IT Jobs layoffs: ఐటీ సెక్టార్‌లో డేంజర్ బెల్స్.. ఈ ఏడాది 50000 ఉద్యోగాల కోత! రోడ్డున పడుతున్న టెకీలు
Software Jobs Layoffs: TCS, Accenture లాంటి దిగ్గజ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ సంవత్సరం చివరి నాటికి 50,000 మందికి పైగా టెకీలు ఉద్యోగాలు కోల్పోనున్నారని సమాచారం.

IT companies layoffs: దేశంలోని ఐటీ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగాల కోత జరగనుంది. ఒక అంచనా ప్రకారం, ఈ సంవత్సరం చివరి నాటికి 50,000 మందికి పైగా ఐటీ కంపెనీల్లో పనిచేసే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇది ఎక్కువ కావచ్చు, ఆ సంక్యలో సగం కూడా ఉండవచ్చు. కానీ సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగాలు పోవడం మాత్రం ఖాయమని పలు నివేదికలు చెబుతున్నాయి. కొందరు నిపుణులు సైతం అదే అంచనా వేస్తున్నారు.
2023, 2024 సంవత్సాల మధ్య దాదాపు 25,000 మంది ఐటీ సెక్టార్‌లో ఉద్యోగాలు కోల్పోయారు. ఈ సంవత్సరం ఈ సంఖ్య గతానికి రెట్టింపు కావచ్చు అని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంది. తమ సిబ్బందిని తగ్గించుకోవడానికి ప్రముఖ ఐటీ కంపెనీలు అనేక మార్గాలను అవలంబిస్తున్నాయి. పనితీరు సరిగ్గా లేదని కొందరిని ఉద్యోగాల నుంచి తొలగిస్తుండగా, ప్రాజెక్టులు లేవని కొందర్ని లేఆఫ్ చేస్తున్నారు. మరికొందరికి ప్రమోషన్లు ఇవ్వకుండా, జీతాలు పెంచకుండా ఆలస్యం చేస్తున్నారు లేదా స్వచ్ఛంద రాజీనామాలు సమర్పించాలని ఉద్యోగులను సంస్థలు కోరుతున్నాయి.
ఐటీలో ఇంకా తొలగింపులకు అవకాశం
ఇటీవల ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలైన టాటా కన్సలెన్సీ సర్వీసెస్ (TCS) , Accenture వంటి ఐటీ కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగాల కోత ప్రకటించాయి. TCS మార్చి 2026 నాటికి దాదాపు 12,000 మంది ఉద్యోగులను తొలగించాలని చూస్తోంది. ఇది టీసీఎస్ సంస్థ మొత్తం సిబ్బందిలో 2 శాతం అని తెలిసిందే. అదే సమయంలో, Accenture జూన్ నెల, ఆగస్టు మధ్య ప్రపంచవ్యాప్తంగా 11,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. US ఆధారిత HFS రీసెర్చ్ CEO ఫిల్ ఫర్స్ట్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ కీలక విషయాన్ని వెల్లడించారు. ఈ సంవత్సరం ప్రముఖ ఐటీ కంపెనీలు సీక్రెట్‌గా ఉద్యోగాల్లో కోత విధించిందని, స్వచ్ఛందంగా రాజీనామా చేసేలా, లేక ప్రాజెక్టులు లేకపోవడం లాంటి పలు కారణాలతో లేఆఫ్స్ చేశాయని తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశంలోకి విదేశీ టెకీలను అనుమతించడంపై ఎన్నో ఆంక్షలు విధించారు. H1b వీసా దరఖాస్తుల కోసం ఏకంగా లక్ష డాలర్లను కంపెనీలు చెల్లించాలని ఇటీవల ఎగ్టిక్యూటివ్ ఆర్డర్స్ పై సంతకాలు చేశారు. మరోవైపు ఆయన నిర్ణయాలతో ఐటీతో పాటు పలు రంగాల్లో అనిశ్చితి నెలకొంది. వీటితో పాటు కొత్త టెక్నాలజీ ఏఐ కారణంగా పాత ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతోంది. ప్రపంచ వ్యాప్తంగా పలు సంస్థలు కొత్త టెక్నాలజీ వైపు మొగ్గు చూపడం, మెషిన్ టూల్స్ ఉద్యోగాలను భర్తీ చేయబోతుండటం సైతం లేఆఫ్ లకు ఓ కారణమని చెబుతున్నారు.






















