Diwali Health issues: దీపావళి పండుగ సీజన్లో వచ్చే అనారోగ్యాల నుంచి ఇలా రక్షణ పొందండి
పండుగ సంతోషమే కాదు జాగ్రత్తగా ఉండకపోతే అనారోగ్యం కూడా తీసుకొస్తుంది.
దీపావళి పండుగ వస్తుందంటే వారం ముందు నుంచే ఇంట్లో హడావుడి మొదలైపోతుంది. స్వీట్స్ ఏం చెయ్యాలి, బంధువులకి ఎటువంటి గిఫ్ట్స్ ఇవ్వాలి, పూజ ఎలా చెయ్యాలి, పూజకి కావాల్సిన సామగ్రి ఏంటి అని అన్ని లిస్ట్ ప్రిపేర్ చేసుకుని పనిలోకి దిగిపోతారు. బంధువులు, స్నేహితుల రాకతో ఇల్లంతా కళకళాడిపోతుంది. వాళ్ళ కోసం ఎటువంటి వంటలు చెయ్యాలి, ఏం పానీయాలు సిద్ధం చెయ్యాలి అని తెగ టెన్షన్ పడిపోతారు. పండుగ వచ్చిందంటే ఇంటికి సంతోషమే కాదు ఒక రకంగా రోగం కూడా తెచ్చినట్టే. దీపావళి అంటే కళ్ళ ముందు రకరకాల స్వీట్స్ పెట్టేస్తారు. మరి అలాంటివి కనిపిస్తే నోరు ఆగకుండా ఉంటుందా. అతిగా తినేస్తారు ఆరోగ్య సమస్యలు తెచ్చేసుకుంటారు. అందుకే పండుగల సమయంలో ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
అలా అని పండుగ ఆనందాన్ని త్యాగం చేయాల్సిన అవసరం ఏమి లేదు. కాకపోతే బయట వండిన ఆహారానికి బదులుగా ఇంట్లోనే తాజాగా భోజనం వండుకుని తినడం మంచిదని సూచిస్తున్నారు. ఆరోగ్యమైన ఎంపికలు చేసుకుంటూ మితంగా తినాలని హెచ్చరిస్తున్నారు. పండగ వేళ వచ్చే సాధారణ అయిదు సమస్యలని ఎలా ఎదుర్కోవాలనేదానికి నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అవేంటంటే..
జీర్ణ సమస్యలు
దీపావళి అంతే రుచికరమైన స్నాక్స్, బోలెడు స్వీట్స్ ఉంటాయి. బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతూనే ఉంటుంది. బంధువులు, స్నేహితుల రాకతో ఇల్లంతా సందడి వాతావరణం నెలకొంటుంది. ఇటువంటి సమయంలో ఎక్కువగా తీసుకునే పదార్థాలు స్వీట్స్ కాజు కట్లీ, గులాబ్ జామూన్ కనిపిస్తే తినకుండా ఆగుతారా? తెలియకుండానే అతిగా తినేస్తారు. దీని వల్ల జీర్ణాశయాంతర సమస్యలు వచ్చేస్తాయి. ఇవి యాసిడ్ రిప్లెక్స్ కలిగిస్తాయి. ఇటువంటి సమయంలో ఆరుబయట ఫుడ్ తినాలని ఎంచుకుంటే మాత్రం వాంతులు, ఉబ్బరం, ఫుడ్ పాయిజనింగ్ వంటి అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే బయట ఆహారాన్ని నివారించడం ఉత్తమం.
నిద్రలేమి
స్నేహితులు, బంధువులు ఒక్క చోట చేరితే ఇక నిద్ర కరువే. వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటూ ఏ టైమ్ కి నిద్ర పోతున్నాం అనేది కూడా మర్చిపోతారు. ఆట పాటలతో ఎంజాయ్ చేస్తూ సంబరాలు చేసుకుంటారు. క్రమరహిత నిద్ర ఆరోగ్యాన్ని దెబ్బతినేలా చేస్తుంది. సరిగా నిద్ర లేకపోవడం వల్ల గుండె, మెదడు సమస్యలని తెచ్చిపెడుతుంది. ఇది దీర్ఘకాలికంగా ఉంటే తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులకి దారి తీస్తుంది.
అధిక ఒత్తిడి
పండగ వస్తుందంటే ఇల్లు శుభ్రం చేసుకోవడం చక్కగా అలంకరించుకోవడం, పిండి వంటలు వండుకోవడం చేస్తారు. పనుల హడావుడి వల్ల తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. దీని వల్ల అధిక శారీరక శ్రమ గుండెపై ఒత్తిడిని కలిగిస్తుంది. అంతే కాదు ఎక్కువగా వేయించిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల అనేక సందర్భాల్లో గుండెపోటుకి కారణం అవుతుంది. అందుకే ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం.
అధిక రక్తపోటు
ఫ్రెండ్స్ అందరూ ఒక చోట చేరితే చేసే మొదటి పని మద్యం సేవించడం. ఆల్కాహాల లేదా ఇతర పానీయాలు తాగుతూ ఉంటారు. వాటిని ఖాళీ కడుపుతో అసలు తీసుకోకూడదు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలని పెంచుతుంది. రక్తపోటు స్థాయిలలో హెచ్చుతగ్గులకి కారణం అవుతుంది. డయాబెటిక్, హైపర్ టెన్సివ్ పేషెంట్ అయితే మద్యపానం చేయకపోవడం ఉత్తమం. అలాగే ధూమపానం కూడా చేస్తూ ఉంటారు. దాన్ని నివారించాలి.
శ్వాస సమస్యలు
దీపావళి అంటే టపాసుల పండుగ. వారం ముందే నుంచే క్రాకర్స్ కాలుస్తూ పిల్లలు ఎంజాయ్ చేస్తారు. దాని వల్ల పొగ వ్యాపిస్తుంది. అసలే చలి కాలం డానికి తోడు కాలుష్యపు పొగ వల్ల గాలి కలుషితం అవుతుంది. ఇటువంటి సమయంలో వాతావరణ కాలుష్యం కారణంగా శ్వాస కోస సమస్యలు ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది. ఉబ్బసం లేదా ఇతర శ్వాస సమస్యలతో బాధపడే వాళ్ళు తీవ్ర అసౌకర్యానికి గురవుతారు. బాణాసంచా పేల్చడం వల్ల శబ్ద కాలుష్యం పెరిగిపోతుంది. దీనివల్ల మనషులే కాదు జంతువులు కూడా ఇబ్బంది పడతాయి. అందుకే పర్యావరణహిత క్రాకర్స్ ఉపయోగించమని సూచిస్తుంటారు.
ఈ సమస్యలు అధిగమించేందుకు చిట్కాలు
☀ మితంగా తినాలి. ఆకుకూరలు, తాజా పండ్లు, అధిక ఫైబర్ ఉండే ఆహారం తీసుకోవాలి.
☀ హైడ్రేట్ గా ఉంటాలి. కనీసం 4 లీటర్ల నీటిని తాగాలి.
☀ మెరుగైన ఆరోగ్యం కోసం 6-8 గంటలు నిద్ర అవసరం.
☀ ప్రతిరోజు క్రమం తప్పకుండా 30 నిమిషాల పాటు శారీరక శ్రమ, వ్యాయామం చెయ్యాలి.