EPFO: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే రూ.7 లక్షల ప్రయోజనం పొందండిలా!
ఎలాంటి ప్రీమియం చెల్లించకుండా ఏడు లక్షల రూపాయల ఉచిత బీమా సౌకర్యాన్ని ఈపీఎఫ్‌ఓ కల్పిస్తోంది. ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్(EDLI) స్కీమ్ కింద ఈ సౌకర్యం కల్పిస్తోంది..
మీరు ఉద్యోగం చేస్తున్నారా.. మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే రూ.7 లక్షల రూపాయల ప్రయోజనాన్ని పొందే అవకాశాన్ని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) కల్పించింది. ఎలాంటి ప్రీమియం చెల్లించకుండా ఏడు లక్షల రూపాయల ఉచిత బీమా సౌకర్యాన్ని ఈపీఎఫ్‌ఓ కల్పిస్తోంది. ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్(EDLI) స్కీమ్ కింద ఈ సౌకర్యం కల్పించింది. అంటే ఈపీఎఫ్ అకౌంట్ ఉంటే చాలు ఈడీఎల్ఐ స్కీమ్‌కు అర్హత సాధించినట్లే.
అసలేంటీ ఈడీఎల్ఐ స్కీమ్?
ఈ స్కీమ్ గురించి తెలిసినవారు తక్కువే. ఇది బీమా పథకం. అంటే ఈపీఎఫ్ ఖాతాదారులందరికీ ఈపీఎఫ్ఓ అందించే బీమా ప్రయోజనం. ఇటీవల ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్-EDLI స్కీమ్‌లో కొన్ని సవరణలు చేసింది ఈపీఎఫ్ఓ. ఎక్కువ మంది పీఎఫ్ ఖాతాదారులకు ఈ ఇన్స్యూరెన్స్ లాభాలు అందించేందుకు ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకుంది. ఈపీఎఫ్ ఖాతాదారుడు చనిపోవడానికి ముందు 12 నెలల కాలంలో ఒకటి కంటే ఎక్కువ సంస్థల్లో పనిచేసి సర్వీసులో మరణించినట్లయితే, వారి కుటుంబ సభ్యులకు కూడా బీమా ప్రయోజనం కల్పించాలని ఈపీఎఫ్ఓ నిర్ణయించింది. ఈ స్కీమ్ ద్వారా రూ.2.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ఉచితంగా బీమా పొందొచ్చు. ఈపీఎఫ్ ఖాతాదారులు సర్వీసులో ఉండగా మరణిస్తే నామినీకి ఈ బీమా మొత్తం లభిస్తుంది.
ఇ-నామినేషన్ ఉండాల్సిందే!
ఎంప్లాయీస్ డిపాజిట్‌లింక్డ్ ఇన్సూరెన్స్ పథకం (EDLI) ప్రయోజనాలు పొందాలంటే.. కచ్చితంగా ఇ- నామినేషన్ మొదట ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఇది వరకే ఇ- నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసి ఉంటే మళ్లీ చేయాల్సిన అవసరం లేదు. చేయకపోతే మాత్రం.. నామినీ వివరాలను ఈపీఎఫ్ ఖాతాలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో నామినీ వివరాలు నమోదుచేయడం సులువే. పీఎఫ్ మెంబర్స్.. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) సైట్‌లో ఇ-నామినేషన్ పూర్తి చేయొచ్చు. అయితే మీ యూఎఎన్ నంబర్‌కు ఆధార్ అనుసంధానమై ఉండాలి. ఇక ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్ కూడా పని చేస్తూ ఉండాలి. తర్వాత సులువుగా ఈపీఎఫ్‌ఓ పోర్టల్‌లో ఇ- నామినేషన్ పూర్తి చేయొచ్చు.
ఇ-నామినేషన్ ఇలా పూర్తి చేయండి...
స్టెప్-1: మీరు ముందుగా EPFO అధికారిక వెబ్‌సైట్ - https://www.epfindia.gov.in/ లోకి లాగిన్ కావాలి.
స్టెప్-2: అక్కడ హోంపేజీలో 'సర్వీసెస్' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
స్టెప్-3: తర్వాత 'ఎంప్లాయీస్' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
స్టెప్-4: ఇప్పుడు 'మెంబర్ UAN/ఆన్‌లైన్ సర్వీస్ (OCS/OTCP)'పై క్లిక్ చేయండి.
స్టెప్-5: తర్వాత UAN, పాస్‌వర్డ్‌ని ఎంట్రీ చేసి లాగిన్ అవ్వండి.
స్టెప్-6: దీని తర్వాత 'మేనేజ్' ట్యాబ్‌లో 'ఇ-నామినేషన్' ను ఎంచుకోండి.
స్టెప్-7: ఆ తర్వాత స్క్రీన్‌పై 'వివరాలను అందించండి' ట్యాబ్ కనిపిస్తుంది, 'సేవ్'పై క్లిక్ చేయండి.
స్టెప్-8: ఫ్యామిలీ డిక్లరేషన్‌ను అప్‌డేట్ చేయడానికి 'ఎస్' ఆప్షన్ పై క్లిక్ చేయండి.
స్టెప్-9: ఇప్పుడు 'Add Family Details' పై క్లిక్ చేయండి. నామినీగా ఒకరు లేదా ఎక్కువ మంది పేర్లు ఇచ్చుకోవచ్చు.
స్టెప్-10: ఏ నామినీకి ఎంత వాటా ఇవ్వాలో కూడా తెలపవచ్చు. వివరాలన్నీ నమోదు చేసిన తర్వాత 'సేవ్' పై క్లిక్ చేయండి.
స్టెప్-11: తర్వాత 'ఈపీఎఫ్ నామినేషన్'పై క్లిక్ చేయండి.
స్టెప్-12: తర్వాత OTP కోసం 'e-Sign'పై క్లిక్ చేయండి. ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.
స్టెప్-13: OTPని ఎంటర్ చేసిన తర్వాత సబ్‌మిట్ పై క్లిక్ చేయండి. దీంతో ఇ నామినేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.
ఎవరికి వర్తిస్తుంది..?
ఈడీఎల్ఐ స్కీమ్ నెలకు బేసిక్ సాలరీ రూ.15,000 లోపు ఉన్న వారందరికీ వర్తిస్తుంది. బేసిక్ సాలరీ రూ.15,000 దాటితే గరిష్టంగా రూ.7 లక్షల వరకే బీమా ఉంటుంది. ఈడీఎల్ఐ స్కీమ్‌లో చేరడానికి ఉద్యోగులు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎంప్లాయర్ మాత్రం బేసిక్ సాలరీలో 0.5% లేదా గరిష్ఠంగా రూ.75 ప్రతీ నెల చెల్లించాలి. ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్ సర్వీసులో చనిపోతే నామినీ ఈ బీమాను క్లెయిమ్ చేసుకోవచ్చు.
క్లెయిమ్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు..
* చనిపోయిన వ్యక్తి డెత్ సర్టిఫికెట్
* అవసరమైన పక్షంలో సక్సెషన్ సర్టిఫికేట్, గార్డియన్‌షిప్ సర్టిఫికేట్
* ఫామ్ 5 ఐఎఫ్
* నామినీ అకౌంట్‌కు చెందిన క్యాన్సల్డ్ చెక్ కావాలి.