Public Examination Bill 2024: పేపర్ లీకుల నిరోధక బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం, పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే శిక్ష తప్పదు!
జాతీయ స్థాయిలో నిర్వహించే వివిధ పోటీ పరీక్షలలో పేపర్ లీక్‌లను అరికట్టడానికి ప్రత్యేక చట్టం తేవాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 13న రాష్ట్రపతి ఆ బిల్లుకు ఆమోదముద్ర వేశారు.
Public Examinations (Prevention of Unfair Means) Bill, 2024: జాతీయ స్థాయిలో నిర్వహించే వివిధ పోటీ పరీక్షలలో పేపర్ లీక్‌లను అరికట్టడానికి ప్రత్యేక చట్టం తేవాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 5న ఇందుకు సంబంధించిన 'పబ్లిక్ పరీక్షల అక్రమ మార్గాల నిరోధక బిల్లు-2024' పేరుతో బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుకు లోక్‌సభ, రాజ్యసభ ఇటీవల ఆమోదం తెలపగా... రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. దీంతో ఫిబ్రవరి 13న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆ బిల్లుకు ఆమోదముద్ర వేశారు.
ప్రభుత్వ ప్రవేశ పరీక్షలన్నింటిలో అక్రమాలను అరికట్టడం, అవకతవకలపై దర్యాప్తు చేయడమే ఈ చట్టం ఉద్దేశం. ప్రభుత్వం నిర్వహించే పరీక్షల్లో పారదర్శకత, విశ్వసనీయత తీసుకువచ్చే ఉద్దేశంతో బిల్లును కేంద్రం రూపొందించింది. ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలుపగా.. అధికారిక గెజిట్‌లో నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన తేదీ నుంచి ఇది అమల్లోకి రానుంది.
ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఏదైనా పేపర్ లీకేజీకి పాల్పడినా, మాల్ ప్రాక్టీస్ చేసినా, నకిలీ వెబ్‌సైట్లు తెరిచినా గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.కోటి వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ, ఐబీపీఎస్, ఎన్‌డీఏ తదితర పోటీ పరీక్షలతో పాటు నీట్, జేఈఈ, సీయూఈటీ వంటి ఎంట్రన్స్ టెస్టులకు సైతం చట్టం వర్తిస్తుంది. అయితే, గత కొన్నేళ్లుగా ప్రశ్నాపత్రాల లీకేజీలతో లక్షలాది మంది విద్యార్థులు, అభ్యర్థుల నష్టపోయారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభలో పేర్కొన్నారు. దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉందన్న ఆయన.. చర్యలు తీసుకోకపోతే లక్షలాది మంది యువత భవిష్యత్తుతో ఆడుకున్నట్లేనన్నారు.
పేపర్ లీక్ చేస్తే కనీసం మూడేళ్ల జైలు శిక్ష
పేపర్ లీక్ కేసుల్లో దోషులుగా తేలే వారికి కనీసం మూడు నుంచి ఐదేళ్ల జైలు శిక్ష పడుతుంది. అయితే పేపర్ లీక్ వ్యవహారాల్లో వ్యవస్థీకృత నేరాలకు పాల్పడిన వారికి ఐదు నుంచి పదేళ్ల జైలుశిక్ష విధించాలని బిల్లులో పెట్టారు. విద్యార్థులు, ఉద్యోగార్థుల భవిష్యత్‌తో ఆడుకోవడమే కాబట్టి.. ఇలాంటి నేరాలు చేసే వారికి భవిష్యత్ లేకుండా చేసేలా శిక్షలు ఉంటాయి.
నిర్వహణ బాధ్యతలు చేపట్టిన వారే లీక్ చేస్తే ఇక అంతే !
పరీక్షల నిర్వహణ బాధ్యతలను చేపట్టే సర్వీస్ ప్రొవైడర్ సంస్థలు పేపర్ లీక్ చేసినట్లు తేలితే వాటికి రూ.కోటి వరకు జరిమానా విధిస్తారు. పరీక్ష నిర్వహణకు అయిన ఖర్చునంతా సంస్థ నుంచి రికవర్ చేయాలనే ప్రతిపాదనను కూడా ఈ బిల్లులో పొందుపరిచారు. ఇలాంటి సంస్థపై పరీక్షలు నిర్వహించకుండా నాలుగేళ్ల పాటు బ్యాన్‌ను కూడా విధిస్తారు.
ఆషామాషీగా కాదు.. ఉన్నతాధికారుల విచారణ
పేపర్ లీక్ కేసుల విచారణను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లేదా అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ స్థాయి కంటే తక్కువ లేని అధికారి నిర్వహించాల్సి ఉంటుంది. దర్యాప్తును ఏదైనా కేంద్ర ఏజెన్సీకి అప్పగించే అధికారం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఈ బిల్లులో పేపర్ లీక్‌తో ముడిపడిన 20 రకాల నేరాలు, అక్రమాలకు పాల్పడే వారికి విధించాల్సిన శిక్షల గురించి ప్రస్తావించారు. మాస్ కాపీయింగ్, జవాబు పత్రాలను తారుమారు చేయడం, ఓఎంఆర్ షీట్లను ట్యాంపరింగ్ చేయడం వంటివన్నీ ఈ నేరాల జాబితాలో ఉన్నాయి.