TSPSC: 'గ్రూప్-4' పోస్టుల నియామకంపై టీఎస్‌పీఎస్సీకి హైకోర్టు కీలక ఆదేశాలు
గ్రూప్-4 పోస్టుల భర్తీకి సంబంధించి డైరెక్టర్ లేఖ ఆధారంగా అర్హత మార్కులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునేదాకా ఎక్స్ సర్వీస్‌మెన్ కోటా పోస్టుల భర్తీపై తుది నిర్ణయం తీసుకోరాదని ఆదేశాలు జారీచేశారు.
TSPSC Group-4 posts:
తెలంగాణలో గ్రూప్-4 పోస్టుల నియామకాల్లో ఎక్స్ సర్వీస్‌మెన్ కోటా పోస్టుల భర్తీ ప్రక్రియను ఖరారు చేయొద్దంటూ.. రాష్ట్రం ప్రభుత్వానికి, టీఎస్‌పీఎస్సీకి హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులతో సమానంగా అర్హత మార్కులను తగ్గించాలన్న సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ వినతిపై నిర్ణయం తీసుకునేదాకా ఈ ప్రక్రియ ఆపాలని పేర్కొంది.
రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధశాఖల్లో 'గ్రూప్-4' పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబరులో టీఎస్‌పీఎస్సీ జారీచేసిన నోటిఫికేషన్‌కు సంబంధించి నియామకాల్లో ఎక్స్-సర్వీస్‌మెన్‌కు అర్హత మార్కులు తగ్గింపుపై నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ బి.భాస్కర్ మరో 9 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. దీనిపై జస్టిస్ పి.మాధవీదేవి విచారణ చేపట్టారు.
విచారణలో భాగంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులతో సమానంగా తమకూ అర్హత మార్కులను 30 శాతానికి తగ్గించాలంటూ హోంశాఖ ముఖ్యకార్యదర్శికి, టీఎస్‌పీఎస్సీకి సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ లేఖలు రాశారన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి, టీఎస్‌పీఎస్సీ, రాష్ట్రహోంశాఖల మధ్య సంప్రదింపులు జరిగాయని అయితే ఇప్పటివరకు తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. నిర్ణయం వెలువడక ముందే నియామకాలు జరిగితే తమకు అన్యాయం జరుగుతుందన్నారు. ఎక్స్ సర్వీస్‌మెన్ కోటా కింద పోస్టుల కోసం ఇప్పటికే రాత పరీక్షలకు హాజరయ్యామన్నారు.
ఇరుపక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. డైరెక్టర్ లేఖ ఆధారంగా అర్హత మార్కులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునేదాకా ఎక్స్ సర్వీస్‌మెన్ కోటా పోస్టుల భర్తీపై తుది నిర్ణయం తీసుకోరాదని ఆదేశాలు జారీచేశారు. అర్హత మార్కుల తగ్గింపుపై ఈ ఉత్తర్వులు అందిన 30 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశిస్తూ పిటిషన్‌పై విచారణను ముగించారు.
తెలంగాణలో రాష్ట్రంలో వివిధ విభాగాల్లో గ్రూప్-4 కేటగిరీలో 8,039 ఉద్యోగాల భర్తీకి గతేడాది డిసెంబర్ 1న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 9,51,321 మంది దరఖాస్తు చేశారు. జులై 1న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షకు మొత్తం 80 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో పేపర్-1కు 7,62,872 మంది, పేపర్-2కు 7,61,198 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 'గ్రూప్-4' ప్రిలిమినరీ పరీక్ష ఆన్సర్ 'కీ'ని టీఎస్‌పీఎస్సీ ఆగస్టు 28న విడుదల చేసింది. ఆన్సర్ కీలో అభ్యంతరాలు తెలియజేసేందుకు ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 4 అవకాశం కల్పించింది. అనంతరం అక్టోబరు 6న ఫైనల్ కీని టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది.
గ్రూప్-4 తుది కీ వెల్లడించిన కమిషన్ పేపర్-1లో 7 ప్రశ్నలు, పేపర్-2లో 3 కలిపి మొత్తం 10 ప్రశ్నలు తొలగించింది. రెండు పేపర్లలో మొత్తం 13 ప్రశ్నల సమాధానాల్లో మార్పులు చేయగా, ఇందులో అయిదింటికి ఒకటి కన్నా ఎక్కువ సమాధానాలను సరైనవిగా పేర్కొంది. తుది కీ వెల్లడి కావడంతో అభ్యర్థుల జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తిచేసింది. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జనరల్ ర్యాంకు మెరిట్ జాబితా వెల్లడించాలని కమిషన్ భావిస్తోంది. పరీక్ష రాసిన అభ్యర్థులు పొందిన మార్కుల వివరాలు, జిల్లా స్థానికత, కేటగిరీ తదితర వివరాలు ఈ జాబితాలో ఉండనున్నాయి. మహిళలకు సమాంతర రిజర్వేషన్లపై హైకోర్టు స్పష్టతనిచ్చాక.. ఎన్నికల కోడ్ అనంతరం 1:2 నిష్పత్తి ప్రకారం తుది ఎంపిక జాబితాలు ప్రకటించనుంది.