Corona new Variant: కరోనా కొత్త వేరియంట్ ఆర్కుట్‌రస్, కేసులు పెరుగుదలకు ఈ వేరియంటే కారణమా?
కరోనా వైరస్ నుంచి మరో కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. దీని వల్లే కేసులు పెరుగుతున్నట్టు తెలుస్తోంది.
కరోనా వేసులు మొన్నటి వరకు తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు మళ్లీ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది కానీ తరగడం లేదు. అయితే ఆరోగ్య శాఖ చెబుతున్న ప్రకారం ఢిల్లీలో కొత్తగా 1757 కొత్త కేసులు వచ్చాయి. ఆరుగురు మరణించారు కూడా. మొత్తం దేశం అంతటా కేసులు పెరుగుదల కనిపిస్తోంది. ఈసారి మళ్లీ కొత్త వేరియంట్ దాడి చేయడం ప్రారంభించిందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
ఇదే ఆ వేరియంట్...
ఇప్పుడు పెరుగుతున్న కేసులకు కారణం ఒమిక్రాన్ XBB.1.16 వేరియంట్. దీన్నే ఆర్కుట్‌రస్ అని పిలుస్తారు. మహమ్మారి కరోనా తగ్గిందని ఊపిరి పీల్చుకుంటున్న దేశానికి ఈ కొత్త వేరియంట్ వల్ల మళ్లీ భయాంధోళనలు మొదలయ్యాయి. ఇది తీవ్రంగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాబట్టి మళ్లీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఆర్కుట్‌రస్ వేరియంట్ వ్యాప్తి వేగం అధికంగానే ఉన్నట్టు గుర్తించారు పరిశోధకులు. ఇది యువత, పిల్లలను కూడా ఎక్కువగా ప్రభావితం చేస్తోంది. మనుషుల్లోని రోగనిరోధక శక్తిని తట్టకునే లక్షణాలను కూడా ఇది చూపిస్తోంది.
లక్షణాలు ఇలా...
మ్యుటేషన్ చెందుతున్న కరోనా వైరస్ అన్ని వేరియంట్లు ఒకేలాంటి లక్షణాలను చూపిస్తున్నాయి.
1. జ్వరం ఎక్కువ కాలం పాటూ వేధించడం
2. ముక్కు కారడం లేదా ముక్కు దిబ్బడ వేయడం
3. గొంతు మంట
4. కండ్ల కలక
5. తలనొప్పి
6. తీవ్ర అలసట
7. కండరాలు నొప్పి
పైన చెప్పిన లక్షణాలన్నీ దాదాపు ముందు వేరియంట్లతో కలిగేవే. అయితే కొత్తగా ఇందులో చేరినది పింక్ ఐ (కండ్ల కలక). పింక్ ఐ, కోవిడ్-19తో ఎలా సంబంధం కలిగి ఉంటుందనే దానిపై ఇంకా సరైన సమాచారం లేదు. దీనికి ఎక్కువ పరిశోధన అవసరం. ఇది 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో బయటపడుతున్న లక్షణం.
జాగ్రత్తలు ఇలా...
1. మునుపటిలాగే బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్లినప్పుడు మాస్కులు పెట్టుకోవాలి.
2. రద్దీగా ఉండే ప్రాంతాల్లో తిరగకూడదు.
3. హ్యాండ్ శానిటైజర్ ఎక్కువగా వాడాలి.
4. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
5. బూస్టర్ షాట్ తీసుకోవాలి.
6. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలను రోజూ తీసుకోవాలి.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉచితంగా బూస్టర్ డోస్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. బూస్టర్ డోస్‌గా కార్బెవ్యాక్స్ వ్యాక్సిన్‌ను వేయాలని కేంద్ర ప్రభుత్వం గతంలోనే అనుమతి ఇచ్చింది. గ్రామాల్లోని పీహెచ్‌సీ లలో కూడా ఈ బూస్టర్ డోస్ లభిస్తుంది.
Also read: ఒక బిడ్డను కన్నాక లావుగా అయ్యాను, నా భర్త పంది, ఏనుగు అని పిలుస్తున్నాడు
Also read: మనం తాగే టీ, తినే పసుపే కరోనా మరణాలను తగ్గించింది - ICMR అధ్యయనంలో వెల్లడి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.