Rowdy Sheeters Job Mela: రౌడీ షీటర్లకు జాబ్ మేళా, విజయవాడ పోలీసుల వినూత్న ఆలోచన
Rowdy Sheeters Job Mela: రౌడీ షీటర్లలో మార్పు తీసుకొచ్చేందుకు విజయవాడ పోలీసులు వినూత్నంగా ఆలోచించారు. రౌడీషీటర్లకు జాబ్ మేళా నిర్వహించి వారిలో పరివర్తన తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
Rowdy Sheeters Job Mela: విజయవాడ పోలీసులు(Vijayawada Police) వినూత్నంగా ఆలోచించారు. రౌడీషీటర్ల(Rowdy Sheeters)లో పరివర్తనకు ముందడుగు వేశారు. రౌడీషీటర్లకు జాబ్ మేళా(Job Mela) నిర్వహించి వారికి ఉద్యోగాలు(Jobs) కల్పిస్తున్నారు. ఈ విషయాన్ని విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా మీడియాకు వెల్లడించారు. విజయవాడ పోలిస్ కమిషనరేట్, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(Skill Development Corporation) సంయుక్తంగా నిర్వహించిన జాబ్ మేళాలో వందలాది మంది యువత, రౌడిషీటర్లు పాల్గొన్నారు. జాబ్ మేళాలో మొత్తం 16 కంపెనీలు పాల్గొన్నాయి. ఈ జాబ్ మేళాను స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా ప్రారంభించారు.
ది 05.03.2022 న ఉదయం 10.00 ల నుండి సాయంత్రం 4.00 గo ల వరకు షాదీఖానా , అజిత్ సింగ్ నందు నిరక్షరాస్యులకు మరియు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళా నిర్వహిస్తున్న విజయవాడ సిటీ పోలీస్ శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వారు. (1/2) pic.twitter.com/rUkVtG4Q6H
— Vijayawada City Police (@VjaCityPolice) March 5, 2022
జాబ్ మేళాలో పాల్గొన్న 16 కంపెనీలు
సీపీ కాంతి రాణా టాటా(CP Kanti Rana Tata) మాట్లాడుతూ...విజయవాడలో రౌడీషీటర్ల సమస్య ఎప్పటి నుండో ఉందన్నారు. రౌడీషీటర్లతో మాట్లాడినప్పుడు వారి సమస్యలు అర్థం చేసుకున్నానన్నారు. ఉపాధి అవకాశాలు కల్పిస్తే గౌరవంగా జీవించేందుకు చాలా మంది ముందుకు వచ్చారని సీపీ తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టామని, 16 కంపెనీలు ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. యువత జీవితాన్ని దశల వారిగా నిర్దారించుకుని ప్రణాళికా బద్దంగా ముందుకు సాగాలని సీపీ సూచించారు.
సరికొత్త జీవితాన్ని ప్రారంభించాలి
సమాజంలో ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదని సీపీ కాంతి రాణా టాటా అన్నారు. విద్య ద్వారానే అభివృద్ధి చెందుతారన్నారు. తెలిసి తెలియక చేసిన తప్పులను వదిలి కుటుంబం కోసం గౌరవంగా జీవించాలన్నారు. 5, 6 సవంత్సరాలు కష్టపడి పని చేసి గోల్ రిచ్ అవ్వగలిగితే జీవితం అంతా సుఖంగా ఉండొచ్చని సీపీ అన్నారు. పాత జీవితాన్ని వదిలి సరికొత్త జీవితాన్ని ప్రారంభించాలని రౌడీ షీటర్లకు సీపీ కాంతి రాణా సూచించారు.
విజయవాడలో మార్పు ప్రారంభమైంది
ఎమ్మెల్యే మల్లాది విష్ణు(Malladi Vishnu) మాట్లాడుతూ.. విజయవాడ అంటే గతంలో ఆరచక శక్తులకు అడ్రస్ గా ఉండేదని, ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదన్నారు. పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా వచ్చిన తరువాత చాలా మార్పులు వస్తున్నాయన్నారు. తప్పు దారి పట్టిన వారిని సన్మార్గంలో పెట్టేందుకు పోలీస్ గా పని చేయడంతో పాటు వారికి జీవనోపాధి కల్పించే విధంగా జాబ్ మేళా నిర్వహచడం సంతోషానిస్తుందన్నారు. ఉద్యోగం పొందిన వారు జాగ్రత్తగా విధులు నిర్వహించాలన్నారు.