Lottery Rules In India: తెలుగు ప్రజలు ఇతర రాష్ట్రాల లాటరీ టికెట్లను కొనొచ్చా? ఏయే రాష్ట్రాలు అనుమతిస్తున్నాయి?
కేరళ లాటరీ టికెట్లను ఏపీ, తెలంగాణ ప్రజలు కొనుగోలు చేయొచ్చా? ఏయే రాష్ట్రాలు టికెట్లను బయట రాష్ట్రాల ప్రజలు కొనుగోలు చేయడానికి అనుమతి ఉంది? చట్టాలు ఏం చెబుతున్నాయ్?
Lottery Rules In India | ‘‘జీవితంలో పైకి రావాలంటే గొడ్డులా కష్టపడితే సరిపోదు. దానికి లక్ కూడా తోడుండాలి’’ అని మన పెద్దలు అంటారు. అందుకే, కొంతమంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తుంటారు. అయితే, ఇది సరదాగా మొదలై వ్యసనంగా మారే ప్రమాదం ఉంది. మద్యానికి బానిసైనట్లే లాటరీ టికెట్లకు కూడా అలవాటు పడి కష్టార్జితమంతా ఇందులోనే పెడుతుంటారు. అందుకే, కొన్ని రాష్ట్రాల్లో లాటరీ టికెట్లను నిషేదించారు. అలాగని ఇండియాలో లాటరీ టికెట్ల అమ్మకం, కొనుగోలు నేరం కాదు. ఇండియాలో ఇందుకు ప్రత్యేక చట్టం ఉంది. లాటరీలకు చట్టబద్ధత కల్పించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకే వదిలేసింది.
1998 లాటరీ నియంత్రణ చట్టం ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు వారి స్వంత చట్టాన్ని రూపొందించుకోవడానికి అధికారం ఇచ్చింది. దీని ప్రకారం కొన్ని రాష్ట్రాల్లో లాటరీ చట్టబద్ధమైనది. మిగతా రాష్ట్రాల్లో మాత్రం దీనిపై నిషేదం విధించాయి. కనీసం ప్రైవేట్ సంస్థలు కూడా లాటరీని నిర్వహించకూడదు. అయితే, ఏ రాష్ట్రంలో లాటరీ ఆ రాష్ట్రానికే వర్తిస్తుంది. లాటరీకి చట్టబద్ధత లేని రాష్ట్రాల ప్రజలు పక్క రాష్ట్రం నుంచి లాటరీ టికెట్లను కొనుగోలు చేయడానికి వీల్లేదు. కానీ, ఇప్పుడంతా ఆన్‌లైన్ అయిపోయింది. కేరళా లాటరీ టికెట్లు ఇప్పుడు ఆన్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి.
ఏయే రాష్ట్రాల్లో లాటరీ లీగల్?:
⦿ ఇండియాలో 13 రాష్ట్రాల్లో లాటరీ లీగల్. ప్రభుత్వమే స్వయంగా ఈ టికెట్లు విక్రయిస్తుంది.
⦿ 15 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో లాటరీ టికెట్ల విక్రయాన్ని నిషేదించారు.
⦿ ప్రైవేట్ లాటరీలను నిషేదించారు.
⦿ ఇండియా నుంచి అంతర్జాతీయ లాటరీలు ఆడటం చట్టవిరుద్ధం కాదు.
లాటరీ టికెట్లను విక్రయించడం ద్వారా ఆదాయం పొందుతున్న రాష్ట్రాలివే:
⦿ అస్సాం
⦿ అరుణాచల్ ప్రదేశ్
⦿ గోవా
⦿ కేరళ
⦿ మధ్యప్రదేశ్
⦿ మహారాష్ట్ర
⦿ మణిపూర్
⦿ మేఘాలయ
⦿ మిజోరం
⦿ నాగాలాండ్
⦿ పంజాబ్
⦿ సిక్కిం
⦿ పశ్చిమ బెంగాల్
కేరళ లాటరీ టికెట్లను తెలుగు ప్రజలు కొనుగోలు చేయొచ్చా?: కేరళలో స్థిరపడిన తెలుగు ప్రజలు అక్కడి లాటరీ టికెట్లను కొనుగోలు చేయొచ్చు. అయితే, ఆ రాష్ట్రంలో పర్యటించే టూరిస్టులు మాత్రం కొనుగోలు చేయడానికి వీల్లేదు. అయితే, ఏజెంట్లు ఇటీవల కేరళా లాటరీలను ఆన్‌లైన్‌లో విక్రయిస్తూ సొమ్ము చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అంటే, మీరు కేరళ వెళ్లకుండా అక్కడికి టికెట్లు కొనుగోలు చేయొచ్చు. అయితే, ఇది రిస్క్‌తో కూడుకున్న అంశమే. ఎందుకంటే, కేరళ ప్రభుత్వ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ టికెట్లు కేవలం తమ రాష్ట్రాలనికి చెందిన పౌరుల కోసమేనని, ప్రైజ్ మనీ కూడా కేవలం కేరళ పౌరులకు మాత్రమే ఇస్తామని వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే మీరు ఆన్‌లైన్‌లో కేరళ టికెట్లు కొనుగోలు చేయకపోవడమే బెటర్. కొన్నాళ్ల కిందట హర్యానాకు చెందిన ఓ వ్యాపారి తిరువనంతపురం వెళ్లాడు. అక్కడ ఓ ఏజెంట్ వద్ద లాటరీ టికెట్లు కొనుగోలు చేశాడు. రూ.కోటి టికెట్‌ను అతడు గెలుచుకున్నాడు. ఆ నగదు తీసుకోడానికి వెళ్లిన అతడికి అధికారులు షాకిచ్చారు. దీంతో అతడు అతడు కేరళా సచివాలయం ముందు నిరాహార దీక్ష చేపట్టాడు. అప్పటి కేరళ స్టేట్ లాటరీ టికెట్ డైరెక్టర్ బిజు ప్రభాకర్ స్పందిస్తూ.. ఈ లాటరీ కేవలం కేరళలో నివసించే ప్రజలకు మాత్రమేనని స్పష్టం చేశారు. నిబంధనల్లో కూడా ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేశామని వెల్లడించారు. అయితే, కొన్ని రాష్ట్రాలు మాత్రం ఇతర రాష్ట్రాల ప్రజలు తమ టికెట్లను కొనుగోలు చేయడానికి అనుమతిస్తున్నాయి.
