Omicron Sub-Variant BA.2: బీ అలర్ట్.. దేశంలో ఆ వేరియంట్ వ్యాప్తే ఎక్కువగా ఉందట!
దేశంలో ప్రస్తుతం ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BA.2 వ్యాప్తి ఎక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
కరోనా థర్డ్ వేవ్‌తో ఇప్పటికే బెంబేలెత్తిపోతోన్న దేశాన్ని ఇప్పుడు దాని సబ్ వేరియంట్ BA.2 భయపెడుతోంది. ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BA.2 ఎక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
భారత్‌కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులను టెస్ట్ చేస్తే గతంలో వారిలో ఒమిక్రాన్ వేరియంట్ BA.1 కనిపించేదని.. కానీ, ఇప్పుడు ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BA.2 ఎక్కువగా కనిపిస్తోందని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ డైరెక్టర్ సుజీత్ సింగ్ అన్నారు.
కొవిడ్ పరిస్థితి..
ప్రస్తుతం దేశంలో కొవిడ్ పాజిటివిటీ రేటు 17 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య ఇప్పటికీ 2 లక్షలకు పైగానే ఉందని సీనియర్ అధికారి లవ్ అగర్వాల్ అన్నారు.
ఏ రాష్ట్రంలో ఎలా?
మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, దిల్లీ, ఒడిశా, హరియాణా, బంగాల్‌లో కొవిడ్ కేసులు, పాజిటివిటీ రేటు తగ్గుతున్నట్లు అధికారులు తెలిపారు.
కర్ణాటక, కేరళ, తమిళనాడు, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్‌లో మాత్రం భారీ సంఖ్యలో కరోనా కేసులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.