AP Mega DSC Call Letters: ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్, 1:1 విధానంలో కాల్ లెటర్స్ జారీ
AP Mega DSC 2025 | ఏపీలో నిర్వహించిన మెగా డీఎస్సీ 2025 మెరిట్ జాబితా విడుదల తరువాత నేడు అభ్యర్థులకు 1:1 విధానంలో కాల్ లెటర్లు జారీ చేయనున్నారు.

AP DSC Merit List | అమరావతి: ఏపీ పాఠశాల విద్యాశాఖ ఇదివరకే మెగా డీఎస్సీ మెరిట్ జాబితాను విడుదల చేసింది. సోమవారం నుంచి అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రారంభం కానుంది. దీని కోసం 2 నుంచి మూడు రోజుల సమయం కేటాయించారు. రిజర్వేషన్ల ఆధారంగా కటాఫ్ మార్కులు నిర్ణయించగా, ఎంపికైన అభ్యర్థులకు 1:1 విధానంలో ఆదివారం నాడు కాల్‌లెటర్లు జారీ చేస్తారు. డీఎస్సీ మెరిట్ జాబితా అభ్యర్థులకు కాల్ లెటర్లు నేటి (ఆగస్టు 24) నుంచి అందుబాటులో ఉంటాయి.
డీఎస్సీ అభ్యర్థుల లాగిన్ అయి అధికారిక వెబ్‌సైట్‌లో కాల్‌లెటర్లు డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయ్యాక కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఈ మొత్తం ప్రక్రియను సెప్టెంబర్ మొదటి వారంలో పూర్తిచేసి, ఎంపికైన వారు రెండో వారంలోనే స్కూళ్లలో ఆయా పోస్టుల్లో చేరేలా విద్యాశాఖ కసరత్తు చేపట్టింది. జిల్లా స్థాయిలో రిజర్వేషన్లు, ధ్రువపత్రాల పరిశీలనలో సమస్యలు తలెత్తకుండా రాష్ట్ర స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించి, వారు స్థానిక అధికారులతో సమన్వయం చేస్తారు.
ఏపీ మెగా డీఎస్సీ ఫలితాల కోసం క్లిక్ చేయండి https://apdsc.apcfss.in/MeritList1
ఆ అభ్యర్థుల ఫలితాలు నిలిపివేత
కొంతమంది అభ్యర్థులు టెట్ ఒక సబ్జెక్టులో రాయగా, డీఎస్సీ ఎగ్జామ్ వేరే సబ్జెక్టులో రాశారు. దీంతో అధికారులు వారి ఫలితాలు నిలిపివేశారు. ఒక అభ్యర్థి టెట్‌లో ఇంగ్లీష్ రాసి, డీఎస్సీలో మరో సబ్జెక్ట్ ఎగ్జామ్ రాసినట్లు అధికారులు గుర్తించారు. మరికొందరు టెట్‌లో సాధారణ సబ్జెక్టులకు రాసి, ప్రత్యేక విద్య (Special Education) పోస్టులకు డీఎస్సీ రాశారు. వాస్తవానికి వీరు టెట్ 2వ పేపర్ రాయాలి. మరికొందరు సామాజికశాస్త్రంలో టెట్ రాసి, గణితం డీఎస్సీ రాశారు. వీరితో పాటు అర్హత పరీక్షలో ఉత్తీర్ణత కాకుండానే డీఎస్సీ రాసినవారి ఫలితాలు కూడా నిలిపివేశారు. దరఖాస్తు సమయానికే కోర్సు పూర్తి కావాలి అనే నిబంధన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆప్షన్ల ప్రకారమే ఉద్యోగాలు
ఏపీ డీఎస్సీలో అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అర్హత సాధిస్తారు. వారికి అన్ని ఉద్యోగాల అవకాశం ఉన్నప్పటికీ, అప్లికేషన్ సమయంలో ఇచ్చిన ఆప్షన్ల ఆధారంగానే ఉద్యోగం కేటాయిస్తారు. ఒకవేళ ఎవరైనా మూడు, నాలుగు పోస్టులకు అర్హత సాధించినా, దరఖాస్తు సమయంలో ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చిన పోస్టు వారికి కేటాయిస్తారు. తర్వాతి పోస్టులకు మెరిట్ జాబితాలో తరువాత పేరును సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు పిలుస్తారు.
మెరిట్ లిస్ట్ ఎలా చూడాలి
ఏపీ పాఠశాల విద్యాశాఖ ఆదివారం రాత్రి డీఎస్సీ అభ్యర్థులు మెరిట్ లిస్ట్ విడుదల చేసింది. అభ్యర్థులు వ్యక్తిగత లాగిన్ చేయకుండా నేరుగా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ ర్యాంకు చూసుకోవచ్చు. అన్ని రకాల మెరిట్ లిస్ట్‌లు అధికారిక వెబ్‌సైట్ లో పీడీఎఫ్ రూపంలో పొందుపరిచారు. ఎవరికి కావాల్సిన ఫలితాలను అభ్యర్థులు తమ పేర్లు, ర్యాంకులు చూసుకోవచ్చు.
ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://apdsc.apcfss.in సందర్శించాలి. అందులో మెగా డీఎస్సీ మెరిట్ లిస్ట్ పేరుతో స్క్రోల్ అవుతూ ఉంటుంది. దానిపై క్లిక్ చేయగా పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీకు కావాల్సిన జోన్, జిల్లా, సబ్జెక్టుల వారిగా మెరిట్ లిస్ట్ చెక్ చేసుకోవచ్చు.






