పంజాబ్ లాటరీని ఎవరైనా కొనుగోలు చేయొచ్చు: కేరళ రాష్ట్రం కేవలం తమ ప్రజలకు మాత్రమే లాటరీని పొందే అవకాశాన్ని ఇస్తుంటే.. పంజాబ్ మాత్రం దేశంలో ఎవరైనా సరే తమ లాటరీ టికెట్ కొనుగోలు చేయొచ్చని చెబుతోంది. పంజాబ్‌లో గాంధీ బ్రదర్స్ లాటరీ (Gandhi Brothers Lottery) పేరుతో ఈ టికెట్లను విక్రయిస్తున్నారు. మీరు నగదు పే చేసినట్లయితే.. టికెట్‌ను మీ అడ్రస్‌కు పంపిస్తారు. అయితే, ఆన్‌లైన్ కొనుగోళ్లు ఎప్పుడూ రిస్కే. కాబట్టి, ఈ విషయంలో మీరు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. మీకు అక్కడ ఎవరైనా స్నేహితులు ఉంటే.. వారితో టికెట్ కొనుగోలు చేయించుకోవడమే బెటర్. పంజాబ్ కాకుండా మహారాష్ట్ర, పశ్చిమ బెంగడాల్, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, అస్సాం, గోవా లాటరీలను కూడా ఇతర రాష్ట్రాల ప్రజలు కొనుగోలు చేయొచ్చు. అయితే, ఇవన్నీ పేపర్ లాటరీలు. తప్పకుండా మీ చేతిలో ఆ టికెట్ ఉండాలి. మీరు వీటిని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే.. పోస్టు ద్వారా అందుకుంటారు. పోస్టల్ సర్వీస్ కోసం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్‌లో విదేశీ లాటరీ టికెట్లు కొనుగోలు చేయొచ్చా?: భారతీయులు ఆన్‌లైన్‌లో లాటరీలు కొనుగోలు చేయొచ్చు. అయితే, ఇండియా నుంచి ఏ సంస్థ ఆన్‌లైన్ లాటరీలను విక్రయించడం లేదు. అమెరికాకు చెందిన US పవర్‌బాల్, మెగా మిలియన్స్, మెగా-సేన, యూరోజాక్‌పాట్, యూరో మిలియన్స్ సంస్థలు బయటి దేశాల ప్రజలకు కూడా లాటరీ టికెట్లు విక్రయిస్తున్నాయి. ఇండియా నుంచి ‘లట్టో ప్లేయర్’లకు అనుమతి ఉంది. ఒక వేళ మీరు ఈ లాటరీలను గెలుచుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వానికి పన్ను కట్టాల్సిందే. ఇండియాలో వ్యక్తులు లేదా ప్రైవేట్ సంస్థలు నిర్వహించే ఆన్‌లైన్ లాటరీలను మాత్రం చట్టవిరుద్ధంగా పరిగణిస్తారు.
Also Read: శృంగారం చేసినా, చేయకపోయినా వారానికి ఇన్ని సార్లు స్కలించాల్సిందే, లేకపోతే..
విజేతను ఎలా నిర్ణయిస్తారు?: లాటరీల్లో ఒక్కో రాష్ట్రం ఒక్కో విధానం, స్కీమ్‌లు పాటిస్తున్నాయి. కొన్ని లాటరీలను రోజువారీ లేదా గంటలు, వారాలు, నెలలు చొప్పున డ్రా చేస్తుంటారు. పండుగల రోజు కూడా భారీ మొత్తాలను ప్రకటిస్తారు. విజేతలను నిర్ణయించడం కోసం జంబో లాటరీ మెషీన్‌లను ఉపయోగిస్తారు. ఇదంతా పబ్లిక్‌గానే జరుగుతుంది. భారీ ప్రైజ్ మనీలను కేవలం లాటరీ టికెట్ డిపార్ట్‌మెంటే స్వయంగా ఇస్తుంది. అంతకంటే తక్కువ స్థాయి నగదు బహుమతులను టికెట్ విక్రేతల ద్వారా అందిస్తారు. టికెట్‌ను క్లెయిమ్ చేసుకోడానికి విజేత తన గుర్తింపు పత్రాలను, టికెట్‌ను అధికారులకు చూపించాలి. తాను ఆ రాష్ట్రానికి చెందినవాడినేనని నిరూపించుకోవాలి.
Also Read: ఈ మూడు ఆహారాలు వీర్యకణాల సంఖ్యను తగ్గిస్తాయి, హెచ్చరిస్తున్న అధ్యయనాలు