Group 1 Jobs: పాల ప్యాకెట్లకే పైసల్లేవు, 3 కోట్లు ఎక్కడ నుంచి తెస్తాం సార్- TGPSC గ్రూప్ 1 ర్యాంకర్ తల్లి ఆవేదన
Telangana Group 1 Jobs | తమకు పాల ప్యాకెట్లు కొనేందుకే సరిగ్గా పైసల్లేవని, అలాంటిది 3 కోట్లు పెట్టి గ్రూప్ 1 జాబ్ ఎలా కొంటాం సార్ అని TGPSC గ్రూప్ 1 ర్యాంకర్ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.

TGPSC Group 1 Jobs | హైదరాబాద్: గ్రూప్ 1 మెయిన్స్ పేపర్లు రీవాల్యుయేషన్ చేయాలని, లేనిపక్షంలో ఎగ్జామ్ మళ్లీ నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇటీవల తీర్పు వెలువరించింది. అయితే రూ.3 కోట్లు ఇచ్చి గ్రూప్ 1 ఉద్యోగాలు సాధించారని, ఇది రూ.1700 కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపణలు రావడంతో ర్యాంకర్ల తల్లిదండ్రులు సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు.
పాల ప్యాకెట్‌కు పైసల్లేవు కానీ.. కోట్లు ఎక్కడ తెస్తాం..
ఓ ర్యాంకర్ తల్లి మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఏడుగురు బిడ్డలు, ఓ బాబు ఉన్నారని.. కూలీనాలి చేసుకుని వాళ్లను ప్రయోజకులు చేశానన్నారు. కొందరు పిల్లల్ని పనికి పంపించి ఒకర్ని చదివిపించి ఉద్యోగం వచ్చేందుకు కష్టపడ్డాం. పాల ప్యాకెట్‌కు పైసలు లేవంటే మీరు రూ.3 కోట్లు ఇచ్చారంటున్నారు. ఎక్కడి నుంచి తెస్తాం సార్. రూ.200, రూ.500తో పూట గడవడమే కష్టంగా ఉంది. ఒక్కడు బాగుపడితే కుటుంబాన్ని చూసుకుంటాడని ఆశలు పెట్టుకుంటే డబ్బులు ఇచ్చారని చెప్పడం సరికాదు. ఇప్పటికే రెండుసార్లు పరీక్షలు రద్దు చేశారు. మూడోసారి పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తారా ? వాళ్ల ఏజ్ అయిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
పండుగలకు ఇంటికి రాకుండా ప్రిపేర్ అయ్యాడు..
గ్రూప్ 1 57 ర్యాంకర్ ఉదయ్ కిరణ్ తల్లి లలిత మీడియాతో మాట్లాడుతూ.. మారుమూల పల్లె నుంచి వచ్చిన వాళ్లం. అతికష్టమ్మీద పిల్లలను తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పించాం. గత మూడేళ్లుగా దసరా పండుగలకు మా అబ్బాయి ఇంటికి కూడా రాకుండా ప్రిపేర్ అయ్యాడు. కోచింగ్ సెంటర్లో ఉండి ఎంతో పట్టుదలతో చదివి గ్రూప్ 1 ర్యాంక్ సాధించాడు. గతంలో పరీక్షలు నిర్వహించి రద్దు చేసినా, మానసికంగా సిద్ధమై మళ్లీ ఉద్యోగం సాధించాడు. ప్రతిసారి జాబ్స్ ఫలితాలపై దుష్ప్రచారం జరుగుతోంది. ప్రిలిమ్స్, మెయిన్స్ ఫలితాల తరువాత సైలెంట్ గా ఉన్న వాళ్లు ఇప్పుడు గ్రూప్ 1 పోస్టులకు ఎంపికైన తరువాత అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆరోపణలు చేస్తున్నారు. కష్టపడి చదివించారు. ఈ బాబును చూసి నేర్చుకోవాలి అని స్థానికంగా చెబుతుంటారు.
జాబ్ తెచ్చుకుని కుర్చీలో కూర్చోక ముందే ఉద్యోగాన్ని లాగేసుకుంటున్నారు. మళ్లీ పరీక్సలు నిర్వహించడం అంటే కింద పడిన అన్నాన్ని మళ్లీ తీసుకుని తినడమే. మళ్లీ ఎగ్జామ్ రాస్తే ఎంపికైనా అది కరెక్ట్ అన్న నమ్మకం ఎవరికైనా ఉంటుందా. రూ.3 కోట్లు ఇచ్చారని ఆరోపిస్తున్నారు. కనీసం రూ.30 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నవాళ్లు, అంత డబ్బు చూసిన వాళ్లు ఇక్కడ లేరు. ర్యాంక్ తెచ్చుకుని మా బాబు రోడ్డున పడినట్లుగా పరిస్థితి ఉంది.
మరో ర్యాంకర్ తల్లి మాట్లాడుతూ.. ఫలితాలు వచ్చి జాబ్ ఎక్కకముందే గ్రూప్ 1 ర్యాంకర్లపై అసత్యాలు ప్రచారం చేయడం సరికాదు. కోచింగ్ లేకుండా బుక్స్ చదివి జాబ్ తెచ్చుకున్న వారిని డబ్బులతో జాబ్ కొన్నారని ఆరోపించడం ఎంతవరకు సమంజసం. ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించి తల్లిదండ్రుల ఆవేదనను అర్థం చేసుకోవాలన్నారు.
కోదాడ పక్కన పల్లెటూరు నుంచి ర్యాంకర్ తల్లి సీత కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు పంపి పిల్లల్ని చదివించాను. నా కూతురు కష్టపడి చదివి జాబ్ తెచ్చుకుంటే రూ.3 కోట్లు ఆరోపణలతో జీవితాలు నాశనం చేస్తున్నారు. మాకు ఎవరూ పెద్దలు తెలవదు, రికమండేషన్లు చేయలేం. ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని కోరారు.
మరో ర్యాంకర్ తల్లి మాట్లాడుతూ.. కష్టపడి గ్రూప్ 1 ర్యాంక్ తెచ్చుకుంటే అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. చదువుకున్న రాజకీయ నాయకులు కూడా చదువుకోని వాళ్లలాగ మాట్లాడుతున్నారు. పిల్లల భవిష్యత్ ఏమవుతుందని తల్లిదండ్రులు ఎంతో ఆందోళన చెందుతున్నారు. జాబ్ సాధించిన వాళ్లను తప్పు చేసినవాళ్లుగా చిత్రీకరిస్తున్నారు.






















