పుకుంది. అయితే పోస్ట్ మెడికల్ కేర్ విషయంలో ఏదో తప్పిదం జరగడంతో అది కౌశిక్ ప్రాణం మీదకు తెచ్చినట్లుగా తెలుస్తోంది. హఠాత్తుగా కౌశిక్ చనిపోవడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా తల్లడిల్లిపోతున్నారు.
సాధారణంగా హీరోలు అభిమానుల ఆరోగ్యాలను పట్టించుకోవడం కష్టమే. లక్షల మంది అభిమానుల్లో అనేక మందికి సమస్యలు ఉంటాయి. అందుకని హీరోలు పట్టించుకోలేరు. కానీ కొన్ని కొన్ని ఆసాధారణమైన కేసుల్లో హీరోలు తమ ఔదార్యం చూపిస్తూ ఉంటారు. వారు ఇచ్చే మనోధైర్యం కారణంగా కొంత మంది ఆరోగ్యాలు బాగుపడుతూ ఉంటాయి. పవన్ కల్యాణ్ అభిమాని ఒకరు గతంలో కోలుకున్నారు కూడా. కౌశిక్ కూడా కోలుకున్నారని భావించారు. కానీ చివరికి విషాదం మిగిలింది.





















