జాబ్ ఇంటర్వ్యూలో ఈ బాడీ లాంగ్వేజ్ టిప్స్ పాటిస్తే ఉద్యోగం మీదే!
నడిచేటపుడు, కూర్చున్నపుడు, మాట్లాడేటపుడు మన బాడీ లాంగ్వేజ్ ని బట్టి అవతల వ్యక్తులకు మన గురించి చాలా విషయాలు అర్థమవుతుంటాయి. జాబ్ ఇంటర్వ్యూలో బాడీ లాంగ్వేజ్ చాలా ముఖ్యమైనది.
మనకు తెలియని వ్యక్తులనైనా సరే కాసేపు గమనించగానే వారి మీద కొంత అంచనాకు రాగలుగుతాం. ఇది సాధారణంగా మనం కెఫే లో చూసిన వ్యక్తి నుంచి జాబ్ ఇంటర్వ్యూ వరకూ వర్తిస్తుంది. ఈ అంచనా అనేది అవతల వ్యక్తి బాడీ లాంగ్వేజ్ వల్లనే చేయగలుగుతాం. అయితే, ఇంటర్వ్యూకి వెళ్లినపుడు ఈ చిన్న చిన్న బాడీ లాంగ్వేజ్ టిప్స్ పాటిస్తే ఇంటర్వ్యూయర్ దగ్గర మంచి ఇంప్రెషన్ కొట్టేసి, జాబ్ సంపాదించవచ్చు.
ఇంటర్వ్యూలో మీ స్కిల్, క్వాలిఫికేషన్ తో పాటూ మీ బాడీ లాంగ్వేజ్, పర్సనాలిటీ చాలా ముఖ్యం. మీరు గదిలోకి ఎంటర్ అయిన దగ్గరి నుంచి, మీ నాన్ వెర్బల్ సైన్స్ ని ఇంటర్వ్యూయర్స్ పసిగడుతూనే ఉంటారు. దీన్ని బట్టి మిమ్మల్ని జాబ్ కి సెలక్ట్ చేయాలా వద్దా అనే నిర్ణయం ఆధారపడి ఉంటుంది.
కూర్చున్నపుడు మీ వెన్నుముక నిటారుగా ఉండేలా చూసుకోండి. ఇది మీరు అలర్ట్ గా ఉన్నారని సూచిస్తుంది. నడిచేటపుడు కూడా భుజాలు వెళ్లాడేయకుండా హుందాగా నడవండి. లేదంటే నీరసంగా కనిపిస్తారు.
నడిచేటపుడు ఎక్కువ స్పీడ్ గా, ఎక్కువ నిదానంగా కాకుండా మధ్యస్థంగా కూల్ గా నడవండి. ఎక్కువ స్పీడ్ తో నడిస్తే మీరు కంగారు పడుతున్నట్టు కనిపిస్తారు. అలాగే అతి నెమ్మదిగా నడిస్తే బద్ధకస్థుల్లా కనబడుతారు.
అలాగే కుర్చీలో వెనక్కి ఒరిగి, మాట్లాడటం, పదే పదే ముందుకు వంగటం కూడా మంచి పద్ధతి కాదు. మీ ఇంట్రెస్ట్ ని చూపిస్తున్నట్టు చాలా కొద్దిగా ముందుకు లీన్ అయ్యి, నిటారుగా కూర్చోవటం మంచి మ్యానర్స్ ని సూచిస్తుంది. చేతులు కట్టుకోవటం, కాలు మీద కాలు వేసుకోవటం చేయొద్దు. సాధారణంగా ఇంటర్వ్యూయర్ కు మీకు మధ్యన ల్యాప్ టాప్ గానీ, బుక్స్ గానీ ఉండొచ్చు. మీరు నిటారుగా కూర్చున్నపుడు అవి అడ్డుగా ఉన్నచోట కాకుండా చూసుకోండి.
షేకింగ్, గోళ్లు గిల్లుకోవటం, ఎక్కువగా కదలటం, కాళ్ల వేళ్లతో ఫ్లోర్ ట్యాప్ చేయటం ఇవన్నీ మీరు నెర్వస్ అవుతున్నారని సూచిస్తాయి. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. మెడ, తల, నుదురు అనవసరంగా గోక్కోవటం వంటివి మీ మీద నెగెటివ్ ఇంప్రెషన్ ను కలిగిస్తాయి. మీరు మాట్లాడేటపుడు స్టీపుల్ హ్యాండ్ జెస్చర్(రెండు చేతుల వేళ్లు ఎదురెదురుగా ఒకదానికొకటి తాకే విధంగా ఉంచటం) ను ఉపయోగించండి. దీని వల్ల కాన్ఫిడెంట్ గా కనిపిస్తారు.
మాట్లాడేటపుడు 70 శాతం సమయం ఐ కాంటాక్ట్ మెయింటేన్ చేయండి. మొత్తం ఎదుటి వ్యక్తి కళ్లల్లోకే చూస్తూ మాట్లాడితే, వారికి ఇబ్బందిగా అనిపించే అవకాశం ఉంది. అసలే చూడకపోతే, మీరు భయస్థుల్లా కనపడుతారు.
మీ బాడీ లాంగ్వేజ్ తో పాటూ ఇంటర్వ్యూయర్ బాడీ లాంగ్వేజ్ కూడా మీరు గమనించాల్సి ఉంటుంది. మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగిన తర్వాత మీరు చెప్తున్న సమాధానం వల్ల వాళ్లు బోర్ ఫీలావూతూ, వారి బాడీ లాంగ్వేజ్ లో ఏదైనా నెగెటివ్ సిగ్నల్ కనపడుతోందా చూసుకోవాలి.
ఈసారి జాబ్ ఇంటర్వ్యూకి వెళ్లేటపుడు ఈ చిన్న టిప్స్ పాటిస్తే, మీకు ఉద్యోగం వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి.